ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణలో ఓ అమాయకుడు, అజ్ఞాని, కమ్మ కులనాయకుడు, రెడ్ల ద్వేషి, అన్నిటికి మించి చంద్రబాబు పరమ భక్తుడు…ఇలా చాలా ముఖాలు ఆయనలో కనిపిస్తాయి. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంటే…పాపం ఆర్‌కేను మాత్రం జగన్ వెంటాడుతూనే ఉన్నాడు. కరోనా కంటే జగనే తనకు ఎక్కువ సమస్య అని ఆర్‌కే చెప్పకనే చెప్పాడు.
ఆర్‌కే తన గురించి తానే కొన్ని హితవులు చెప్పుకున్నాడు. మరికొన్ని ప్రశ్నలకు తనకు తానే జవాబులు చెప్పుకున్నాడు. తన దిగజారుడుతనం గురించి తానే రాసుకున్నాడు. అదే మన ఆర్‌కే గొప్పదనం. అందుకే జర్నలిజంలో ఆర్‌కేది ఓ ప్రత్యేక శైలి. జర్నలిజాన్ని దిగజార్చడంలో ఆర్‌కేకు సాటి వచ్చే మరే జర్నలిస్టు లేడంటే అతిశయోక్తి కాదు. కొంత కాలంగా ఆర్‌కేతో ఈనాడు రామోజీరావు జీవిత చరమాంకంలో పోటీ పడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక విషయానికి వద్దాం. ఈ వారం ఆర్‌కే ‘కొత్త పలుకు’కు ‘కులం కరోనా…!’ అనే శీర్షిక పెట్టాడు. ఆర్‌కే చిట్ట చివరి పలుకు తీసుకుని విశ్లేషించుకుందాం.
‘కులం కాదు.. గుణం ముఖ్యం’ అని పెద్దవాళ్లు చెప్పేవారు. గుణం లేనివాడే ‘కులం.. కులం..’ అని కలవరిస్తుంటాడు….అని ఆర్‌కే తన వ్యాసానికి ముక్తాయింపు ఇచ్చాడు. ఈయన చెప్పింది అక్షర నిజం. కానీ సమస్యల్లా ఏ వ్యక్తి అయితే నీతులు రాస్తున్నాడో, చెబుతున్నాడో ఆయనకే ఒళ్లంతా కులపిచ్చి, కులగజ్జి ఉండటం గమనార్హం.
ఆర్‌కే చెప్పినట్టు కులం కాదు…గుణం ముఖ్యమే. మరి తమరికి అణువణువు కుల పిచ్చి, చంద్రబాబుపై భక్తి ఉండటం వల్లే కదా గుణాన్ని కోల్పోయారు? ఈ విషయాన్ని మరిచిపోయి నీతులు వల్లె వేస్తే ఎలా మాస్టారు! అలాగే గుణం లేని వాడే ‘కులం.. కులం..’ అని కలవరిస్తుంటాడని ఆర్‌కే ఎంత బాగా పలికాడో కదా? ఆర్‌కే రాసే పలుకులో కేవలం కులం గురించి మాత్రమే రాసిన ఆర్టికల్ ఇది ఎన్నోదో ఆయన చెప్పగలడా? ప‌్రతి వారం కమ్మలను జగన్ ద్వేషిస్తున్నాడనే రెచ్చగొట్టే రాతలే తప్ప, మరేమైనా కొత్తగా రాస్తున్నాడా? చెబుతున్నాడా?
ఆర్‌కేకు గుణం లేదు కాబట్టే పదేపదే కమ్మ కులం…కమ్మ కులం అంటూ కలవరిస్తున్నాడు. మనసుతో పాటు మెదడు నిండా కమ్మ కులపిచ్చి, రెడ్ల ద్వేషాన్ని పెంచుకున్న ఆర్‌కే విచక్షణ కోల్పోయి…పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నాడు.
బహుశా తెలుగు జర్నలిజంలో గతంలో ఏ సంపాదకుడు, యజమాని…ఆర్‌కేలా ఇంతగా దిగజారి కులాన్ని నెత్తిన మోసిన సందర్భాలు లేవు. భవిష్యత్‌లో కూడా ఆర్‌కేలా అన్ని నైతిక విలువలను దిగజార్చుకుని రాస్తారని ఊహించలేం.
‘కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారతారు అని చెప్పడానికే వల్లభనేని వంశీ, కరణం బలరామ్ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నా మని వైసీపీకి చెందిన రెడ్డి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు’ అని ఆర్‌కే ఓ చోట రాసుకొచ్చారు.
