Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ కి ఈ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకునే శక్తి ఉందా?

జగన్ కి ఈ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకునే శక్తి ఉందా?

అమరావతి రైతుల ఆర్తనాదాలన్నారు. రాష్ట్రమంతా అమరావతి జ్వరాన్ని ఎక్కించాలనుకున్నారు. నానా యాతన పడ్డాక అది జరగని పని అని తెలిసింది. అమరావతి ప్రాంతంలో భూములున్నవాళ్లకి తప్ప ఇంకెవ్వరికీ ఆ పాయింట్ ఎక్కదేమో అనుకుని కనీసం అక్కడన్నా పసుపు జెండా ఎగరేద్దామనుకున్నారు. కానీ అదేంటో.. అదే ప్రాంతంలో పంచాయితీ, కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో టీడీపీ కళ్లు బైర్లు కమ్మాయి. ప్రస్తుతానికి అమరావతి ఉద్యమం పరిస్థితి ఫ్లాపైన డైలీ సీరియల్లా ఉంది. 600, 700 అనుకుంటూ ఎపిసోడ్ నెంబర్లేసుకోవడమే. చివరికి సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బుకి విశ్వాసం చూపుతూ జనం వైసీపీకే ఓటేసారని పసుపు పార్టీవారు గ్రహించారు. 

దళితుల మీద దాడులన్నారు. మిగతా కులాల వారికి ఎలాగూ పట్టదు. అదేంటో దళితుల్నుంచి కూడా రావాల్సినంత స్పందన రాలేదు. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బుకి విశ్వాసం చూపుతూ దళితులు కూడా వైసీపీకే ఓటేసారని పసుపు పార్టీవారు అనుకుని సరిపెట్టుకున్నారు. 

టీడీపీ నాయకులపై కక్ష సాధింపన్నారు. అయితే మాకేంటి అనుకున్నారు జనం. ఎంటైర్టైన్మెంట్ ప్రోగ్రాం చూసినట్టు చూసారు తప్ప ఆయా నాయకులకి సొంత నియోజక వర్గాల్లో కూడా సింపతీ రాలేదు. ఏ నియోజక వర్గమైతే ఏంటి? అక్కడి ప్రజలకి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయిగా. 

దేవాలయాల విధ్వంసం అన్నారు. తర్వాత టీడీపీ నాయకుల హస్తం కూడా ఇందులో ఉందని కొన్ని చోట్ల బయట పడింది. కొందరు అన్య మత ప్రచారకుల పని అని కూడా కొన్ని వీడియోల ద్వారా తెలిసింది. కాస్త హడావిడి జరిగినా దీని ప్రభావం ఏ మాత్రం స్థానిక ఎన్నికల మీద పడలేదు. అదేంటో విడ్డూరం. ఎన్నికలైపోగానే ఈ దాడుల వార్తలు కూడా కనుమరుగయ్యాయి. అంతరార్థం ఐదో తరగతి పిల్లాడు కూడా చెప్తాడు. 

కోర్టుల మొట్టికాయలన్నారు. ప్రభుత్వం కోర్టుల్ని వ్యతిరేకిస్తోందని, తీర్పుల్ని పట్టించుకోవడం లేదని గగ్గోలు పెట్టారు. పథకాలతో మా కడుపు నిండుతున్నంత వరకు ప్రభుత్వానికి, కోర్టుకి మధ్యలో సంబంధాలతో మాకేంటి పని అనుకున్నారు జనం. 

ఇంగ్లీష్ మీడియంతో తెలుగుని చంపేస్తున్నారన్నారు. మా పిల్లలకి పెద్దోళ్ల చదువులు చదివిస్తానని జగనంటుంటే ఈ పసుపుపక్షుల గోలేంటి అని జనం అనుకున్నారు తప్ప ఎటువంటి ఎమోషన్ కి గురి కాలేదు. అయినా ఇంగ్లీషు చదువులు చదివితే తెలుగు నేల మీద తెలుగువాడి నుంచి తెలుగు పోతుందా...!.. వీళ్ల రాజకీయం కాకపోతే అని పక్కనపెట్టారు. 

