బాబుకి ఆడ ఉసురు తగిలింది.. రోజా లాజిక్

టీడీపీ ఓటమికి కారణాలు తెలియవంటూ చంద్రబాబు చెప్పుకుంటుంటారు. కానీ తెలుగుదేశం పాపాలకు తగిన శాస్తి జరిగిందనది ప్రజల నమ్మకం. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరో కొత్త కోణాన్ని బైటకు తీశాయి.…

టీడీపీ ఓటమికి కారణాలు తెలియవంటూ చంద్రబాబు చెప్పుకుంటుంటారు. కానీ తెలుగుదేశం పాపాలకు తగిన శాస్తి జరిగిందనది ప్రజల నమ్మకం. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరో కొత్త కోణాన్ని బైటకు తీశాయి. టీడీపీ నేతలకు, ఆ పార్టీకి ఆడవారి ఉసురు బాగా తగిలిందట. ఆడవాళ్ల ఉసురు పోసుకున్న ఆపార్టీ అందుకే మట్టికొట్టుకు పోయిందని అసెంబ్లీలో ఘాటుగా విమర్శించారు రోజా. మహిళా ఎమ్మార్వోని అవమానించినందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్రస్ లేకుండాపోయారని అన్నారు రోజా.

నారాయణ విద్యాసంస్థల్లో ఎంతోమంది విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి విషయంలో ప్రభుత్వం స్పందించలేదని, అందుకే కోట్లున్నా, మంత్రిపదవి ఉన్నా, నారాయణ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్నారు. ఇక అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేసి ఏడాది పాటు తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడమే కాకుండా.. ఆడవారు వంటింటికే పరిమితం కావాలన్నట్లు వ్యాఖ్యలు చేసిన అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కి కూడా ఆడ ఉసురు బాగానే తగిలందన్నారు రోజా.

విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్ దుమారం కూడా ఈ ఎపిసోడ్ లో ఉంది. కాల్ మనీ వ్యవహారంలో వందలాది మంది మహిళలు బాధితులుగా ఉన్నారు. వీరందరి ఉసురు తెలుగుదేశం పార్టీకి తగిలిందని, అందుకే ఆ పార్టీ ఓడిపోయిందని అన్నారు రోజా. ఫైనల్ గా టీడీపీ అధినేత చంద్రబాబుకి కూడా ఈ ఎఫెక్ట్ తగిలిందన్నారు.

వైసీపీపై విమర్శలు ఎక్కు పెడుతూ.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని పదే పదే చంద్రబాబు అసెంబ్లీలో అనేవారని, అలా ఆడవారి పుట్టుకను కూడా అవహేళన చేసిన చంద్రబాబుకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అధికారం నుంచి దించేసి ఆయన బలాన్ని 23కి తగ్గించేశారని గుర్తుచేశారు.

పసుపు-కుంకుమ పథకంతో.. మహిళా ఓటుబ్యాంకు మనదేనని మురిసిపోయిన చంద్రబాబుని ఇలా ఆడ ఉసురు అధికారానికి దూరం చేసిందన్నమాట. 

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!