cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సీనియారిటీయే కాదు...సత్తా కూడా ఉందట...!

సీనియారిటీయే కాదు...సత్తా కూడా ఉందట...!

తెలంగాణ కాంగ్రెసులో తనను మించినవాడు లేడని, తనకంటే సత్తా ఉన్నోడు ఎవరని అన్నాడు మోస్ట్‌ సీనియర్‌ లీడర్‌ వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌. ఉన్నట్టుండి తన సీనియారిటీని, సత్తాను ఎందుకు చాటుకున్నాడు? ఎందుకంటే టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం. అధ్యక్ష పదవిని అధిష్టానం త్వరలోనే భర్తీ చేస్తుంది. ఇందుకోసం ఢిల్లీలో కసరత్తు సాగుతోంది.

ఆ పదవి కోసం నాయకులు యమ పోటీ పడుతున్నారు. అయితే హనుమంతరావును అధిష్టానం పెద్దగా పట్టించుకున్నట్లు కనబడటంలేదు. బహుశా ఇందుకు ఆయన వయసు కారణం కావొచ్చు. కాని ఆయన మాత్రం అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్నాడు.

'పీసీసీ అధ్యక్ష పదవి నాకే ఇవ్వాలి. నాకంటే సీనియర్‌ లీడర్‌ తెలంగాణలో ఎవ్వరూ లేరు. ప్రజల్లోకి వెళ్లే సత్తా నాకు మాత్రమే ఉంది' అంటూ బాహుబలి టైపులో మాట్లాడాడు. ప్రస్తుతం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి రెడ్డి వర్గం. మరోటి బీసీల వర్గం. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తేవడంలో రెడ్డి వర్గం విఫలమైంది.

చివరకు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలోనూ మట్టికరిచింది. అందుకే టీపీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి వర్గానికి కాకుండా తమకు ఇవ్వాలని బీసీ వర్గం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. బీసీ వర్గం తరపున గళం వినిపిస్తున్నాడు హనుమంతరావు.

తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. కాని రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇది ఒక్క కాంగ్రెసు పార్టీకే పరిమితం కాలేదు. సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌ బీసీలకు టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానాన్ని కోరాడు.

అంతేకాకుండా అవకాశం ఉంటే ఆ పదవి తనకే ఇవ్వాలంటున్నాడు. ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు సీనియారిటీ, విధేయత. రామాయణంలో రాముడికి హనుమంతుడు ఎలాగో ఈయన గాంధీ కుటుంబానికి అలాగ. తనది వీరవిధేయత కాబట్టి అధ్యక్ష పదవి చేపట్టే అర్హత తనకే ఉందని ఈయన భావన.

రేవంత్‌ రెడ్డికి పదవి దక్కకూడదని ఈయన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.  అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారు వివాదాస్పదులు, రెడ్డి, బీసీ వర్గాలకు చెందినవారు కాబట్టి, ఈ రెండు వర్గాలకు చెందనివాడు, వివాదరహితంగా ఉండేవాడు అధ్యక్ష పదవికి కావాలని కొందరంటున్నారు. 

కాంగ్రెసు పార్టీలో ముఖ్యమంత్రి పదవి కావొచ్చు, పీసీసీ అధ్యక్ష పదవి కావొచ్చు ..అది భర్తీ అయ్యేంతవరకు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తుంటుంది. చిన్న నిర్ణయమైనా, పెద్ద నిర్ణయమైనా అది తీసుకునేది ఢిల్లీలోని అధిష్టానం కాబట్టి ఏం జరుగుతుందో చివరి క్షణం తరకు తెలియదు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. విభజన తరువాతా అదే పరిస్థితి. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు చాలా రోజుల ముందు నుంచే ఈ పోటీ మొదలైంది. ఉప ఎన్నిక ముంచుకొచ్చినా నేతలు పోటీ పడటం ఆపలేదు. సరే....ఏదోవిధంగా ఉప ఎన్నిక అయిందనిపించారు. ఫలితం  గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పీసీసీ పదవి దక్కించుకోవడానికి ఎవరి పాట్లు వారు పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

'మొనగాడిని నేను..నీకంటే పెద్ద మొనగాడిని నేను' అంటూ తమ సత్తా ఏమిటో, తామేం చేయగలమో చెప్పుకుంటున్నారు. 'నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేయండి. పార్టీని అధికారంలోకి తెస్తా' అంటూ అధిష్టానానికి తమ శక్తిసామర్థ్యాల గురించి విన్నవించుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు అలియాస్‌ వీహెచ్‌,  శ్రీధర్‌బాబు...ఇలా అనేకమంది పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

రెడ్డి వర్గానికి పదవి ఇవ్వాలని కొందరు, బీసీ వర్గానికి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారు. ఆ వర్గం, ఈ వర్గం కాదు ...సమర్థ నాయకుడికి ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. వివాదరహితుడైన నాయకుడికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కొందరంటున్నారు. జగ్గారెడ్డి అయితే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పాడు.

ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందోనని భయంగా ఉంది. ఎందుకంటే జనాలకు తెలియని, పార్టీలో ప్రాధాన్యం లేని వారిని పిసీసీ అధ్యక్షులుగా, సీఎంలుగా ఎంపిక చేసిన చరిత్ర ఏఐసీసీకి ఉంది.

ఉమ్మడి ఆంధ్రాకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముసలయ్య అనే నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. పదవి ఆశించిన వారిని పక్కన పెట్టి పదవి కోసం తాపత్రయపడని ముసలయ్యను అధ్యక్షుడిని చేయడంతో నేతలు కంగుతిన్నారు.

వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎం.సత్యనారాయణరావును అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా చేసింది. అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డిని ప్రతిపాదించినా అధిష్టానం దాన్ని పక్కన పెట్టింది.

అంజయ్య ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా అనుకున్నారా? తాను ఆరణాల కూలినని చెప్పుకున్న అంజయ్య సీఎం పదవిని కలలో కూడా ఆశించలేదు. ఈసారి అధిష్టానం అలాంటి సర్‌ప్రైజ్‌ ఏమైనా ఇస్తుందా అని కొందరు నేతలు డౌటు పడుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే అధిష్టానం రిస్క్‌ తీసుకోదని చెబుతున్నారు.