పాపం ఆర్‌కే బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కమ్మవాళ్లు ఎంతకైనా దిగజారుతారనేందుకు…తనకు తప్ప మరెవరికీ ఆ అవకాశం దక్క కూడదని ఆర్‌కే భావన. మానవ చరిత్ర ఉన్నంత వరకు కమ్మవాళ్లలో దిగజారుడుకు పర్యాయ పదంగా ‘ఆర్‌కే’ అని చెప్పుకునే క్రెడిట్ తనకే దక్కాలని ఆయన ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. అలాంటిది తనకెక్కడ పోటీ వస్తారోనని వల్లభనేని వంశీ, కరణం బలరాంపై అసూయ రాతలు రాశాడు.
రాష్ట్రస్థాయి ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ దామోదర్‌నాయుడు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్‌భాస్కర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు…ఇలా కొంత మంది కమ్మ అధికారుల పేర్లు ఉదహరిస్తూ, వీళ్లపై జగన్ సర్కార్ తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఆర్‌కే రాసుకొచ్చాడు.
అయ్యా ఆర్‌కే గారూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అంత మేధావులు కాదు కానీ, ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నారు…జవాబు చెప్పు. అదేంటంటే వీళ్లందర్ని జగన్ వేధించడం మాట పక్కన పెడితే…చంద్రబాబు హయాంలో కేవలం తన సామాజిక వర్గానికే చెందిన అధికారులకు ముఖ్యమైన పోస్టులు ఎందుకు కట్టబెట్టారో చెబుతావా? అప్పుడేమైనా ఇలాంటి ఏడుపు ఒకటి ఏనాడైనా కొత్త పలుకులో ఏడ్చావా? అన్ని పదవులు కమ్మలకేనా, ఇతర సామాజిక వర్గాలు లేవా అని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ చంద్రబాబుపై ఆర్టికల్ రాసి ఉండింటే….ఈ రోజు మీరు రాసే కొత్తపలుకుకు ఓ విలువ ఉండేది. కానీ తమరెప్పుడూ అలా రాసిన పాపాన పోలేదు.
2019, నవంబర్ 17న ‘ఏపీలో రహస్య అజెండా’….శీర్షికతో ఆర్‌కే రాసిన ‘కొత్త పలుకు’ గురించి మరోసారి గుర్తు చేసుకుందాం.
‘ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హిందువులు వర్సెస్ క్రిస్టియన్లగా సమాజం విడిపోవడానికి బీజం పడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలన్నీ ఈ దిశగానే ఉన్నాయన్న అనుమానాలు హిందువులలో వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదం మారిన ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన అనే ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా మత కోణం ఉందనీ, ముఖ్యమంత్రికి రహస్య అజెండా ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. దేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి మిషనరీ స్కూళ్లు ఇతోధికంగా కృషి చేసిన విషయం తెలిసిందే’…సీఎం జగన్ క్రిస్టియన్ కాబట్టి, ఆయన అమలు చేయాలనుకున్న ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమానికి మత మార్పిడిని అంటగట్టాలనే కుట్రలో భాగమే ఈ వాక్యాలు.
మనసులో ఇంత నీచాన్ని పెట్టుకుని, జగన్‌పై ద్వేషాన్ని రోజురోజుకూ పెంచుకుపోతున్న ఆర్‌కే కలం నుంచి సమాజాన్ని చైతన్యపరిచే ఆర్టికల్ వస్తుందని ఆశించే వాళ్లెవరూ లేరు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి…ఎలాగైనా జగన్‌ను పదవి నుంచి దించేయాలన్నది ఆర్‌కే దుష్ట ఆలోచన, ఆరాటం, పోరాటం. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకూ ఆర్‌కే లాంటి వాళ్లు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ను ఏమీ చేసుకోలేరని తెలుసుకోవడం మంచిది.
రాష్ట్రస్థాయి ఎన్నికల కమిషన్‌పై ఒక రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తిరుగుబాటు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని రాసిన ఆర్‌కే….ఒక్కసారి 2019, ఏప్రిల్ 11న ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూడండి. అంటే ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఏప్రిల్ 10న సీఎం హోదాలో చంద్రబాబు సీఈఓ ద్వివేది కార్యాలయానికి వెళ్లి చేసిన హెచ్చరికలు, ఆ కార్యాలయం ఎదుట టీడీపీ మెరుపు ధర్నా వార్తలను ఒక్కసారి చదివితే వాస్తవాలేంటో తెలుస్తాయ్. ‘జగన్ జేబులో ఈసీ!’ అనే శీర్షికతో బ్యానర్ కథనంగా ఇచ్చిన వార్తను పరిశీలించండి. ఆ కథనానికి ‘ఆయన నిర్ణయాలను అమలు చేస్తోంది, కావాలంటే నేరుగా ప్రచారం చేసుకోండి’ అని ఉపశీర్షికలుగా పెట్టారు. ఈ ఆరోపణలు చంద్రబాబు చేయడంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ మాట్లాడితే మాత్రం అన్నీ కొత్తగా, వింతగా అనిపిస్తున్నాయి. ఆర్‌కేది ఎంత హ్రస్వ దృష్టో అర్థమవుతోంది.
‘రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కమ్మవాళ్లను రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నారు’ అని ఓ చోట ఆర్‌కే ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్‌కే చెబుతున్నట్టు కమ్మ వాళ్లను రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నది నిజమే అయితే, దానికి చంద్రబాబు, రామోజీ, ఆర్‌కే బాధ్యత వహించాలి. జగన్‌ను దెబ్బ తీయాలని ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంతో పాటు వారిలో నలుగురు రెడ్లకు మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు మొదటి ముద్దాయి. ఇది తప్పు అని బాబును హెచ్చరించాల్సింది పోయి…సమర్థిస్తూ పేజీలకు పేజీలు ‘రామకోటి’ రాసినట్టు ‘బాబు’ జపం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి యజమానులు చేసిన రెండో తప్పు.
ఆర్‌కే మరింత ముందుకు పోయి…అందరూ కలసి మా కమ్మ వాళ్లను అంటరాని వాళ్లగా, తాజాగా రోహింగ్యాల కంటే హీనంగా చూస్తున్నారని రాయడం వల్ల…ఆ కులానికి చెందిన అధికారులు, వ్యాపార వర్గాల వాళ్లు అదే భావనలో ఆత్మన్యూనతకు గురవుతున్నారు. దీనికి ఆర్‌కేనే బాధ్యత వహించాలి. ఆర్‌కే రాతల వల్ల మరీ ముఖ్యంగా కమ్మ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర కులాల వాళ్లతో ఫ్రీగా కలిసిపోలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అలాంటి వాళ్లు తమను తాము అనుమానించుకునే దుస్థితి నెలకొంది. ఆర్‌కే రాతల వల్ల చంద్రబాబుకు కమ్మ మినహా మిగిలిన కులాల వాళ్లంతా మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం అంటే పడని వాళ్లంతా జగన్‌కు మరింత బాసటగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు.
‘ఆస్తులపై అంతులేని మమకారం ఉంటుంది కనుకే కమ్మవాళ్లు ఎన్ని అవమానాలనైనా భరిస్తారు అని అంటారు. తెలుగునాట ఇలా ఒక కులాన్ని టార్గెట్ చేయడం ఇదే ప్రథమం. తమ్మినేని సీతారాం అంటున్నట్టుగా రాష్ట్రానికి కమ్మ వైరస్ పట్టుకోలేదు.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే కమ్మ ద్వేషం అనే వైరస్ పట్టుకుంది’ అని ఆర్‌కే తీవ్ర ఆవేదన, ఆక్రోశంతో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న భయానక పరిస్థితుల్లో వైరస్‌ను ఆర్‌కే సందర్భోచితంగా వాడాడు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా వైరస్‌ను పారదోలేందుకు తెలుగు సమాజం చైతన్యంతో నేడు ‘జనతా కర్ఫ్యూ’ పాటించేందుకు ముందుకొచ్చింది. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమై, సామాజిక దూరం పాటించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ముందుకొచ్చారు.
ఇక్కడ తెలుగు సమాజం అదే స్ఫూర్తితో మరో దీక్ష కూడా చేపట్టాలి. అదేంటంటే కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా తయారైన ఆర్‌కే లాంటి కంటికి కనిపించే ఎల్లో కులమీడియా వైరస్‌ను ఈ సమాజం నుంచి పారదోలేందుకు ‘జనతా కర్ఫ్యూ’ కంటే కఠినమైన కర్ఫ్యూ చేపట్టాలి. ఈ సందర్భంగా ఎల్లో వైరస్‌లుగా ముద్ర పడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 తదితర పత్రికలు, చానళ్లను పూర్తిగా చదవడం, చూడటం మానేయాలి. అప్పుడే ఈ తెలుగు సమాజానికి పట్టిన ‘ఎల్లో వైరస్’ పీడ విరగడవుతుంది. అందుకోసం తెలుగు సమాజం మరింత చైతన్యవంతమై ప్రతినబూనాల్సిన అవసరం ఉంది.