కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి వెళ్లి ఏఐసీసీ 'తాత్కాలిక' అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి ఫొటోలు తెలుగు మీడియాకు అందాయి. రేవంత్ రెడ్డి తన భార్యాపిల్లలను సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. ఇంటివద్ద వారితో సమావేశం అయ్యి సోనియాగాంధీ ఫొటోలు కూడా దిగారు. ఆఫ్ బీట్ గా ఇది ఆసక్తిదాయకమైన అంశమే.
ఏఐసీసీ ప్రెసిడెంట్ ను కలవాలనే రేవంత్ రెడ్డి పిల్లల ముచ్చట తీరే ఉంటుంది. రాజకీయ నేతల కుటుంబాల్లోని వారికి కూడా ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలు ఉంటాయనే విషయం చెబుతున్నాయి ఈ ఫొటోలు. మరి ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి చూస్తే.. ఇప్పుడు సోనియాగాంధీ ఇలాంటి అపాయింట్ మెంట్లకు సమయం ఇస్తున్నారు సరే, పార్టీ పతనావస్థలోకి జారుకుంటున్నప్పుడు ఇలాంటి అపాయింట్ మెంట్లు ఇచ్చి ఉంటే.. పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అనే సందేహాలు కలగనే కలుగుతాయి.
కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు, కేంద్రంలో ఆ పార్టీ పవర్ ను కోల్పోయాకా కూడా.. సోనియా, రాహుల్ ను కలిసి పరిస్థితులను వివరించాలని అనుకున్న నేతలు ఎంతోమంది. అప్పట్లో అలాంటి వారికి అపాయింట్ మెంట్లు దొరికేవికావు. మరీ భజనపరులు తప్ప.. సోనియాకు పరిస్థితులను వివరించే వాళ్లు ఎవరూలేరు.
తెలంగాణ అంశం, జగన్ మీద కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలు..అతడిని కాంగ్రెస్ ను వీడేలా చేయడం.. ఇవన్నీ కూడా సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ చేపిన పొరపాట్లు కావా? అప్పుడంతా వాస్తవాలను వివరించే వాళ్లకు సోనియా అపాయింట్ మెంట్ దక్కలేదు. తనను తాను ఒక సూపర్ పవర్ అనుకుని సోనియాగాంధీ భజనపరుల మాటలు విని తన పార్టీ పరిస్థితిని ఇలా తయారు చేసుకున్నారు.
కేవలం ఏపీ వ్యవహారాలకు సంబంధించే కాదు.. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పతనావస్థకు కారణం.. కొంతమంది నేతలకు సోనియా, రాహుల్ ల అపాయింట్ మెంట్స్ లభించకపోవడమే అనేమాట వినిపించింది. కుక్కతో ఆడుకునేందుకు ప్రాధాన్యమిస్తూ రాహుల్ గాంధీ తన పార్టీ రాష్ట్రాల విభాగాల నేతలతో మాట్లాడేందుకు సమయాన్ని కేటాయించని వైనాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
తమ నాయకత్వానికి తిరుగులేదనే భ్రమతో సోనియా, రాహుల్ లు అప్పుడు ఎవ్వరినీ ఖాతరు చేయలేదు. ఇప్పుడు ఇలా నేతలకే కాక వాళ్ల ఇంట్లో వాళ్లనీ పిలిచి ఫొటోలు దిగుతున్నారు. బహుశా దీన్నే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటారేమో!