Advertisement

Advertisement


Home > Politics - Political News

విస్తరించనున్న 'ట్రూజెట్' విమాన సర్వీసులు

విస్తరించనున్న 'ట్రూజెట్' విమాన సర్వీసులు

దేశవ్యాప్తంగా విమానయాన సేవలు విస్తరిస్తున్న ట్రుజెట్ ఈ ఏడాది చివరి నాటికి తన విమానాల సంఖ్యను రెట్టింపు అంటే 10కి పెంచుకుని మరిన్ని సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ట్రుజెట్ క్రమంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు అనతికాంలో విస్తరించింది. 2015 జులైలో రెండు ఎటిఆర్ 72 విమానాతో ప్రారంభమైన సంస్థ అనతికాలంలోనే వాటిని 5కు పెంచుకోగలిగింది. దేశవ్యాప్తంగా 20 కేంద్రాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. 

ఓవైపు ప్రాంతీయ విమాన సర్వీసులు ఆర్థిక సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మూతపడుతుంటే ఎంఇఐఎల్ ఏర్పాటు చేసిన ట్రుజెట్ మాత్రం తన సేవలను, వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పటిష్టపడటమే కాకుండా లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ప్రధానంగా 'ఉడాన్' పథకం కింద సేవలను నిర్వర్తిస్తూ 2019 డిసెంబరు నాటికి 5 ఎటిఆర్ 72 విమానాల నుంచి 10 ఎటిఆర్ 72 విమానాలను పెంచుకునే విధంగా ఏర్పాట్లు, ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎంఇఐఎల్ డైరెక్టర్ కె.వి. ప్రదీప్ తెలిపారు.

ట్రుజెట్ 'ఉడాన్' రూట్లలో 73 శాతం సామర్ధ్యంతో సమర్ధంగా సేవలను అందిస్తోంది. ఈ పథకం కింద సేవలను అందించే అతిపెద్ద విమానయాన సంస్థగా ట్రుజెట్ పేరు సంపాదించుకుంది. గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలో విమాన సేవలు అందుబాటులోకి తేవాలనే ప్రధానమంత్రి ఉద్దేశంలో భాగంగా ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద తొలుత దక్షిణ భారతదేశంలో సేవలు ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా సేవలను విస్తరిస్తోంది.

సంస్థ సిఇఒ, రిటైర్డ్ కల్నల్ ఎల్.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను విమాన సేవ పరిధిలోకి తీసుకువచ్చే అంశంలో ట్రుజెట్ విశేషమైన కృషి చేసిందన్నారు. ఇది మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతృ సంస్థ ఎంఇఐఎల్ నుండి తమకు పూర్తి సహాయసహాకారాలు అందుతున్నాయన్నారు. అంతేగాక విమానాల నిర్వహణ, విమానాశ్రయాల సేవలు, పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్, బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో పాటు 700 మంది సిబ్బందితో ట్రుజెట్ దేశీయ విమానయాన రంగంలో మరింత విస్తృతం కానుందని చెప్పారు.

ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో... నాలుగేళ్ల క్రితం అంటే 2015 జులై నెలలో టర్బోమేఘా ఏవియేషన్ లిమిటెడ్ తన విమాన సేవల బ్రాండ్ ట్రుజెట్ పేరుతో తన సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్, అహ్మదాబాద్ కేంద్రాలుగా దేశంలో 20కి పైగా పట్టణాలకు వారానికి 300 విమాన సర్వీసులను అందిస్తున్నది. ముంబయ్, చెన్నయ్, బెంగళూరు, గోవా, ఔరంగాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, సేలం, విద్యానగర్, మైసూర్, నాందేడ్, పోర్బందర్, నాసిక్, కాండ్లా, జైసల్మీర్, ఇండోర్ నగరాలకు తన విమానాలను నడుపుతున్నది.

ప్రస్తుతం ట్రుజెట్ చేతిలో ఎటిఆర్ 72 రకం విమానాలు 5 వున్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో 700కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఉడాన్ 1, ఉడాన్ 2 పథకంలో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించిన ఏకైక సంస్థ ట్రుజెట్. ఉడాన్ 3 పథకంలో పేర్కొన్న ప్రాంతాలకు కూడా తన సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నది. 

గత నాలుగేళ్లలో దాదాపు 2 మిలియన్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి పలు అవార్డులను, ప్రశంసలను అందుకుంది. కార్యక్రమంలో ట్రూజెట్ సీసీవో సుధీర్ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?