Advertisement

Advertisement


Home > Politics - Political News

గ్రేటర్ సాక్షిగా గొయ్యి తవ్వుకున్న జనసేన

గ్రేటర్ సాక్షిగా గొయ్యి తవ్వుకున్న జనసేన

పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ త్యాగాలు చేయడంలో రికార్డులు సృష్టించిందే తప్ప, విజయాలు సాధించడంలో ఓనమాలు కూడా నేర్చుకోలేకపోయింది జనసేన. ఏడేళ్లుగా వచ్చిన ప్రతి అవకాశాన్నీ చేజార్చుకుంటూనే వచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. 

రాష్ట్ర విభజన వేళ.. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ఎన్నికల్లో కేసీఆర్ కి భయపడి పోటీ నుంచే విరమించుకున్నారు. కనీసం ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో కూడా కార్యకర్తలకు తేల్చి చెప్పలేని స్థితిలోకి వెళ్లారు.

ఓసారి పొత్తులు, మరోసారి త్యాగం, ఇంకోసారి సమయాభావం.. ఇలా పవన్ కల్యాణ్ తన చేతగానితనానికి ఏ పేరు పెట్టుకున్నా.. ప్రత్యర్థులు మాత్రం దానికి ప్యాకేజీ అనే అందమైన ట్యాగ్ లైన్ ఇచ్చారు. పవర్ స్టార్ ని కాస్తా ప్యాకేజీ స్టార్ అంటూ ట్రోలింగ్ చేసేలా చేశాయి.

తెలంగాణలో అశేష అభిమాన గణం ఉన్నా, చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఉన్నా కూడా పార్టీని పడుకోబెట్టేశారు పవన్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో పొలిటికల్ గా జనసేన యాక్టివ్ అయిన దాఖలాలు లేనే లేవు.తీరా ఇప్పుడు గ్రేటర్ బరిలో అవకాశం దొరికినా "విస్తృత ప్రయోజనాల" కోసం త్యాగం చేసేశారు. 

ఇక పవన్ కల్యాణ్ ని కార్యకర్తలు, నాయకులు ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి?  పార్టీ కోసం కష్టపడి, బలమైన క్యాడర్ ని తయారు చేసుకున్నా.. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసే అవకాశం వస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినా చివరి నిముషంలో పవన్ ఏ టర్న్ తీసుకుంటారో అనే భయం కూడా వారిలో ఉంది.

అసలిప్పుడు పవన్ చేసిన పెద్ద తప్పేంటంటే.. పొత్తు పెట్టుకుని కూడా సీట్లు అడక్కపోవడం. బీజేపీతో సీట్ల సర్దుబాటులో భాగంగా మొత్తం 150 సీట్లు ఆ పార్టీకే అప్పగించడం. 2014 ఎన్నికల్లో కూడా అదే తప్పు చేశారు పవన్.. ఆరేళ్ల తర్వాత కనీసం కార్పొరేటర్ స్థానానికి కూడా పోటీ చేయలేకపోతున్నారంటే పవన్ ని జనసైనికులు ఎలా అర్థం చేసుకోవాలి.

గెలుస్తామా? ఓడిపోతామా అనే విషయం పక్కనపెడితే.. పోటీలో ఉంటేనే రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మనుగడ. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు కాబట్టే సీట్లు లేకపోయినా వామపక్షాలకు ఓట్లున్నాయి, నాయకులున్నారు. 

అంతెందుకు గెలవలేమని తెలిసి కూడా చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించారంటే కారణం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసమే. ఒక్క సీటుతో మొదలైన జగన్ ప్రయాణం నేడు 151కి చేరిందంటే.. ఆయనలో లేనిది, పవన్ లో ఉన్నది భయం ఒక్కటే.

పోనీ జగన్ లాగా తెలంగాణ ఎన్నికలకు మేము దూరం అని పవన్ స్టేట్ మెంట్ ఇచ్చారా అంటే అదీ లేదు. పొత్తులన్నారు, చర్చలన్నారు, జాబితా రేపే అన్నారు. చివరకు తుస్సుమనిపించారు. 

బీజేపీ నేతల చీత్కారాలు దీనికి అదనం. చేతికి అందివచ్చిన అవకాశాన్ని వదులుకున్న పవన్.. మళ్లీ తెలంగాణ బరిలో దిగాలంటే చాన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి. అప్పటికి పవన్ కి ఎవరి విస్తృత ప్రయోజనాలు గుర్తొస్తాయో? అప్పటికి రాజు ఎవరో? బంటు ఎవరో?

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?