రెండు సార్లు ప్రధానమంత్రి పదవి దరిదాపుల్లోకి వెళ్లారు. రెండు సార్లూ ఆ హోదాను సంపాదించుకోలేకపోయారు. అయితే రాష్ట్రపతిగా గౌరవమర్యాదను పొందారు. భారతరత్నగా నిలిచారు. సంకీర్ణ రాజకీయంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా ఆయన సాగించిన రాజకీయ పయనం అలాంటిలాంటిది కాదు. ఆ సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు.
ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన కోమాలో ఉంటూ చికిత్స పొందుతూ మరణించడంతో దేశ రాజకీయాల్లోనే ఒక శకం ముగిసినట్టు అయ్యింది. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాకా కూడా.. ఏదోలా ప్రణబ్ పేరు రాజకీయాల్లో వినిపించసాగింది. ప్రత్యేకించి గత ఎన్నికల ముందు.. మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రణబ్ ను ప్రధానిగా దించాలనే వ్యూహాలను కూడా కొంతమంది రచించారు. దేశ రాజకీయాల్లో అంత ప్రాధాన్యతను పొందిన వ్యక్తి ప్రణబ్.
కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిపోయి, కొన్నేళ్ల పాటు ఆ పార్టీకి దూరమై చివరకు ఆ పార్టీకే దగ్గరైన నేత ప్రణబ్. కాంగ్రెస్ రాజకీయాలను ప్రణబ్ తరహాలో అవపోసన పట్టిన వారిలో మరొకరు లేరని చెప్పుచ్చు. సంకీర్ణ రాజకీయాల్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రణబ్ చక్రం అడ్డేస్తూ వచ్చారు. అందరిని కలుపుకుపోతూ ప్రభుత్వాలను రక్షిస్తూ వచ్చారు.
2004 నుంచి 2009 వరకూ కూడా సోనియాగాంధీ ఏదో తన చాతుర్యంతో ప్రభుత్వాలను నిలబెట్టుకోలేదు. ప్రణబ్ తో సహా ఆంటోనీ వరకూ అనేక మంది ఆ సంకీర్ణ ప్రభుత్వాలను నిలబెట్టడానికి శతథా ప్రయత్నించారు. వారి మాటకు పార్టీలో విలువున్నంత వరకూ కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉండింది. ఎప్పుడైతే ప్రణబ్ ను క్రియాశీల రాజకీయాల నుంచి సోనియా తప్పించారో, ఆంటోనీ వంటి వారు మెత్తబడ్డారో.. అక్కడి నుంచినే కాంగ్రెస్ పార్టీ పతనావస్థ కూడా మొదలైంది.
ఇందిరాగాంధీ మరణించిన సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేత హోదాలో ప్రధాన మంత్రి పదవిని ఆశించారు ప్రణబ్. తాత్కాలికంగా అయినా తను ఆ బాధ్యతలను చేపట్టాలని ఆయన ఓపెన్ గానే తన ప్రతిపాదన పెట్టారంటారు. ఆ ప్రతిపాదనతోనే రాజీవ్ గాంధీ ఆగ్రహానికి గురయ్యారట ప్రణబ్. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే చివరకు రాజీవ్ గాంధీనే ఆయనతో రాజీకి వచ్చారంటారు.
రాజీవ్ మరణానంతరం కూడా ప్రణబ్ కు అలాంటి అనుభవమే ఎదురయ్యిందంటారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన ఆ సందర్భంలో ప్రణబ్ పీఠాన్ని ఆశించగా, సోనియా ఛాయిస్ పీవీ అయ్యారంటారు.
ఇక 2004లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి చేరువైనా.. ప్రణబ్ ను మాత్రం సోనియా పరిగణనలోకి తీసుకోలేదు. మన్మోహన్ వైపు ఆమె మొగ్గు చూపారు. అయితే కీలక శాఖలు, కీలక బాధ్యతల్లో ప్రణబ్ రాణించారు. యూపీఏ రెండోసారి అధికారం చేపట్టాకా ఒక దశలో మన్మోహన్ ను పీఠం నుంచి దింపి , ప్రణబ్ ను ప్రధానిగా చేస్తారనే వార్తలు వచ్చాయి. దానికి మన్మోహన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి లేకపోయింది. అయితే ఈ కాకలు తీరిన నేతను ప్రధానిగా చేస్తే అది రాహుల్ కు ఇబ్బంది అవుతుందని తన మాటను జవదాటని మన్మోహన్ నే ఆఖరు వరకూ సోనియా కొనసాగించారు. ఎంతో కొంత గౌరవాన్ని ఇస్తూ ప్రణబ్ ను రాష్ట్రపతిగా చేశారు.
రాష్ట్రపతి పదవి నుంచి దిగిన అనంతరం ప్రణబ్ ఇంటికే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ కు ఉచిత రాజకీయ సలహాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా ఆయన చేయలేదు. ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల రాజకీయ నేతగా కొనసాగుతూ ఉన్నారు.