Advertisement

Advertisement


Home > Politics - Political News

కెవ్వు కామెడీ.. వీర్రాజు నోట 'నైతికత' డైలాగ్స్

కెవ్వు కామెడీ.. వీర్రాజు నోట 'నైతికత' డైలాగ్స్

రాజకీయాల్లో కొంతమంది కొన్ని పదాలు ఉపయోగిస్తే భలే నవ్వొస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు వెన్నుపోటు గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? గెలుపు, ఘనవిజయం లాంటి పదాల్ని లోకేష్ ఉపయోగిస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది? సరిగ్గా సోము వీర్రాజు కూడా ఇలాంటి పదమే వాడారు. అదే నైతిక హక్కు అనే పదప్రయోగం. ఇంతకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏమన్నారో తెలుసా?

ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్ కు లేదట. అమరావతి విషయంలో భారతీయ జనతాపార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందట. ఇలా ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. బెజవాడలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఇలా నైతికహక్కు అనే మాట ఉపయోగించారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.

అసలు బీజేపీకి నైతిక హక్కు ఉందా..?

రాజధానుల అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. అసలు రాజధాని అంశానికి మూల కారణమైన రాష్ట్ర విభజన అంశం గురించి మాట్లాడుకుందాం. విభజన టైమ్ లో కాంగ్రెస్ తర్వాత కీలక పాత్ర పోషించిన పార్టీ బీజేపీ. ఆ టైమ్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి, దానిపై గట్టిగా నిలబడిన పార్టీ బీజేపీ. ఆ తర్వాత అదే అంశంతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కలిసి ప్రభుత్వం స్థాపించిన పార్టీ బీజేపీ. ఎప్పుడైతే అధికారం చేతికొచ్చిందో ఆ వెంటనే హోదా అంశాన్ని గాలికొదిలేసిన పార్టీ బీజేపీ.

అసలు ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టే నైతిక హక్కు కాషాయ పార్టీకి లేదు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు ఏ ఒక్క బీజేపీ నేతకు లేదు. అలాంటి పార్టీకి ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకుంటున్న సోము వీర్రాజు... ఏపీ నడిబొడ్డున సమావేశం పెట్టుకొని, నైతికత గురించి మాట్లాడుకుంటే జనాలు నవ్వుకుంటున్నారు.

అలాంటి నైతికత లేని పార్టీ నుంచి వచ్చిన సోము వీర్రాజు, ముఖ్యమంత్రి జగన్ కు 3 రాజధానుల విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదని అనడం జబర్దస్త్ కామెడీని తలపిస్తోంది. ఆ మాట కొస్తే.. రాజధాని అంశానికి పరోక్షంగా కారణమైన బీజేపీకే ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒకవేళ నిజంగా రాజధానుల అంశంపై బీజేపీ మాట్లాడాలనుకుంటే, ముందుగా ప్రత్యేక హోదాపై విస్పష్ట ప్రకటన చేసి, ఆ తర్వాత 3 రాజధానుల అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది.

అమిత్ షా క్లాస్ పీకడంతో అమరావతి పేరిట జరుగుతున్న నకిలీ ఉద్యమంలో జాయిన్ అయిన సోము వీర్రాజు, ఇప్పుడు అమరావతికి వంత పాడడం కోసం 3 రాజధానుల అంశాన్ని తప్పుపడుతున్నారు. గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం, ఏపీ రాజధాని అంశంతో తమకు సంబంధం లేదని, రాజధానులు ఎక్కడైనా పెట్టుకునే సర్వహక్కులు ఏపీ ప్రభుత్వానికి ఉన్నాయని స్వయంగా హైకోర్టులో ప్రకటించిన విషయాన్ని సోము గుర్తుపెట్టుకుంటే మంచిది.

నైతికత అంటే ఏంటో సోము మరిచిపోవచ్చు. రాజకీయ నాయకుడు కాబట్టి అందులో తప్పు లేదు. కనీసం కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ అయినా చదువుకొని, అప్పుడు నైతికత అనే పదాన్ని తను వాడొచ్చా అనేది వీర్రాజు ఆలోచించుకుంటే మంచిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?