cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అసెంబ్లీలో వైకాపాకు అనధికార సభ్యుడు?

అసెంబ్లీలో వైకాపాకు అనధికార సభ్యుడు?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పూర్తిగా మట్టికరిచింది. అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోయి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. పోనీ పార్టీ పూర్తిగా ఓడిపోయినా ఆయన ఒక్కడూ అసెంబ్లీలో అడుగు పెట్టివుంటే పరిస్థితి ఎలా ఉండేదో. పార్టీ దారుణంగా ఓడిపోయినా రాపాక వరప్రసాద్‌ అనే అభ్యర్థి ఒక్కడూ నాలుగు వేల చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం పవన్‌ కళ్యాణ్‌కు ఊరట కలిగించింది. అసెంబ్లీలో వైకాపా, టీడీపీ రెండు పార్టీలే కాదు జనసేనతో పాటు మూడు పార్టీలు ఉన్నాయని అనుకున్నాడేమో.

కాని ఉన్నవి రెండు పార్టీలేనని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ నిరూపించాడు. దీంతో పవన్‌ కళ్యాణ్‌ మరోసారి ఓడిపోయాడు. తాను పేరుకు జనసేన పార్టీ అభ్యర్థిని అయినప్పటికీ అనధికారికంగా వైకాపా అభ్యర్థినని జనాలకు తెలియచేశాడు. ఆయనేమీ పార్టీ ఫిరాయించలేదు కదా అనుకోవచ్చు. కండువా మార్చుకొని అధికార పార్టీలోకి వెళ్లే అవకాశం ఏపీలో సీఎం జగన్‌ కల్పించలేదు. కాని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెటును జనసేన ఎమ్మెల్యే 'ఆహా... ఓహో.. అద్భుతం... అమోఘం' అంటూ స్తోత్రం చేయడం పవన్‌ కళ్యాణ్‌కు ఎలా అనిపించిందో ఇప్పటివరకు తెలియదు.

ఆయన దీన్ని లైట్‌ తీసుకున్నాడో, సీరియస్‌ అయ్యాడో తెలియదు. రాపాక వరప్రసాద్‌ బడ్జెట్‌పై సభలో వెలిబుచ్చిన అభిప్రాయాలు పార్టీ అభిప్రాయం కాదనే విషయం స్పష్టమైంది. ఎందుకంటే.. బడ్జెట్‌ వచ్చాక జనసేనకు చెందిన ఓ నాయకుడు అధికారికంగా పార్టీ కార్యాలయంలోనే బడ్జెట్‌పై పార్టీ అభిప్రాయాలు వెలిబుచ్చాడు. సహజంగానే అన్ని ప్రతిపక్షాల మాదిరిగానే విమర్శలు చేశాడు. బడ్జెటులో ఫలాన లోపాలు ఉన్నాయని తెలియచేశాడు. అభివృద్ధికి, సంక్షేమానికి పొంతనలేదని అన్నాడు. నవరత్నాల అమలుకు నిధులు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించాడు.

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెటులో కేవలం ఐదు వేల కోట్లు కేటాయించారని, అనుకున్న ప్రకారం అది పూర్తి కావలంటే 32 వేల కోట్లు కావాలని అన్నాడు. ఆరోగ్యశ్రీ నిధులను ప్రయివేటు ఆస్పత్రులకు ధారపోయడం కంటే ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలన్నాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడనుకోండి. ఏ బడ్జెటులోనైనా పూర్తిగా పనికిమాలిన విషయాలే ఉండవు. రెండో మూడో మెచ్చుకునే అంశాలుంటాయి. కాని ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితమవుతాయి. ఒకవేళ మెచ్చుకోవల్సిన అంశాలుంటే విమర్శలు చేశాకనే వాటి గురించి ప్రస్తావిస్తాయి. అయితే అద్భుతం...అమోఘం అని ప్రతిపక్షాలు అనవు.

ఇక అధికారపక్షం వారు బడ్జెటు ఎంత ఛండాలంగా ఉన్నా ఆకాశానికెత్తుతారు. బడ్జెటు సమయంలో ఈ దృశ్యం కనబడుతూ ఉంటుంది. బడ్జెటుపై ఏ ప్రతిపక్షమైనా బయట ఏ విమర్శలు చేస్తుందో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చట్టసభలోనూ అదే మాట్లాడతారు. కాని జనసేన విషయంలో ఇది పూర్తిగా రివర్స్‌ అయింది. పార్టీ అభిప్రాయం ఒకటైతే, ఆ పార్టీ ఎమ్మెల్యే అభిప్రాయం మరోలా ఉంది. బడ్జెటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే మెచ్చుకోవాలని అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పాడని రాపాక వరప్రసాద్‌ అన్నాడు.

మరి బడ్జెటు ప్రజలకు ఉపయోగకరంగా ఉందని దాన్ని గురించి మాట్లాడిన జనసేన నాయకుడికి పవన్‌ ఏమీ చెప్పలేదా? ప్రతి పార్టీ అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో, ఏ అంశం మీద ఎలా మాట్లాడాలో ముందే ప్యూహం రచించుకుంటుంది. దాని ప్రకారమే మాట్లాడతారు. కాని జనసేనకు అదేమీలేదు. ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనే కదా అని వదిలేశారేమో. ఎమ్మెల్యే రాపాక ప్రసంగం మొదలుపెడుతూనే బడ్జెటు పుస్తకాన్ని చూపిస్తూ మొదటి పేజీ నుంచి చివరిపేజీ వరకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అద్భుతంగా ఉందన్నాడు.

వెంటనే అధికార పార్టీ సభ్యులు గట్టిగా బల్లలు చరిచారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపూ బల్లలు చరచడమే సరిపోయింది. సీఎం జగన్‌ ముసిముసిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీలయ్యాడు. టీడీపీ సభ్యులు 'నువ్వు జనసేనా? జగన్‌సేనా' విమర్శలు చేశారు. రాపాక ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడినట్లు అర్థమవుతోంది. ఆయన అనధికారికంగా వైకాపా సభ్యుడిగా వ్యవహరించాలనుకుంటున్నాడేమో..! గతంలో ఓసారి ఎన్నికల్లో సీపీఎం తరపున ఒక్కరే ఎన్నికయ్యారు.

అప్పుడా పార్టీ ముఖ్యనేత ఒకరు 'మా పార్టీ ఎమ్మెల్యే ఒక్కడున్నా వందమంది పెట్టు' అని వ్యాఖ్యానించాడు. కాని అలా అనుకునే అదృష్టం పవన్‌ కళ్యాణ్‌కు లేదు. ఎన్నికల తరువాత ఆయన సైలెంటైపోయాడు. 

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా