పర్యావరణ స్పృహ బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు మొక్కల పెంపకంపై ఆసక్తికనబరచడమే కాదు, పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రారంభమైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' … శర వేగంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో భాగంగా కొందరు రాజకీయ, సినీ, క్రీడా తదితర సెలబ్రిటీలు ఒకొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటడమే కాకుండా, మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు.
ఈ సవాల్‌ను స్వీకరిస్తూ అనేక మంది ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ప్రముఖుల స్ఫూర్తితో సామాన్యులు 'మేము సైతం' అంటూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు.
ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట ఏకంగా 'రోజా వనం' అనే ఛాలెంజ్ ప్రారంభించి అబ్బురపరిచారు. అంతేకాదు, ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుష్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే.
తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇందులో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ఆమె మొక్కలు నాటి శభాష్ అనిపించుకున్నారు. అనంతరం రష్మి తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని రష్మి కోరారు.