Advertisement

Advertisement


Home > Politics - Political News

వీకే, ఆర్కే గ్ర‌హించాల్సిన వాస్త‌వాలు

వీకే, ఆర్కే గ్ర‌హించాల్సిన వాస్త‌వాలు

ఎన్నిక‌లంటే చాలు... జ‌గ‌న్‌పై విష ప్ర‌చారాన్ని చేయ‌డం ఎల్లో మీడియాకు వెన్న‌తో పెట్టిన విద్య‌. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎండీ ఆర్కే ఓ అడుగు ముందుకేసి మాంసం తింటున్నాన‌ని, ఎముక‌లు మెడ‌లో వేసుకునే ర‌కం. జ‌గ‌న్‌పై వారం వారం త‌న విష‌పు ప‌లుకులు చాల‌వ‌ని, నేడు ప‌ర్వ‌త‌నేని వెంక‌ట‌కృష్ణ అనే త‌న కొలీగ్‌, ఏబీఎన్ ప్ర‌జెంట‌ర్‌తో స్టార్ట్ చేయించారేమో అనే అనుమానం క‌లుగుతోంది. 

జ‌ర్న‌లిస్టు అని తాను అనుకోవ‌డం వేరు, స‌మాజం గుర్తించ‌డం వేరు. ఈ సూక్ష్మాన్ని గ్ర‌హించి రాత‌లు రాస్తే పాఠ‌కామోదం ల‌భిస్తుంది. అలా కాకుండా వ‌క్ర‌భాష్యాలు, వంక‌ర రాత‌లు రాస్తే... అందుకు త‌గ్గ‌ట్టు పేరు మార్పున‌కు గురై, చేష్ట‌ల‌కు త‌గ్గ సార్థ‌క నామ‌ధ్యేయంతో పిలుపించుకుంటార‌ని ఇప్ప‌టికే వ్యాస‌క‌ర్త‌కు స్వీయ అనుభ‌వంలోకి వ‌చ్చే ఉంటుంది.  

"జ‌గ‌న్ గ్ర‌హించాల్సిన వాస్త‌వాలు" శీర్షిక‌తో వెంక‌ట‌కృష్ణ ఆంధ్ర‌జ్యోతి ఎడిట్ పేజీలో ఓ వ్యాసం రాశారు. అయితే ఎదుటి వాళ్ల‌కు నీతులు చెప్పేముందు, తాము గ్ర‌హించాల్సిన వాస్త‌వాలేంటో తెలుసుకుంటే బాగుండేద‌నే అభిప్రాయం పౌర స‌మాజం నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. మీడియా అంటే ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాలి. కానీ తెలుగు మీడియా దౌర్భాగ్యం ఏంటంటే ...ఆ స్పృహ కోల్పోయి, నీతి, రీతి ఏనాడో త‌ప్పాయి.

సాధార‌ణంగా నోటికి త‌ప్ప‌, క‌లానికి ప‌ని చెప్ప‌ని వెంక‌ట‌కృష్ణ ...ఇప్పుడు వ్యాసం రాయ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం, నేప‌థ్యం లేకపోలేదు. ఈ వ్యాసంలో ఆయ‌నే పేర్కొన్న‌ట్టు... తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు, విశ్లేషణలు అవసరం అని రాయ‌డం ద్వారా వీకే ఉద్దేశం ఏంటో స్ప‌ష్ట‌మైంది. ఇదే సంద‌ర్భంలో వీకే విస్మ‌రించిన మ‌రో సంగ‌తి ఉంది. అది ప్ర‌ధానంగా త‌న య‌జ‌మాని ఆర్కే, తాను గ్ర‌హించాల్సిన వాస్త‌వాల గురించి తెలుసుకోక‌పోవ‌డం.

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించి ప్ర‌తిరోజూ త‌న ఏబీఎన్ చాన‌ల్‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ద్వారా విషాన్ని కుమ్మ‌రిస్తే ... జ‌నాభిప్రాయాన్ని మార్చ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డితే అంత మంచిది. ఈ వ్యాసంలో ఓ విలువైన సూచ‌న కూడా లేక‌పోలేదు.

