Advertisement

Advertisement


Home > Politics - Political News

తిరుప‌తిపై టీడీపీ స‌ర్వే...తేలిందిదే!

తిరుప‌తిపై టీడీపీ స‌ర్వే...తేలిందిదే!

స‌ర్వేలు చేయ‌డంలో టీడీపీ దిట్ట. సాధార‌ణ రోజుల్లో కూడా ప్ర‌జాభిప్రాయాన్ని ప‌సిగ‌ట్టేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో టీడీపీ స‌ర్వేలు చేయిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక ఎన్నిక‌లంటే టీడీపీ ఎంత చురుగ్గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో అన్ని రాజ‌కీయ పార్టీలు, రాజ‌కీయేత‌ర సంస్థ‌లు కూడా నిత్యం స‌ర్వేలు చేస్తున్నాయి. ఏ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? బ‌లం ఎక్క‌డ‌? బ‌ల‌హీన‌త ఎక్క‌డ? అనే అంశాల‌పై అభిప్రాయాలు సేక‌రిస్తూ ...అందుకు త‌గ్గ‌ట్టు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌పున ఓ ప‌ది మందితో కూడిన టీం తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జానాడిని ప‌ట్టే ప్ర‌య‌త్న చేసింది. ఈ టీం ఇచ్చిన నివేదిక‌తో టీడీపీ అధిష్టానం క‌ళ్లు బైర్లు క‌మ్మిన‌ట్టు తెలుస్తోంది. ఈ టీం ఇచ్చిన నివేదిక నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు మొద‌లుకుని టీడీపీ నేత‌లు విమర్శ‌ల తీవ్ర‌త పెంచ‌డంతో పాటు ప్ర‌ధానంగా రాళ్ల దాడి ఘ‌ట‌న తెర‌పైకి వ‌చ్చింద‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ 55.03% ఓట్ షేర్‌తో 7,22,877 ఓట్లు ద‌క్కించుకు న్నారు. అలాగే టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మి 37.65% ఓట్ షేర్‌తో 4,94,501 ఓట్లు ద‌క్కించుకున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత ఉప పోరులో టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మికి 2 ల‌క్ష‌ల నుంచి 3 ల‌క్ష‌ల ఓట్లు మించి రావ‌ని స‌ద‌రు టీం చేసిన స‌ర్వేలో తేలిన‌ట్టు స‌మాచారం.

స‌ర్వే స‌మాచారాన్ని టీడీపీ అగ్ర‌నాయ‌క‌త్వానికి స‌ద‌రు టీం చేర‌వేసింది. దీంతో టీడీపీ అగ్ర నాయ‌క‌త్వం అయోమ‌యానికి గురైన‌ట్టు తెలిసింది. చంద్ర‌బాబు, లోకేశ్ ప్ర‌చారం ఎంత మాత్రం ప‌ని చేయ‌డం లేద‌ని స్ప‌ష్టంగా నివేదిక‌లో పొందుప‌రిచిన‌ట్టు తెలిసింది. 

అలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలపై సానుకూల‌త‌, ఇటీవ‌ల పంపిణీ చేసిన ఇళ్ల స్థ‌లాల ప్ర‌భావం, మ‌రీ ముఖ్యంగా ప‌దేపదే జగ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలపై న్యాయ‌స్థానాల్లో కేసులు వేయ‌డం కూడా టీడీపీపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తున్న‌ట్టు స‌ర్వేలో తేలిన విష‌యాన్ని అధిష్టానానికి నివేదించిన‌ట్టు సమాచారం.

సొదుం ర‌మ‌ణ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?