ఏపీ అధికార పార్టీకి సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మింగుడు పడడం లేదు. అలాగని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మరోవైపు వైసీపీ అసమర్థతే ఆయుధంగా రఘురామకృష్ణంరాజు తన పని తాను నిరాటంకంగా చేసుకుపోతున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్ ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం లేదు.
తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌ను కలిసి విన్నవించడం గమనార్హం. వైసీపీ నేతలు, ఎంపీలు తనపై అనర్హత వేటు వేయాలంటూ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద తనపై చర్యలు తీసుకోవద్దని స్పీకర్‌ను రఘురామ కోరారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించారని ఫిర్యాదు చేశారు.
48 గంటల్లోగా తన పేరును మళ్లీ వెబ్‌సైట్‌లో చేర్చకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా తనను ప్రకటించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌కు ఫిర్యాదు చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్‌రెడ్డికి తాను లేఖ రాసినా పట్టించుకోవడం లేదని రఘురామరాజు తెలిపారు. అందువల్ల తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను రఘురామరాజు కోరడం విశేషం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులపై నిండు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పిన దానికి, ఆ తర్వాత ఆచరణకు పొంతన లేదు.
చంద్రబాబుతో విభేదించిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాలి గిరి (గుంటూరు), వాసుపల్లి గణేష్ (విశాఖ దక్షిణం)ల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమకు సొంత పార్టీ టీడీపీతో పాటు అధికార పక్షం వైసీపీకి సమాన దూరంగా ఉన్నామని, కావున తమకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆ నలుగురు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. దీంతో స్పీకర్ వారిని తటస్థ ఎమ్మెల్యేలుగా గుర్తించి, అసెంబ్లీలో ప్రత్యేక సీట్ల కేటాయించిన సంగతి తెలిసిందే.
గతంలో చంద్రబాబు తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యులను చేర్చుకోవడంతో పాటు వారిలో ఐదుగురికి మంత్రి పదవులు కూడా కేటాయించడంపై జగన్ ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. చంద్రబాబు చేసిన తప్పుల్ని తాను చేయనని చెప్పి, కేవలం నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పనంత మాత్రాన పార్టీ ఫిరాయింపులకు పాల్పడనట్టు అవుతుందా? మరి నైతికత మాటేంటి? ఆ నలుగురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకోవడం వాస్తవం కాదా? జనం కళ్లకు గంతలు కడతారా?
ఇప్పుడు తనను స్వతంత్ర అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు అడగడంలో తప్పేంటి? ఏపీలో జగన్ సర్కార్ చేసింది రైట్ అయితే, ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు తనను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించాలని చేస్తున్న డిమాండ్ రాంగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడే ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున ముందు కొస్తున్నాయి. పాలనలో ఉన్న వాళ్లు తప్పుల్ని సరిదిద్దాలే తప్ప, వాటిని చేయకూడదు.
ఏపీలో జగన్ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండింటే, రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు విలువ ఉండేది. తాను మాత్రం విలువలు పాటించకుండా, కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నీ పక్కాగా ఉండాలంటే ఎలా? అనే ప్రశ్నలకు జగన్ సర్కార్ ఏం సమాధానం చెబుతుంది? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ అనే చందాన రఘురామ విషయంలో జగన్ సర్కార్ తన తప్పిదాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తప్పదంతే.