బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కే మండిపోతున్నారు. సోము వీర్రాజును ఎలాగైనా భ్రష్టుపట్టించాలని ఆర్‌కే పట్టుదలతో ఉన్నారు. సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీ మరింత పాతాళానికి దిగజారాలని ఆర్‌కే కోరుకుంటున్నట్టుగా ఆయన పత్రికలో ఇటీవల బీజేపీ వ్యతిరేక వార్తలను చదివితే అర్థమవుతుంది.
గత ఆదివారం తన కొత్త పలుకు కాలమ్‌లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు గురించి రాతలు ఆర్‌కేకు రివర్స్ అయ్యాయి. ఏపీలో బీజేపీ బలపడాలంటే జీవీఎల్‌ను తక్షణం కంట్రోల్ చేయాలనే ఆర్‌కే హిత వాక్యాలపై ఏపీ సోము వీర్రాజు తనదైన స్టైల్‌లో మొహం వాచేలా తిప్పి కొట్టారు.
దీంతో సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ వార్తా కథనాలు, ఎడిట్ పేజీలో వ్యాసాలు రాయించడం స్టార్ట్ చేశారు. ఆ పరంపరలో శుక్రవారం “నవ్యాంధ్రలో బీజేపీ భవిష్యత్తు” శీర్షికతో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. ఈ వ్యాసకర్త అభిప్రాయాలు…గతంలో అనేక దఫాలు తన వారంతపు వ్యాసంలో ఆర్‌కే వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఒకేలా ఉండడం గమనార్హం. తన వ్యాసానికి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన సోము వీర్రాజుపై “పెంట” చల్లే ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాల్సి ఉంది. ఈ ధోరణి మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ముందుగా ఆర్‌కే కొత్త పలుకులో ఏమన్నారు? ఆ తర్వాత సోము వీర్రాజు ఏమన్నారో తెలుసుకున్నాక, పెంటపాటి పుల్లారావు వ్యాసంలో ఏముందో తెలుసుకుందాం. మొదటగా ఆర్‌కే వ్యాసంలో జీవీఎల్ గురించి ఏమి రాసారో చూద్దాం.
“ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ, అధికార వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. ఎవరడిగారని జీవీఎల్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారో తెలియడం లేదని బీజేపీ నాయకుడొకరు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించవలసిన తీరు ఇదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ పెద్దల మనుసులో ఏముందో తెలియదు గానీ, వారు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ వంటి వారిని ముందుగా అదుపు చేయాలి”… ఇవి ఆర్‌కే కామెంట్స్.
జీవీఎల్‌పై ఆర్‌కే అనుచిత వ్యాఖ్యలకు సోము వీర్రాజు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఆర్‌కేకు ఆయన బహిరంగ లేఖ ద్వారా హితవు పలికారు. సోము వీర్రాజు బహిరంగ లేఖలో ఏమున్నదంటే…
” ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయకత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబునాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి”…..ఇవి సోము ఘాటు వ్యాఖ్యలు. ఇవే ఇప్పుడు ఆర్‌కేకు తల తీసేసినట్టైంది.
ప్రస్తుతానికి వస్తే….పెంటపాటి పుల్లారావు రాసిన వ్యాసాన్ని పరిశీలిద్దాం.
“తెలుగుదేశం పార్టీ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తానని వీర్రాజు చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షిం చేందుకు ప్రయత్నించేదీ లేనిదీ ఆయన చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. మరి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించి, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఆంధ్ర బీజేపీ తెలుగు దేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించివేయడానికి లక్ష్యంగా పెట్టుకోదా అని ప్రజలు విస్మయ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు”
ఢిల్లీలో ఉన్న పెంటపాటి పుల్లారావుకు ఆంధ్రా ఫీలింగ్స్ ఎలా తెలిశాయో మరి? ఏడాది క్రితం చంద్రబాబు పాలనకు చరమగీతం పాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు…ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి వేయడానికి లక్ష్యం పెట్టుకోదా అని విస్మయ సందేహాలు వ్యక్తం చేశారని రాతలను చదివి విస్మయానికి గురి అవుతున్నారు. ఆర్‌కే బాధ పెంటపాటికి ఎందుకో అర్థం కాదు. అసలు పెద్ద మనిషిగా, రాజకీయ విశ్లేషకుడిగా గౌరవం ఉన్న పెంటపాటి గారి నుంచి ఇలాంటి పెంట రాతలేంటి?
“నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించివేసేందుకు రాష్ట్ర బీజేపీ ప్రయత్నిస్తుందా? 2024లో ఆంధ్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సంకల్పించుకున్నదీ లేనిదీ బీజేపీ చెప్పలేదు. ఆంధ్రలో ప్రభుత్వాన్ని ఉపేక్షించి ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని తన దాడులకు లక్ష్యంగా చేసుకుంటున్నది. ఇదొక విచిత్ర వైరుద్ధ్యం!”….పెంటపాటి పుల్లారావు ఆవేదన ఇది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం అయిన మరుక్షణం నుంచి 2024లో బీజేపీ-జనసేన మిత్రపక్షం అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు.
మరి పెంటపాటి పుల్లారావుకు ఆ విషయాన్ని ఏ భాషలో, ఏ రీతిలో చెబితే అర్థమవుతుందో మరి. ఏమిటీ డొంక తిరుగుడు రాతలు. ఇదే ఆర్‌కే రెండు వారాల క్రితం తన ఆర్టికల్‌లో వైసీపీ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్లదని చెప్పారు. ఇప్పుడేమో అధికార పక్షాన్ని ఏమీ అనలేదనే బాధ. 2024లో అధికారంలోకి రాకపోతే బీజేపీ బాధపడాలే కానీ, ఆర్‌కే, పెంటపాటి పుల్లారావులకు ఎందుకో మరి అర్థం కావడం లేదు.
“బీజేపీ జాతీయ నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సత్ససంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో తాను పోరాడబోనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర పాలకపక్షం గట్టి మద్దతునిస్తోంది. ఇది ఆంధ్ర బీజేపీకి ఒక అతి పెద్ద సమస్య”..పుల్లారావు అంటున్నారు.
ప్రధాని మోడీతో సంబంధాలు ఉండడం వల్ల ఆంధ్రా బీజేపీకి సమస్య అయితే…అదే మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు , ఎల్లో మీడియా తలకిందులుగా తపస్సు ఎందుకు చేస్తున్నాట్టో సెలవిస్తారా పెంటపాటి గారు? ఏం జగన్ తప్ప ఎవరు సంబంధాలు పెట్టుకున్నా తమరికి ఇబ్బంది లేదా సారూ? అయినా ఇవేం ప్రశ్నలు…ఇవేం కోరికలు? బీజేపీతో టీడీపీ బాగుంటే మాత్రం ఏపీలో బలపడుతుందా? గత సార్వత్రిక ఎన్నికల ముందు ఏం జరిగిందో బీజేపీకి తెలియకుండానే రాజకీయాలు చేస్తోందా?
“బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిస్తే ఆ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆంధ్ర బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించివేయడంపై ఆసక్తి చూపకపోతే తెలుగుదేశం పార్టీ స్థానంలో ప్రధాన ప్రతిపక్షం అవడం ద్వారా అది పొందే ప్రయోజనమేమిటి?”
చంద్రబాబు బాధ ఆర్‌కే బాధ అయితే…ఆర్‌కే కష్టం పెంటపాటి పుల్లారావు గారితో కన్నీటి వరదను పారిస్తోంది. తమరు చెప్పినట్టే ప్రతిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఉంటే ఎవరెవరికి ఏమేమి ప్రయోజనాలుంటాయో వివరించి ఉంటే బాగుండేది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండడమే ఆర్‌కేకి కడుపు మంట అని అందరికీ తెలుసు.
తన మంటను ఇతరుల ద్వారా వ్యక్తం చేయడం ఆర్‌కేకు వెన్నతో పెట్టిన విద్య. ఏపీలో బలపడేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సమాధి కట్టేందుకు సోము వీర్రాజు నేతృత్వంలో చురుగ్గా పావులు కదుపుతున్నారు. దాన్ని తట్టుకోలేని చంద్రబాబు భక్తుడు ఆర్‌కే …ఆ పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజుపై పెంట చల్లే ప్రయత్నమే పుల్లారావు.
ఒక సుప్రసిద్ధ హాస్య నటుడు చెప్పిన ఓ జోక్‌ను పెంటపాటి పుల్లారావు చివరిగా రాసుకొచ్చారు. నిజానికి ఈ హాస్యం ఆయన వ్యాసానికే సరిగ్గా సరిపోతుంది. ఆ జోక్ … ‘మీరు వివాహితులైనా అవుతారు లేదా అవివాహితులైనా అవుతారు. అంతేగానీ తాత్కాలిక వివాహితులు కారు’….ఏం చెప్పారు సార్. ఆంధ్రజ్యోతి యజమాని అభిప్రాయాలను సమర్థించేందుకు రాసిన ఆ ఆర్టికల్ ద్వారా ఇంతకూ మీరేం అయ్యారో తెలుసా…‘ పెంట’పాటి పుల్లారావు గారూ?