Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎన్వీ ర‌మ‌ణ‌కు వైసీపీ ఎమ్మెల్యే ఘ‌న స్వాగ‌తం

ఎన్వీ ర‌మ‌ణ‌కు వైసీపీ ఎమ్మెల్యే ఘ‌న స్వాగ‌తం

స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, తెలుగు త‌ల్లి ముద్దుబిడ్డ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు వైసీపీ కీల‌క నేత‌, తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగ‌డుగునా ప్లెక్సీలు పెట్టారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మ‌ధ్య ఆత్మీయ సంబంధాలు ఈనాటివి కావు. రాజ‌కీయాలు, న్యాయ వ్య‌వ‌స్థ‌కు అతీత‌మైన బంధం వాళ్లిద్ద‌రి మ‌ధ్య పెన‌వేసుకుంది.

రాయ‌ల‌సీమ‌కు చెందిన భూమ‌న‌, కోస్తా ప్రాంత నివాసైన ఎన్వీ ర‌మ‌ణ‌ల‌ను వామ‌ప‌క్ష భావ‌జాలం ద‌గ్గ‌ర చేసింది. ఇద్ద‌రివీ వేర్వేరు పంథాలైనా... అంతిమంగా ఉన్న‌త స‌మాజ ఆవిష్క‌ర‌ణే వారి ఆకాంక్ష కావ‌డం విశేషం. వైకుంఠ ఏకాద‌శినాడు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రాక‌ను పుర‌స్క‌రించుకుని , ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ తిరుప‌తి న‌గ‌ర‌మంతా ప్లెక్సీలు క‌ట్టి భూమ‌న త‌న ఆత్మీయుడిపై అభిమానాన్ని చాటుకున్నారు.

తెలుగు, ఆంగ్ల భాష‌ల్లో ప్లెక్సీల‌ను పెట్ట‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

Pride of the motherland; Jewel of the judical crown; Inspiration for generations to come; We wish to see you again and again త‌దిత‌ర నినాదాల‌తో ఆంగ్లంలో ఎన్వీ ర‌మ‌ణ ఉన్న‌తిని కీర్తిస్తూ క‌ట్టిన‌ ప్లెక్సీలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఇక‌ తెలుగులో ఎన్వీ ర‌మ‌ణ గొప్ప‌ద‌నాన్ని ఆవిష్క‌రిస్తూ నెల‌కొల్పిన ప్లెక్సీలు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా ఉన్నాయి. స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ...విక‌సించిన తెలుగు అక్ష‌ర‌కీర్తి; న్యాయ శిఖ‌రం చేరిన సామాన్యుడు...తెలుగు మూలం మ‌రువ‌ని మాన్యుడు; మ‌ట్టి స్ప‌ర్శ తెలిసిన మ‌నిషి...మ‌హోన్న‌త న్యాయ నివాసి;  భార‌త న్యాయ కీర్తి ప‌తాక‌..మాతృభాష‌కు గ‌ర్వ ప్ర‌తీక త‌దిత‌ర నినాదాల‌కు తోడు మూర్తీభ‌వించిన న్యాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఎన్వీ ర‌మ‌ణ ఫొటోలు హైలెట్‌గా నిలిచాయి. 

ఇదిలా వుండ‌గా ఇటీవ‌ల న్యాయ వ్య‌వ‌స్థ‌తో ఏపీ ప్ర‌భుత్వానికి స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఎన్వీ ర‌మ‌ణకు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే పేరుతో ప్లెక్సీలు ప్ర‌త్య‌క్షం కావ‌డంపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?