ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ రెండు పాటల్లో ఓ పాట హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క పాట కోసం నిర్మాత దానయ్యతో భారీ స్థాయిలో ఖర్చు పెట్టించబోతున్నాడు రాజమౌళి. ఇంకా చెప్పాలంటే… భారతీయ సినీచరిత్రలోనే ఖరీదైన పాటగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
ఈ పాట షూటింగ్ కోసం యూనిట్ అందర్నీ వెంటేసుకొని యూరోప్ వెళ్లబోతున్నాడు రాజమౌళి. వచ్చే నెల ఈ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ఈ షూటింగ్ లో రాజమౌళి, రామ్ చరణ్ తో పాటు అలియాభట్, ఒలీవియా మోర్స్ కూడా పాల్గొంటారు.
సౌత్ లో కాస్ట్ లీగా సాంగ్స్ తీసే ఏకైక దర్శకుడు శంకర్. జీన్స్ సినిమా టైమ్ లోనే ఓ పాట కోసం ప్రపంచ వింతలన్నింటినీ కవర్ చేసి ఖరీదైన సాంగ్ తీశాడు శంకర్. ఆ తర్వత శివాజీ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో సెట్ వేసి తీసిన పాట మరో ఖరీదైన వ్యవహారం.
ఇలా ఎప్పటికప్పుడు సాంగ్స్ లో ట్రెండ్ క్రియేట్ చేయడం శంకర్ కు అలవాటు. బాహుబలి నుంచి రాజమౌళి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. బాహుబలిలో సాంగ్స్ పిక్చరైజేషన్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు వాటిని మించేలా ఆర్ఆర్ఆర్ లో ఓ సాంగ్ కు రూపకల్పన చేశాడు రాజమౌళి. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా, రేపు ఉదయం 11 గంటలకు, ఈ సినిమా నుంచి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు.