పర్యాటకులు ప్లస్ సినిమాలు.. ఇవే రామోజీ ఫిలింసిటీకి ప్రధాన ఆదాయ వనరు. అవి రెండూ లేకపోతే అది ఓ తెల్ల ఏనుగు మాత్రమే. కరోనా లాక్ డౌన్ తదనంతర పరిణామాలతో రామోజీ ఫిలింసిటీ ఆదాయం పూర్తిగా పడిపోయింది.
రాష్ట్ర విభజనతోనే అసలు రామోజీ పతనం మొదలైందని అనుకున్నారంతా.. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటంతో అప్పటికప్పుడు పెద్ద ప్రమాదం లేకుండా పోయింది. కేసీఆర్ లక్ష నాగళ్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.
అయితే ఎప్పటికైనా ఫిలింసిటీని దెబ్బకొట్టేందుకు మరో ఆల్టర్నేట్ సినిమా సెంటర్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే సినిమా సిటీ అనే భారీ ప్రాజెక్ట్ పురుడుపోసుకుంది. అయితే వీలైనప్పుడల్లా దీని వ్యవహారం బైటపెడుతూ.. రామోజీని కాస్త టెన్షన్ పెట్టడం కేసీఆర్ కి అదో సరదా.
వాస్తవానికి చిరంజీవి, నాగార్జున.. కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలవడానికి కారణం వేరే. వరద బాధితులకు సినిమావాళ్ల సాయం, అన్ లాక్ తర్వాత షూటింగ్ లు, థియేటర్ల ఓపెనింగ్ లు.. వీరి భేటీలో ప్రధానాంశం. అయితే బైటకొచ్చాక మాత్రం సినిమా సిటీ హైలెట్ గా మారింది.
హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయి సినిమా సిటీ నిర్మాణానికి 1500 నుంచి 2వేల ఎకరాల స్థలాన్ని ఇవ్వబోతున్నట్టు.. దీనిపై త్వరలోనే కార్యాచరణ మొదలవుతున్నట్టు కేసీఆర్ ప్రకటించేశారు. అంతేకాదు, టాలీవుడ్ ప్రముఖులతో కలసి అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడ సినిమా సిటీపై అధ్యయనం చేసి, ఇక్కడికొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది ఆలోచన.
సినిమా సిటీ వ్యవహారంపై కేసీఆర్ మరీ దూకుడుగా ఉన్నట్టు అర్థమవుతోంది. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఇది మరో ప్రచార ఆర్భాటమా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. సినిమా సిటీ వ్యవహారం బాగా హైలెట్ అయింది, అది ఫిలిం సిటీకి ఎప్పటికైనా ప్రమాదమేననే అనుమానాన్ని బలపరిచింది.
ఇప్పటికిప్పుడు సినిమా సిటీ సాధ్యమా కాదా అనే విషయాన్ని పక్కనపెడితే.. రామోజీలో భయం పెరిగిపోవడం మాత్రం ఖాయం. ఎవరినైనా తమ దారికి తెచ్చుకునే ముందు ఇలా ఓ ఝలక్ ఇవ్వడం రాజకీయ నాయకులకు బాగా తెలిసిన విద్యే. అందుకే ఇలా నాగార్జున, చిరంజీవిని పక్కన పెట్టుకుని రామోజీకి చిన్న షాకిచ్చారు కేసీఆర్.
అసలే బేరాల్లేక ఈగలు తోలుకుంటున్న రామోజీ ఫిలింసిటీపై ఇది పెద్ద బండరాయేనని చెప్పాలి. దీన్ని తట్టుకోవాలంటే అనివార్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బాగా హైప్ ఇవ్వాలి. మొహమాటాలకు పోయి బీజేపీ, టీడీపీ అంటూ నాటకాలాడితే కీలెరిగి వాతపెడతాననే వార్నింగే ఇది. ఈ స్వీట్ వార్నింగ్ కే “సినిమా సిటీ” అనే పేరు పెట్టారు కేసీఆర్.