ర‌ఘురామ స‌ర్క‌స్ ఫీట్లు!

రాజీనామా అనంత‌రం ఎన్నిక‌ల ప‌రిణామాల‌పై లెక్క‌లు తేల‌క‌పోవ‌డం వ‌ల్లే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త…

రాజీనామా అనంత‌రం ఎన్నిక‌ల ప‌రిణామాల‌పై లెక్క‌లు తేల‌క‌పోవ‌డం వ‌ల్లే న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. సొంత పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేసి ప‌ద‌వీచ్యుతుడిని చేయాల‌ని వైసీపీ అధిష్టానం గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువ‌డ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీ అధికార పార్టీకి తీవ్ర నిరాశ త‌ప్ప‌డం లేదు.

మ‌రోవైపు వైసీపీ ప్ర‌త్య‌ర్థులైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌తో ర‌ఘురామ స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయడం కంటే ముందుగానే తానే రాజీనామా చేసి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి అధికార పార్టీకి బుద్ధి చెప్పాల‌ని ర‌ఘురామ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. రాజీనామా అనంత‌రం ఏ పార్టీలో చేరాల‌నేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మిగిలింది. అమితంగా ప్రేమించే టీడీపీలో చేరితే బీజేపీ-జ‌న‌సేన కూట‌మి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే న‌మ్మ‌కం లేదు. ఎందుకంటే ఒక వ్య‌క్తి కోసం జాతీయ పార్టీ, దాని మిత్ర‌ప‌క్షం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌శ్నే త‌లెత్త‌దు.

జ‌న‌సేన‌లో చేరి, బీజేపీ మ‌ద్ద‌తుతో ఎన్నిక‌ల బ‌రిలో నిలిస్తే టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఎందుకంటే మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో బీజేపీ-జ‌న‌సేన కూట‌మికి తాత్కాలిక అవ‌స‌రాల కోసం మ‌ద్ద‌తు ప‌లికి త‌న భ‌విష్య‌త్‌ను టీడీపీ బ‌లిపెట్టుకునే అవ‌కాశాలు ఎంత మాత్రం లేవు. టీడీపీ, జన‌సేన‌, బీజేపీల నుంచి త‌గిన భ‌రోసా రాక‌పోవ‌డం వ‌ల్లే ..రాజీనామాపై ఏం చేయాలో దిక్కుతోచ‌క ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నాడ‌ని ఆయ‌న వ్య‌తిరేకులు విమ‌ర్శిస్తున్నారు.

ఎవ‌రికి వారుగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే వైసీపీ గెలుపు సులువ‌వు తుంద‌ని ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం అంటే ఢిల్లీలో ర‌చ్చ‌బండ నిర్వ‌హించేంత ఈజీ కాద‌ని ఆయ‌న వ్య‌తిరేకులు అంటున్నారు. భ‌యంతోనే రెండేళ్లుగా సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌లేని వ్య‌క్తి, రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తారంటే అంత‌కు మించిన కామెడీ మ‌రేదైనా ఉంటుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తే, ఇక భ‌విష్య‌త్‌లో త‌న‌నెవ‌రూ ప‌ట్టించుకోర‌ని భ‌యం ఆయ‌న్ను వెంటాడుతోంది. వైసీపీ రెబ‌ల్ అభ్య‌ర్థిగా మాట్లాడినంత కాలం త‌న‌కు ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుంద‌ని, అదే పోతే త‌న మాట‌ల‌కు ఎంత మాత్రం విలువ వుండ‌ద‌ని ర‌ఘురామ‌కు బాగా తెలుసు. త‌న‌కు సీటు ఇచ్చి, ఎంపీని చేసిన పాపానికి వైసీపీని క‌నీసం ఈ రెండేళ్లైనా ముప్పుతిప్ప‌లు పెట్టాల‌ని ఆయ‌న దృఢంగా నిర్ణ‌యించుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

అందుకే ఎంపీ ప‌ద‌వికి రాజీనామాపై ర‌ఘురామ కొత్త డెడ్‌లైన్ విధించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాను మ‌ళ్లీ న‌ర‌సాపురంలో పోటీ చేస్తే మూడు ల‌క్ష‌ల మెజార్టీతో గెలుస్తాన‌ని ర‌ఘురామ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నిజంగా ఆయ‌న‌కు అంత భ‌రోసానే ఉంటే ఎంపీ ప‌ద‌వికి ఎందుకు రాజీనామా చేయ‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు నిజాయితీగా స‌మాధానం రాదు.

రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌లు ర‌క‌ర‌కాల అంశాల‌కు ప్ర‌తీక‌లుగా చ‌రిత్ర చెప్పుకుంటూ వుంటుంది. కొంద‌రిని పాజిటివ్‌గా, మ‌రికొంద‌రిని నెగెటివ్‌గా స‌మాజం గుర్తించుకుంటుంది. ర‌ఘురామ ఏ కేట‌గిరీలోకి వ‌స్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అస‌లు మ‌నుషుల ల‌క్ష‌ణాలే లేని వాళ్ల గురించి ఎలా చెప్పుకోవాలో, ఆ విధంగానే రాబోవు త‌రాల వారు మ‌న‌నం చేసుకుంటారు.