వైసీపీ ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు నిరాక‌రిస్తున్న జ‌గ‌న్‌

ఏదైనా స‌మ‌స్య చెప్పుకోవాల‌ని అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏదో ఒక స‌మ‌యంలో అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లో, వ్య‌క్తిగ‌త అంశాలో సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటీవ‌ల…

ఏదైనా స‌మ‌స్య చెప్పుకోవాల‌ని అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏదో ఒక స‌మ‌యంలో అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లో, వ్య‌క్తిగ‌త అంశాలో సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటీవ‌ల అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అయితే ఆ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకు మాత్రం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. జ‌గ‌న్ ద‌ర్శ‌నానికి నోచుకోని ఆ నేతే… రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి. ఈయ‌న సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా, సొంత పార్టీ ఎమ్మెల్యే కావ‌డం విశేషం.

ఇటీవ‌ల జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రాయ‌చోటి కేంద్రంగా అన్న‌మ‌య్య జిల్లాను ప్ర‌క‌టించారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగింది. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని ప్ర‌క‌టించ‌డంపై స‌హ‌జంగానే వ్య‌తిరేక‌త‌, ప్ర‌జానీకం నుంచి నిర‌స‌న వెల్లువెత్తింది. ప్ర‌జాభీష్టం మేర‌కు రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి త‌లొంచ‌క త‌ప్ప‌లేదు. రాజంపేట‌ను కాద‌ని రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించ‌డాన్ని తాము ఒప్పుకునేది లేద‌ని ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డితో పాటు అన్ని స్థాయిల్లోని పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు తేల్చి చెప్పారు.

రాజంపేట‌, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజంపేట జిల్లా సాధ‌న స‌మితి పేరుతో అన్ని పార్టీల నేత‌ల నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటైంది. దీక్ష‌ల‌కు దిగారు. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవ‌ల క‌డ‌ప క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మర్పించారు. రాజంపేట జిల్లా కేంద్రంపై ప్ర‌జాభిప్రాయాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లేందుకు మేడా మ‌ల్లిఖార్జున్‌రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.

త‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న ఎమ్మెల్యే మేడా మాట విన‌డానికి సీఎం సుముఖంగా లేన‌ట్టు తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఎమ్మెల్యే సోద‌రుడు మేడా విజ‌య‌శేఖ‌ర్‌రెడ్డి బ‌హిరంగంగా ప్ర‌జానీకానికి చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బంద్‌లో భాగంగా జ‌గ‌న్‌తో పాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సొంత పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

“ఇక్క‌డి స‌మ‌స్య‌ను వివ‌రించ‌డానికి ఎమ్మెల్యే మ‌ల్లిఖార్జున్‌రెడ్డికి సీఎం జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఇంత‌క‌న్నా ఆయ‌న‌కు ప‌నేముంది?  పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. రాజంపేట జిల్లా కేంద్రానికి ఎమ్మెల్యే మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో పాటు క‌లెక్ట్‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి మాత్రం నోరు విప్ప‌డం లేదు. రాజంపేట పేరు చెప్పుకుని ఢిల్లీలో కూర్చున్నారు. పుంగ‌నూరును మాత్రం చిత్తూరు జిల్లాలో క‌లిపావు. మేం అధికార పార్టీలో ఉండీ రోడ్డెక్కాల్సిన దుస్థితి” అని ఎమ్మెల్యే సోద‌రుడు, వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. 

రాజంపేట‌ను కాద‌ని అన‌వ‌స‌రంగా రాయ‌చోటిని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించి వైసీపీ ప్ర‌భుత్వం కొత్త స‌మ‌స్య‌ను కొని తెచ్చుకుంది. ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోడానికి ప్ర‌భుత్వానికి ఇగో అడ్డం వ‌స్తోంద‌నే విమ‌ర్శ‌లున్నాయి.