Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Political News

రాజుగారికే ఎందుకీ ప్ర‌త్యేక మ‌ర్యాద‌?

రాజుగారికే ఎందుకీ ప్ర‌త్యేక మ‌ర్యాద‌?

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టు రాజ‌కీయ దుమారం రేపింద‌నుకుంటే, దానికి మించి మ‌రొక‌టి ముందు కొచ్చింది. ర‌ఘురామ‌కృష్ణంరాజుపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. 

ఇదే సంద‌ర్భంలో అధికార‌ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఎందుకిలా ట్రీట్‌మెంట్ జ‌రిగింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ అధికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత అరెస్ట్ అయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల విష‌యంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎందుకు రాలేద‌నే అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

తాను కస్టడీలో ఉన్నప్పుడు శుక్రవారం రాత్రి సీఐడీ పోలీసులు బెల్టు, కర్రతో కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి కె.అరుణకు ఫిర్యాదు చేశారు. దీనిపై జడ్జికి రాతపూర్వకంగానూ ఫిర్యాదు చేశారు.  

‘రఘురామకృష్ణరాజు కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఆయన నడవలేకపోతున్నారు.  హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసు కొచ్చి గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో రాత్రి ఆయన్ను ఉంచారు. రాత్రి 11 గంటల నుంచి 11.15 గంటల మధ్య ఆయన గదిలోకి ఐదుగురు ప్రవేశించారు. వారు ముఖాలకు రుమాళ్లు చుట్టుకున్నారు. 

ఎంపీ కాళ్లను కట్టేశారు. ఐదుగురిలో ఒకరు కర్ర తీసుకుని కొట్టారు. మరొకరు రబ్బర్‌స్టిక్‌ తీసుకుని అరికాళ్లపై కొట్టారు. ఆ తర్వాత ఫ్లోర్‌పై నడవాలని ఎంపీని ఆదే శించారు. అలా నడిచాక మరోసారి అరికాళ్లపై మళ్లీ కొట్టారు. ఇలా ఆయన నడవలేనంత వరకూ నాలుగైదు సార్లు కొట్టారు. ఆ తర్వాత ఆయన్ను ఓ గదిలో వదిలేసి వారు బయటకొచ్చేశారు’ అని ఎంపీ త‌ర‌పు న్యాయ‌వాదులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజుపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డాన్ని చంద్ర‌బాబు ఖండించారు. గౌర‌వ ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయ‌న్ను ఏ విధంగా శారీర‌క హింస‌కు గురి చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా వెళ్లి అరెస్టు చేయడమే పెద్ద నేరమ‌ని, ఇప్పుడు థర్డ్‌ డిగ్రీ అమలు చేయడం మరో తప్పు అని అని చంద్రబాబు చ‌ట్టాల్ని ఏక‌ర‌వు పెట్టారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వివిధ నేరారోప‌ణ‌ల కింద మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డి, ధూళిపాళ్ల న‌రేంద్ర‌ త‌దిత‌రుల‌ను అరెస్ట్ చేశారు. 

సీఎం వీడియోల‌ను మార్ఫింగ్ చేశార‌నే ఫిర్యాదుపై మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంతో పాటు విచారించారు. కానీ ఏ ఒక్క‌రూ త‌మ‌ను పోలీసులు కొట్టార‌ని ఆరోపించ‌లేదు. న‌రేంద్రకు ఇప్ప‌టికీ బెయిల్ రాలేదు.

టీడీపీ నేత‌ల‌పై ఏవైతే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయో, అంత వ‌ర‌కే విచార‌ణ చేశార‌ని అర్థం చేసుకోవాలి. కానీ సొంత పార్టీ ఎంపీకి ప్ర‌త్యేక ట్రీట్‌మెంట్ ఎందుక‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఢిల్లీలో ర‌చ్చ‌బండ వేదిక‌గా మీసాలు తిప్పుతూ, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, ఆయ‌న స‌ల‌హాదారుల‌ను, ఇత‌ర నాయ‌కుల‌ను భ‌యంకరంగా తిట్ట‌డం వ‌ల్లే ఈ ప్ర‌త్యేక మ‌ర్యాద అనే చ‌ర్చ సాగుతోంది. 

ఇంత కాలం రాజుగారు త‌న‌నెవ‌రూ ఏమీ పీక్కోలేర‌ని సినిమాటిక్‌గా చెప్పిన డైలాగ్‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ర‌ఘురామ‌కృష్ణంరాజుతో పోల్చితే త‌మ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా గౌర‌వంగా చూసుకుంద‌నే అభిప్రాయాలు టీడీపీ నేత‌ల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?