ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమాయకత్వం గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చెబితే తెలిసొచ్చింది. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లలో అద్భుత విజయాన్ని సాధించిన వైఎస్ జగన్‌లో ఇంత అమాయకుడున్నాడనే విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియలేదు. రఘురామకృష్ణంరాజు తెలివితేటల పుణ్యమా అని జగన్ గురించి జనానికి కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
ఇవాళ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ సహజంగానే తనదైన రీతిలో జగన్ ప్రభుత్వ పాలనా విధానాలపై విమర్శలు గుప్పించారు. ఈ పని గత కొంతకాలంగా రఘురామ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో ఏపీ సీఐడీ చర్యలు రఘురామలో కసి, పట్టుదల పెంచాయి.
ప్రశ్నించడానికే జనసేన పార్టీని పెట్టిన పవన్‌కల్యాణ్… ఆ పని చేయలేదు. కానీ రఘురామ మాత్రం మాటలు చెప్పకుండానే ఆచరిస్తుండడం విశేషం. ఏపీలో మద్యం షాపుల్లో క్యాష్ విధానం ఎందుకని రఘురామ ప్రశ్నించారు. వైసీపీ వాలంటీర్లకు రూ.300 కోట్లతో సన్మానం ఎందుకని నిలదీశారు. తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ పథకం గతంలో వుండేదన్నారు. ఇప్పుడు దాన్ని వైఎస్సార్ తల్లీ, బిడ్డా ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చి పెట్టారని చెప్పుకొచ్చారు.
గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా సీఎం జగన్ మాట్లాడారని రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ అమాయకత్వం ఏంటో రఘురామ చెప్పిన ఈ మాట వింటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, సీఎం జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలని సీబీఐ కేసులున్న రఘురామ విజ్ఞప్తి చేయడం విశేషం. తెలివితేటలంటే ఇవే కదా మరి!