సొంత పార్టీలోని రిబెల్ ని రెచ్చగొట్టి వాడుకున్నారు. జనానికి టైంపాస్ తప్ప ఇంకేమీ లేదు. అయినా అతనిది సొంత పార్టీ వాడి గోడులాగ ఎప్పుడూ లేదు. వైసీపీ చర్మం కప్పుకున్న టీడీపీ మనిషిగానే జనం భావిస్తున్నారు కనుక అనుకున్న పని జరగడంలేదు ప్రతిపక్షానికి. 

అభివృద్ధి ఆగిపోయిందన్నారు. పథకాలతో బ్యాంక్ అకౌంట్లు గల్లు గల్లుమంటుంటే అభివృద్ధి లేదంటారేంటి అనుకున్నాడు కామన్ మ్యాన్. 

జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధంటే మేడలు, మిద్దెలు, భవనాలు కాదు..ప్రజలు సంతోషంగా ఉండడమే అని చెప్పారు పరోక్షంగా తన పథకాలని సమర్ధించుకుంటూ. 

ఇప్పటి వరకు కథ ఇలా నడిచింది. ఎలా చూసినా జనంలో ప్రభుత్వ వ్యతిరేకత రావట్లేదు. కారణం...దాదాపు అన్ని చోట్లా పథకాల వల్ల కడుపు నిండడమే. కాబట్టి ఆ కడుపునే కొడితే పోలా!!! అని కుయుక్తి పన్నింది ప్రతిపక్షం. 

ఢిల్లీలో ఇదే పని మీద ఒక టీం దిగింది. కేంద్రం నుంచి ఆ.ప్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో రాకుండా చేయడమే ఆ టీం పని. రకరకాల లాబీయింగులతో కింద స్థాయి ఆఫీసర్లను పక్కకు పిలిచి పనిని వాయిదా వేయించడం వీరి ప్లాన్. ఆ కాగితం తెమ్మని, ఈ డాక్యుమెంట్ పంపండని, ఈ రోజు లీవులో ఉన్ననని..తలచుకుంటే ఎన్ని సాకులుంటాయి పనిని వాయిదా వెయడానికి?!! బల్ల కింద పని జరిపి బల్ల మీద పెట్టాల్సిన సంతకాన్ని ఒక 10 రోజులు వాయిదా వేసినా చాలు. ఇక్కడ ఆంధ్రలో పథకం తాలూకు డబ్బు సకాలంలో ప్రజల అకౌంట్లో పడవు. 

"అదిగో చూసారా! డబ్బులైపోయాయి. ఈ నెల ఆలస్యమయ్యింది. వచ్చే నెల అసలే పడవు" అని ఒకేసారి పథకాలు అందుకుంటున్న జనంలో అనుమానాలు, భయాలు సృష్టించొచ్చు. ఇన్నాళ్లూ చేయలనుకున్నది ఇప్పుడు చేయొచ్చు. 

సకాలంలో రావాల్సిన డబ్బు రాకపోతే ఒక కుటుంబానికి ఎన్ని ఇబ్బందులెదురవుతాయో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. 

ఒక యాచకుడు మరొక యాచకుడితో ఇలా అన్నాడట. "ఎప్పుడూ పెట్టనమ్మ ఎలాగూ పెట్టలేదు. రోజూ పెట్టే ముండ కూడా పెట్టడం మానేసింది" అని. రోజూ అన్నం పెట్టే వాడు అమాంతం పెట్టడం ఆపేస్తే ఇలాంటి అసహనమే ప్రజల్లో వస్తుంది. అంతవరకూ దేవుడుగా భావించే వాళ్లు కూడా అసభ్యపదజాలంతో తిడతారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత తధ్యం. 

ఇదే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడ. వాళ్ళ దృష్టిలో ఇది బ్రహ్మాస్త్రం. దీనిని జగన్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొని కూడా నిలబడితే ఇక జగన్ కి తిరుగులేదనుకోవాలి. ఇంత చేసినా ప్రతిపక్షం ఎత్తుగడ ఫలించకపోతే రాజకీయంలో ఉన్నా లేనట్టే అనుకోవాలి. ఇది ప్రతిపక్షానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న అతి పెద్ద అస్త్ర యుద్ధం. ఒక రకంగా ఇది క్లైమాక్స్ ఫైట్ లాంటిది. దైవాన్ని, ప్రజల్ని, తనని తప్ప నాలుగో అంశాన్ని నమ్మని జగన్ ఇప్పుడేం చేస్తారో నిజంగా ఆసక్తికరం. 

గ్రేట్ ఆంధ్రా బ్యూరో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?