మరీ ఇంత చౌకబారు అభిప్రాయాలు, అభిరుచులు ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు ఎలా అయ్యాడో అనే అనుమానం కలగకమానదు. అమెరికా అంటే మనం భూతలస్వర్గమని భావిస్తాం. అమెరికా అంటే మన ఆలోచనలు, అభిప్రాయాల్లో చాలా ఉన్నతమైన స్థానం ఉంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడి మాటలు , చేతలు చూస్తుంటే…ఇతను ఆ దేశ అధ్యక్షుడు ఎలా అయ్యాడు? ఆ దేశ ప్రజలు ఎలా ఎన్నుకున్నారనే అభిప్రాయం కలుగుతుంది.
అమెరికాలోని కొలరాడ్, లాస్ వేగాస్‌ల్లో డొనాల్డ్ ట్రంప్ మాటలు వింటే చాలా విచిత్రమనిపిస్తోంది. ఆయనకు ప్రచార పిచ్చి పీక్‌స్టేజ్‌కు చేరిందనే అభిప్రాయం కలుగుతోంది.
‘స్వాగతం పలకడానికి 10 మిలియన్లు (కోటి) మంది వస్తారని ప్రధాని మోడీ చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా 6-10 మిలియన్ల మంది ఉంటారని వారు అంటున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. ఇంత భారీగా జనం వస్తుంటే స్టేడియంలోకి వెళ్లడానికి వేల మందికే అవకాశం ఉంటుంది. ఆ సంఖ్య చాలా తక్కువ. ఇంత తక్కువ జనం వస్తే నేనెలా సంతృప్తి చెందుతా? కోటి మంది జనాభా వచ్చినప్పుడు స్టేడియంలో 60 వేల మందికే అవకాశం కల్పిస్తే ఎలా? చాలా బాధపడతా’ అని ట్రంప్ అన్నారు.
ఇదే కాదు , సోషల్ మీడియాలో తమను అనుసరించే వాళ్ల గురించి ట్రంప్ అభిప్రాయం వింటే షాక్ తింటాం.
‘భారత్‌లో 150 కోట్ల జనాభా ఉంది. అందువల్ల మోడీ ఖాతాను అంత మంది (4.4 కోట్లు) అనుసరిస్తున్నారు. అది పెద్ద విశేషం కాదు. అమెరికా జనాభా 32.5 కోట్ల మంది. ఆ లెక్కన నేనే నెంబర్ వన్ (ట్రంప్ ఖాతాను 2.7 కోట్ల మంది అనుసరిస్తున్నారు). మోడీ రెండో స్థానంలో ఉన్నారు. ప్రధాని మోడీకి అభినందనలు తెలిపా. దేశ జనాభా మీకు ప్రయోజనం కలిగించిందని కూడా చెప్పా. కానీ నేను ఫేస్‌బుక్‌లో మొదటి స్థానంలో ఉన్నట్టు స్వయంగా ఆ సంస్థ అధిపతి జుకర్‌బర్గే చెప్పారు’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కేవలం ఈ రెండు అంశాలు చాలు…డొనాల్డ్ ట్రంప్ ఎంత అథమస్థాయి అభిప్రాయాలు, అభిరుచులు కలిగి ఉన్నాడో చెప్పడానికి. ఇలాంటి నేతను అమెరికా పౌరసమాజం ఎన్నుకోడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందబ్బా అనే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.