‘వ్యక్తి మీదనైనా, వ్యవస్థ మీదనైనా విరక్తి మొదలైతే దాన్ని నిలువరించడం చాలా కష్టం. ఆ విరక్తి బయటికి కనిపించకపోవచ్చు కానీ, జనంలో మొదలైందనే వాస్తవాన్ని జగన్‌ గ్రహించాల్సిన అవసరం ఉంది’ అని  వీకే రాసుకొచ్చారు. జ‌గ‌న్‌పై ప్రేమ ఎక్కువై వీకే, ఆయ‌న య‌జ‌మాని ఆర్కే ...త‌మ ఆరాధ్య నాయ‌కుడు చంద్ర‌బాబుకు ఇలాంటి విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం మ‌రిచిపోయారు.

జ‌గ‌న్‌పై జ‌నంలో విర‌క్తి క‌లిగితే చంద్ర‌బాబు తిరిగి ముఖ్య‌మంత్రి అవుతార‌ని వీకే, ఆర్కే క‌ల‌లు కంటున్నారనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇదే వీకే హెచ్చ‌రిస్తున్న‌ట్టు ....మ‌రి ఇదే చంద్ర‌బాబు మీద విరక్తితోనే క‌దా జ‌నం ఇంటికి సాగ‌నంపింది! మ‌రి ఆయ‌న పోగొట్టుకున్న ప్రేమ‌ను సాధించ‌డం అంత సుల‌భ‌మా? ప్రజల ప్రేమ‌ను చూర‌గొన‌డం ఎలాగో ఆర్కే, వీకే త‌మ మీడియా సంస్థ ద్వారా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌కు పాఠాలు, గుణపాఠాలు నేర్పాల‌నే వాస్త‌వాల‌ను ఇప్ప‌టికీ ఎందుకు గ్ర‌హించ‌లేకున్నారో ఎవ‌రికీ అర్థం కాదు.

జ‌గ‌న్‌పై ద్వేషంతో ప్ర‌తిరోజూ పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు రాయ‌డం, ఏబీఎన్ చాన‌ల్‌లో క‌థ‌నాలు ప్ర‌సారం చేసే వ‌ర‌కూ బాగుంది. కానీ ఇవేవీ జ‌గ‌న్‌పై ప్ర‌జాభిప్రాయాన్ని మార్చ‌వ‌ని, అలాగే చంద్ర‌బాబుపై సానుకూల దృక్ప‌ధాన్ని పెంచ‌వ‌ని జ‌ర్న లిజంలో తామొక మేలుప‌ర్వ‌తాల‌ని భావిస్తున్న ఆర్కే, వీకే ఎందుకు గ్ర‌హించ‌లేదోన‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

వీకే వ్యాసంలో ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన భావాలు వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

‘తాజా ఎన్నికల్లో గెలుపును తన విధానాలకు ఆమోదముద్రగా జగన్‌ భావిస్తున్నారు. కానీ ఆ ఎన్నికలు జరిగిన తీరు ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా లేదు. జగన్‌పై ప్రజలకు ఇంకా తగ్గని అభిమానం, ప్రేమ కూడా ఆయన విజయాలకు కారణమే. కాదన లేం. ఆ ప్రేమాభిమానాలు ఇంకా కొంతకాలం ఉండొచ్చు కూడా’ అని రాశారు. ఒక‌వైపు జ‌గ‌న్‌పై ఇంకా ప్ర‌జాభిమానం త‌గ్గ‌లేద‌ని, అదే ఆయ‌న విజ‌యాల‌కు కార‌ణ‌మ‌ని చెబుతూనే, మ‌రోవైపు తాజా ఎన్నిక‌లు జ‌రిగిన తీరు ఏ మాత్రం ప్ర‌జాస్వామ్య‌యుతంగా లేవ‌ని చెప్ప‌డం ద్వారా వీకే త‌న ‘ప‌చ్చ‌’పాత బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్టైంది. స‌మాజం ప‌ట్ల ప్రేమ ఉన్న‌వారెవ‌రూ ఇలాంటి నిష్పాక్షిక‌త లేని రాత‌ల‌ను స‌హించ‌ర‌ని వీకే గ్ర‌హిస్తే మంచిది.

ఇక చంద్ర‌బాబు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం విష‌యానికి వ‌స్తే వీకే స‌న్నాయి నొక్కులు నొక్కే రాత‌ల‌ను చ‌దివితే , సాటి జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న‌పై సానుభూతి, జాలి క‌లిగాయి. నిజాల్ని నిర్భ‌యంగా రాయ‌లేని వీకే దుస్థితికి నివాళి అర్పించాల‌నే ఆలోచ‌న క‌ల‌గ‌క‌మాన‌దు. బాబు ఘోర ప‌రాజ‌యాన్ని జీర్ణించుకోలేని వీకే అవ‌స్థ‌కు ఈ కింది వాక్యాలే నిద‌ర్శ‌నం.

‘2019లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అనూహ్యమైన, అద్భుతమైన తీర్పునిచ్చారు. ఆ తీర్పునివ్వడానికి కారణాలు చాలా ఉండవచ్చు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండో- అయిదు సంవత్సరాల కాలానికి మార్పు కోరుకుని ఉండవచ్చు. అప్పటి వరకు ఉన్న చంద్ర బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా పెరిగి ఉండవచ్చు. అన్నిటికీ మించి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండన్న జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థన కూడా ప్రజల మనసుల్ని బలంగానే తాకింది. వీటన్నిటికీ మించి ప్రశాంత్‌కిశోర్‌ అనే బీహారీ రగిల్చిన కుల, మత విద్వేషాలు రాష్ట్ర రాజకీయాలను అతలాకుతలం చేశాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు’

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సాధించిన అద్భుత విజ‌యాన్ని, ప్ర‌జాభిప్రాయాన్ని వీకే చాలా చుల‌క‌న చేసి రాశారు. ప్ర‌శాంత్ కిశోర్ అనే బీహారీ ర‌గిల్చిన కుల‌, మ‌త విద్వేషాలు రాష్ట్ర రాజ‌కీయాల‌ను అత‌లాకుత‌లం చేశాయ‌న‌డంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేద‌ని రాయ‌డం ద్వారా ....వీకే ఏం చెప్ప‌ద‌లుచుకున్నారు? అస‌లు జ‌గ‌న్ విజ‌యం సాధించ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయాలు అత‌లాకుత‌లం అయ్యాయ‌నే అభిప్రాయం ఉన్న వ్య‌క్తి నుంచి నిష్పాక్షిక వ్యాసం వ‌స్తుంద‌ని ఎలా ఆశించాలి? చ‌ంద్ర‌బాబు విజ‌యాన్ని ఆశించే వాళ్లు, ముందుగా ఆయ‌న ఘోర ప‌రాజ‌యాన్ని అంగీక‌రించ‌క‌పోతే త‌మ క‌ల‌ల‌ను ఎలా నెర‌వేర్చుకుంటారో వీకేనే చెప్పాలి.

చంద్ర‌బాబు ఘోర ప‌రాజ‌యానికి క‌నీసం మీడియా సంస్థ‌గా ఏనాడైనా ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ అత్మ ప‌రిశీల‌న చేసుకున్నాయా?  త‌ప్పుల‌ను క‌ప్పి పెట్ట‌డంతో పాటు త‌ప్పుడు స‌ల‌హాలిస్తూ ఆయ‌న‌తో చేయ‌రాని ప‌నులు చేయిస్తూ, రాజ‌కీయంగా త‌ప్ప‌ట‌డుగులు వేయించ‌డంలో త‌మ‌రి య‌జ‌మాని పాత్ర ఏంటో టీడీపీ నేత‌ల‌ను అడిగితే క‌థ‌లుక‌థ‌లుగా చెబుతారు?

విని త‌ట్టుకునే శ‌క్తిసామ‌ర్థ్యాలు ఉంటే ఒక‌సారి ప్ర‌య‌త్నిస్తే మంచిది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ ఆయ‌న క‌ళ్లు తెరిపించే రాత‌లు రాస్తే మంచిది. అలా కాకుండా తాము అంధ‌కారంలో ఉంటూ, ఆయ‌న్నూ అట్లే ఉంచాల‌నుకుంటే ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. పుదుచ్చేరిలో బీజేపీకి మ‌ద్ద‌తుగా వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌నే వీకే రాత‌ చ‌దివిన త‌ర్వాత‌, ఎవ‌రికైనా మ‌తిపోతుంది. ఇక రాసిన ఆ జ‌ర్న‌లిస్టు మ‌తి గురించి, ఆయ‌న రాసిన వ్యాసం ఎలా ఉంటుందో ఇంత‌కంటే ఏం చెబుతాం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?