Advertisement

Advertisement


Home > Politics - Political News

లాక్ డౌన్ ఎత్తేశారు.. రోడ్లు, షాపులు ఖాళీగా మారాయ్!

లాక్ డౌన్ ఎత్తేశారు.. రోడ్లు, షాపులు ఖాళీగా మారాయ్!

దేశంలో మేధావులు, ప్ర‌భుత్వాలు.. క‌రోనా నివార‌ణ‌కు లాక్ డౌనే ప‌రిష్కారం అని తేల్చారు. ఎడాపెడా లాక్ డౌన్లు విధించాల‌ని.. నెల‌ల కొద్దీ జ‌నాల‌ను బ‌య‌ట‌కు రానీయ‌కూడ‌ద‌ని, అప్పుడే క‌రోనా కంట్రోల్ లోకి వ‌స్తుంద‌ని డ‌బ్ల్యూహెచ్వో ద‌గ్గ‌ర నుంచి దేశీయ వైద్య‌రంగ మేధావులు కూడా చెబుతూ ఉంటారు. అయితే డ‌బ్ల్యూహెచ్వో, వైద్యులు త‌మకు అవ‌గాహ‌న ఉన్న అంశాల గురించి మాట్లాడితే మాత్ర‌మే బాగుంటుంది. వాళ్లు వైద్య రంగ ప‌రిశోధ‌కులు అయితే అయి ఉండొచ్చు కానీ, సోషియ‌ల్ విష‌యాలు వారికి ఎంత వ‌ర‌కూ తెలుసు మ‌రి! 

అలాగే లాక్ డౌనే క‌రోనా నివార‌ణ‌కు మార్గం అని చెప్పే ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌జ‌ల తీరును ఇప్ప‌టికైనా కాస్త ప‌రిశీలిస్తే మంచిది. ఏపీలో, తెలంగాణ‌లో లాక్ డౌన్ రిస్ట్రిక్ష‌న్లను స‌డ‌లించాకా.. రోడ్ల‌న్నీ ఖాళీగా క‌నిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సూప‌ర్ మార్కుట్లు, కాయ‌గూర‌లు అమ్మే ప్లేసుల్లో జ‌నాలు ఇప్పుడు చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు! 

స‌రిగ్గా వారం రోజుల కింద‌ట వ‌ర‌కూ కిట‌కిట‌లాడిన ప్రాంతాల‌న్నీ ఇప్పుడు ఖాళీగా క‌నిపిస్తూ ఉన్నాయి! ఒక‌వైపు ప‌గ‌లంతా లాక్ డౌన్ ను ఎత్తేసినట్టుగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించినా ఇప్పుడు ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రావ‌డం లేదు! ఇంత‌లో ఎందుకీ మార్పు? క‌రోనా అంటే ఇప్పుడు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారా?క‌రోనా కేసులు త‌గ్గుతున్న వేళ ఎందుకు రోడ్లు ఇప్పుడు ఖాళీగా క‌నిపిస్తున్నాయి? అంటే.. దానికి ప్ర‌ధాన కార‌ణం లాక్ డౌన్ ను ప్ర‌భుత్వం ఎత్తేయ‌డ‌మే!

ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కూ షాపులుంటాయి, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే అన్నీ అందుబాటులో ఉంటాయి.. ఆ త‌ర్వాత స‌ర్వం క్లోస్ అని ప్ర‌క‌టించిన రోజుల్లో ప్ర‌జ‌లు ఒక్కసారిగా రోడ్ల మీద‌కు వ‌చ్చేసే వారు. ఇక మ‌ళ్లీ దొరుకుతాయో దొర‌క‌వో అన్న‌ట్టుగా షాపుల మీద ప‌డేవారు. ఎప్పుడైతే మ‌ధ్యాహ్నం వ‌ర‌కే బ‌య‌ట‌కు రావాలి అనే నియ‌మం పెట్టారో అప్పుడు ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఇంటి వైపు వెళ్లే వారు కాదు! అవ‌స‌రం ఉన్న‌వీ లేనివీ కొంటూ, అవ‌స‌రం ఉన్నా  లేక‌పోయినా బ‌య‌ట సంచరించే వారు. అదేమంటే.. మ‌ధ్యాహ్నం త‌ర్వాత క్లోజ్ క‌దా.. అని వారు. 

