Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇప్పుడెందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయవు పవన్?

ఇప్పుడెందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయవు పవన్?

రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా ఉన్నఫలంగా స్పందిస్తుంది జనసేన పార్టీ. ఆ పార్టీపై లేదా పవన్ కల్యాణ్ పై ఏమైనా కథనాలొస్తే వాటిపై కూడా స్పందించిన సందర్భాలున్నాయి. ఇక్కడ స్పందించడమంటే ఫటాఫట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే. 

విషయం ఏదైనా ఆ పార్టీ నుంచి వచ్చేది ప్రెస్ నోట్ మాత్రమే. ఈసారి కూడా పవన్ కల్యాణ్ పై ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ప్రెస్ నోట్ రాలేదు. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఏంటి సంగతి?

జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ ను ఎంపీని చేస్తారని, (రాజ్యసభకు పంపి) అట్నుంచి అటు కేంద్ర మంత్రిని చేస్తారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. ఇది కూడా 2 రోజుల నుంచి నడుస్తోంది. దీనిపై ఎవరికి తోచినట్టు వాళ్లు విశ్లేషణలు చేసుకుంటున్నారు. చివరికి పవన్ కల్యాణ్ పై కాస్త సాఫ్ట్ గా వ్యవహరించే చంద్రబాబు మీడియా కూడా కథనాలు ఇచ్చేసింది.

ఓవైపు ఇంత జరుగుతుంటే జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం. చాలా చిన్న విషయాలకు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి స్పందించిన ట్రాక్ రికార్డ్ ఆ పార్టీది. ఒకవేళ తన సంతకంతో పవన్ కల్యాణ్ వివరణ ఇస్తే ఇబ్బంది అనుకున్నప్పుడు, తన అధికార ప్రతినిధితోనైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉండొచ్చు. ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఇలా వ్యవహరించారు కూడా.

ఈ ఒక్క పుకారుపై మాత్రం పవన్ నుంచి, ఆయన పార్టీ నుంచి స్పందన లేదు. చూస్తుంటే.. ఈ విషయంపై పవన్ కల్యాణ్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టున్నారు. నిజానికి ఈ ఒక్క అంశంపైనే కాదు, ఈమధ్య కాలంలో జనసేన పార్టీ ఏ అంశంపై స్పందించిన దాఖలాల్లేవు. కేవలం కరోనా సహాయక చర్యలు, చనిపోయిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించడానికి మాత్రమే తమ సోషల్ మీడియా ఎకౌంట్లు వాడుతోంది.

ఇప్పటికిప్పుడు పవన్ ను ఎంపీని చేసి, మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల బీజేపీకి ఒరిగేదేం ఉండదు. పవన్ ను కేంద్ర మంత్రిని చేసినంత మాత్రాన, ఆంధ్రప్రదేశ్ ''కమలం'' వైపు తిరిగిపోదు. ఆమాటకొస్తే పవన్ కల్యాణ్ కు బీజేపీ ఎంత అత్యున్నతమైన పదవి ఇచ్చుకున్నా ఏపీ ప్రజలకు అనవసరం. భారతీయ జనతా పార్టీని ఏపీ ప్రజలు చూసే కేవలం ఒకే ఒక్క కోణంలో. అదే ప్రత్యేక హోదా. 

స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఏపీలో బీజేపీకి చోటు దక్కదు. "పవన్ కల్యాణ్ కు మంత్రి పదవి", "నెక్ట్స్ సీఎం పవన్ కల్యాణే", "బీజేపీ గెలిస్తే ఏపీకి నిధుల వరద" లాంటి మాటలేవీ ఆంధ్రప్రదేశ్ లో పనిచేయవు. 

కనీసం వీటిని దృష్టిలో పెట్టుకొనైనా, తనపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ పవన్ ఓ ప్రకటన చేస్తే బాగుండేది. కానీ ఈ నటుడు ఇప్పుడు పూర్తిగా ''అజ్ఞాతవాసి'' అనిపించుకున్నారు. రాజకీయంగా అజ్ఞాతంలో ఉంటూ, అట్నుంచి అటు సినిమాల షూటింగ్స్ కు హాజరయ్యే ఆలోచనలో ఉన్నట్టున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?