యూత్ ని రెచ్చగొట్టడానికి నాలుగు మసాలా ఫొటోలు తీసి.. వాటిని ట్విట్టర్లో పదే పదే చూపించి, హీరోయిన్ తో ఇంటర్వ్యూలు ఇప్పించి.. సినిమాకు బాగా క్రేజ్ తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం వర్మకు ఓటీటీతో పెట్టిన విద్య. అయితే ఫస్ట్ టైమ్ ఆ పాచిక పారలేదని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ తీసిన థ్రిల్లర్ సినిమాకు రివర్స్ రెస్పాన్స్ వచ్చిందట. 200 రూపాయల టికెట్ పెట్టి అదిగో చూడండి, ఇదిగో చూడండి, నేడే చూడండి మీ అభిమాన ఓటీటీలో అప్సరా రాణి అందాలు అంటూ రెచ్చిపోయిన వర్మ బొక్కబోర్లా పడ్డాడట.
థ్రిల్లర్ పేరుతో విడుదలైన ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మరీ దారుణంగా ఉందని టాక్. అందుకే సహజంగా ట్విట్టర్లో కనిపించే వర్మ అతి, శనివారం ఎక్కడా కనిపించలేదు. నేక్డ్-1 కంటే నేక్డ్-2 కి మంచి రెస్పాన్స్ వచ్చిందని మాత్రమే సరిపెట్టుకున్నాడు ఈ దర్శకుడు. చూస్తుంటే నెటిజన్లు ఈసారి వర్మకు గట్టి షాకే ఇచ్చినట్టున్నారు.
ప్రతిసారి ట్రైలర్ ని ఆసక్తికరంగా తీసి, ఆ తర్వాత సినిమాని గాలికొదిలేయడం వర్మకు తెలిసిన ఫిలాసఫీ. ఓటీటీలు వచ్చాక మరీ అతిగా వారానికో సినిమా వదులుతూ పోయాడు వర్మ. ఫుల్ లెంగ్త్ సినిమాలు కావని తెలిసినా కూడా అభిమానులు వేలం వెర్రిగా డబ్బులు పెట్టుకుని మరీ సినిమాలు చూశారు. అయితే పవర్ స్టార్ మూవీతో ఆ నమ్మకం పూర్తిగా పోగొట్టుకున్నాడు ఆర్జీవీ.
క్లైమాక్స్ అంటూ చెత్త చూపించి డబ్బులు వసూలు చేసుకున్న వర్మకు ఇప్పుడు ప్రేక్షకులే బొమ్మ చూపిస్తున్నారు. థ్రిల్లర్ మూవీకి అతి తక్కువ రెస్పాన్స్ వచ్చే సరికి అటు శ్రేయాస్ సంస్థ కూడా ఆలోచనలో పడిందట. ఫస్ట్ టైమ్ రామ్ గోపాల్ వర్మకు తగిలిన ఎదురుదెబ్బ ఇది అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
థ్రిల్లర్ సినిమాని పైరసీలో కూడా చూడటం కూడా వేస్ట్ అని తేల్చేశారు నెటిజన్లు. ఎవరైనా ఒకసారి మోసపోతారు, ఇంకొంతమంది రెండుసార్లు మోసపోతారు.. వర్మ చేతిలో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు పదే పదే మోసపోయారు. దీంతో థ్రిల్లర్ తో వర్మకే చుక్కలు చూపించారు. ఇప్పటికైనా వర్మలో మార్పొస్తుందేమో చూడాలి.