లాక్ డౌన్ వ‌ల్ల కేసుల సంఖ్య త‌గ్గింది అని ప్ర‌భుత్వాలు స్టేట్ మెంట్లు ఇస్తే.. న‌వ్వుకోవాల్సిన ప‌రిస్థితి. ఎందుకంటే.. లాక్ డౌన్ పెట్ట‌కుంటే, సాయంత్రం వ‌ర‌కూ షాపులు తెరిచే ఉంటాయి.. అంటే ప్ర‌జ‌లు తీరిగ్గా క‌దులుతారు. త‌మ‌కు వీలైన‌ప్పుడు మాత్ర‌మే వెళ‌తారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ఉద‌యం ఏడు గంట‌ల‌కే సూప‌ర్ మార్కెట్లు, హైప‌ర్ మార్కెట్లు కిట‌కిట‌లాడేవి. ఒక్కో షాపులు రెండు మూడు వంద‌ల మంది దూరే వారు! వారిలో ఎవ‌రికి క‌రోనా ఉందో, ఎవ‌రికి లేదో ఎవ‌రికీ తెలీదు. బిల్లింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యూలు క‌నిపించేవి. అక్క‌డ భౌతిక దూర‌మూ ఉండ‌దు, ఏమీ ఉండ‌దు!

తీరా లాక్ డౌన్ ఎత్తేసి రెండు రోజులు కూడా కాక ముందే.. అవే సూప‌ర్ మార్కెట్లు, హైప‌ర్ మార్కెట్లు, స్పార్లు ఖాళీగా క‌నిపిస్తూ ఉన్నాయి! ఉద‌యం ఏడు నుంచి ప‌న్నెండు మధ్య‌న ఆ షాపుల‌కు వ‌చ్చే జ‌నాలంతా.. ఇప్పుడు ప‌గ‌లంతా ఏదో ఒక స‌మ‌యంలో వెళ్లి వ‌స్తూ ఉన్నారు. దీంతో ర‌ద్దీ తగ్గిపోయింది. జ‌నాలంతా ఒక్క‌సారిగా రోడ్ల మీద‌కు వ‌చ్చిన లాక్ డౌన్ రోజుల్లో ట్రాఫిక్ జాములు ఏర్ప‌డ్డాయి. అనంత‌పురం వంటి టౌన్లు కూడా ఎన్న‌డూ చూడ‌నంత స్థాయిలో ట్రాఫిక్ జామ్ ను చ‌వి చూశాయి! 

అంతిమంగా లాక్ డౌన్ ఉద్దేశం క‌రోనా వ్యాప్తి చేయ‌కుండా ఉండ‌టం. అయితే.. ప‌రిమితుల దృష్ట్యా ప్ర‌జ‌లంతా ఒకే సారి రోడ్ల మీద‌కు, షాపుల మీద‌కు వెళ్ల‌డంతో.. వీలైనంత‌గా క‌రోనా అంటుకునే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే.. ప్ర‌భుత్వాలు, మేధావులు మాత్రం ఈ చిన్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేదు. 

ఎక్కువ‌సేపు ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేయ‌డం అనే లెక్క‌లే వారు వేశారు కానీ, వ‌దిలిన రెండు మూడు గంట‌ల్లో ప్ర‌జ‌లు భౌతిక దూరం కాన్సెప్ట్ ను పూర్తిగా మిస్ అవుతున్నార‌నే విష‌యాన్ని ఈ మేధోవ‌ర్గం గ్ర‌హించ‌లేదు. ఇప్పుడు ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇస్తున్నారు. 

లాక్ డౌన్ పెట్టారంటే.. ఒక్క‌సారిగా అంతా రోడ్ల పైకి వ‌స్తారు, లాక్ డౌన్ లేదంటే.. ఒక్కొక్క‌రుగా వెళ్లారు.  భౌతిక దూరాలు పాటిస్తారు, ర‌ద్దీగా క‌నిపించిన షాపుల్లోకి వెళ్ల‌రు, రోడ్ల మీద ట్రాఫిక్ జాములు ఏర్ప‌డే ప‌రిస్థితి రాదు! రెండు లాక్ డౌన్ల త‌ర్వాత అయినా ప్ర‌భుత్వాలు ఈ విష‌యాల‌ను గ్ర‌హిస్తాయో, మ‌ళ్లీ కేసులు పెర‌గ‌గానే గంటా, రెండు గంటల్లోనే అంతా రోడ్ల మీద‌కు వ‌చ్చేసి ర‌చ్చ‌చేయాలంటాయో! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?