సొంత పార్టీ నేతలకే నగరి ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో రౌడీయిజాన్ని సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలో ప్రతిష్టంభన నెలకున్న సంగతి తెలిసిందే.
నియోజకవర్గంలో తనకు వ్యతిరేక గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్న రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డిలకు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక చర్యలను విడనాడాలని కోరారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని ఆమె హెచ్చరించారు.
ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలను తాను చెప్పిన అభ్యర్థికి కాకుండా, తామే బరిలో నిలబడ్డ రెడ్డివారి బ్రదర్స్‌పై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా గుర్తింపు పొందారు.
వైసీపీలో మహిళా ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రోజా… సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదుర్కోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండోరోజూ కూడా నిండ్ర ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆమె కలిశారు.
పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డిపై వేటు వేయాలని మంత్రిని రోజా కోరినట్టు సమాచారం. మంత్రిని కలవడానికి వెళ్లిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అసమ్మతి రాజకీయాలు నడుపుతున్న నేతలపై విరుచుకుపడ్డారు.
అయితే అసమ్మతివాదులను ప్రోత్సహిస్తున్న వారి దగ్గరికే వెళ్లి ఫిర్యాదు చేయడం వల్ల ఫలితం ఏంటని? ఆమె అనుచరులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.