రెండు రోజుల్లో తేలనున్న రవిప్రకాష్ కేసు

టీవీ 9 మాజీ సిఇఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కేసు రెండు రోజులు వాయిదా పడింది. ఈ రోజు కోర్టులో వాదనలు ముగిసాక, తీర్పును న్యాయమూర్తి రెండురోజులు వాయిదా వేసారు. తను అరెస్ట్ కాకుండా,…

టీవీ 9 మాజీ సిఇఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్ కేసు రెండు రోజులు వాయిదా పడింది. ఈ రోజు కోర్టులో వాదనలు ముగిసాక, తీర్పును న్యాయమూర్తి రెండురోజులు వాయిదా వేసారు. తను అరెస్ట్ కాకుండా, ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హైకోర్టుకు, ఆఫై సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు హైకోర్టు కేసు విచారిస్తోంది.

ఈ కేసు కోసం రవిప్రకాష్ హేమా హేమీ లాయర్లను నియమించుకున్నట్లు బోగట్టా. ఇరుపక్షాలు గతవారం, మళ్లీ ఈరోజు తమ తమవాదనలను బలంగా వినిపించాయి. ఆపైన తీర్పు వాయిదా పడింది. ఈ తీర్పును బట్టి రవిప్రకాష్ అరెస్ట్ కావడం లేదా అన్నది ఆధారపడి వుండొచ్చు. ముందస్తు బెయిల్ ఇవ్వకుంటే, పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం వుంది. అలా కాకుండా ముందస్తు బెయిల్ లభిస్తే పరిస్థితి వేరుగా వుంటుంది.

అదే విధంగా ఈ కేసులో రవిప్రకాష్ కు కనుక ముందస్తు బెయిల్ లభిస్తే నటుడు శివాజీకి కూడా ఊరట లభించే అవకాశం వుంది. దీన్ని బేస్ చేసుకుని ఆయన కూడా ముందస్తు బెయిల్ కోరే అవకాశం వుంది. ఇప్పటి వరకు శివాజీ ఎక్కడ వున్నారన్నది ఇరు రాష్ట్రాల పోలీసులు ఆచూకీ తీయలేకపోవడం విశేషం. శివాజీ ఏమీ కరుడుగట్టిన నేరస్థుడు కాదు. మామూలు నటుడు మాత్రమే. అలాంటి వ్యక్తి ఇన్నాళ్లుగా పోలీసులకు దొరకకుండా దాక్కోగలగడం విశేషమే.

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!