వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుకు సంబంధించి నిన్ననే పోలీసులు అన్ని విషయాలు చెప్పేశారు. మీడియా కూడా అదే భావించింది. అయితే ఈరోజు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో మరిన్ని విస్తుపోయే వాస్తవాల్ని బయటపెట్టారు పోలీసులు. మరీ ముఖ్యంగా కేసును ఛేదించే క్రమంలో ప్రియాంక కాల్ డేటానే ప్రధాన ఆధారంగా నిలిచిన విషయాన్ని వెల్లడించారు.
పంక్చరైన బైక్ కు తీసుకెళ్లింది ప్రధాన నిందితుడు మొహ్మద్ ఆరిఫ్. బైక్ ను తీసుకెళ్లే ముందు అతడి ఫోన్ నంబర్ తీసుకుంది ప్రియాంక. బైక్ ను ఎత్తుకెళ్తాడేమో అనే అనుమానంతో ఈపని చేసిన ప్రియాంక, ఆ తర్వాత ఎంత సేపటికీ ఆరిఫ్ రాకపోవడంతో తన మొబైల్ నుంచి అతడికి కాల్ చేసింది. సరిగ్గా ఇదే కాల్ ఆధారంగా కేసు మొత్తం ఛేదించారు పోలీసులు.
దీంతోపాటు మరికొన్ని కీలక విషయాల్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు పోలీసులు. ప్రియాంకను ఎత్తుకెళ్తూనే, ఆమెకు బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు. హెల్ప్..హెల్ప్ అని అరిచినా కనికరం చూపించలేదు. బలవంతంగా ఆమెకు మద్యం పట్టించి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో అరవకుండా చీకట్లో నోటితో పాటు ముక్కును కూడా మూయడంతో 20 నిమిషాలకే ప్రియాంక చనిపోయింది.
రాత్రి 9.30 నుంచి 10.20 వరకు నిందితులు, ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. మృతదేహంపై కూడా అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఆమె ఇంకా బతికుందేమో అనే అనుమానంతో, ఆ కీచకులు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు పోలీసులు స్పష్టంచేశారు. ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాల్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు.
ప్రియాంక హత్యోదంతంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు జనం పోటెత్తారు. ఒక దశలో జనాల్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. అదనపు బలగాల్ని రప్పించి నియంత్రించాల్సి వచ్చింది. ప్రజలు కనుక పోలీస్ స్టేషన్ లోకి వెళ్లినట్టయితే.. నిందితులు నలుగురు ఈపాటికి చచ్చి ఉండేవారు. నిందితుల్ని 2 వారాల పాటు రిమాండ్ కు తరలించారు.
మరోవైపు ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యుల్ని గవర్నర్ పరామర్శించారు. పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్ సౌందరరాజన్ హామీ ఇచ్చారు.