ప్రధానమంత్రి నరేంద్రమోడీ భద్రత కోసం కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అత్యంత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. ఏకంగా 600 కోట్ల బడ్జెట్ ను మోడీ భద్రత కోసం కేటాయించారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత కల్పిస్తుందనే సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్ర బడ్జెట్ లో 600 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించారు.
ఇది వరకూ ఎస్పీజీ ప్రొటెక్షన్లో కొంతమంది ప్రముఖులు ఉండేవారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, మన్మోహన్ లాంటి వాళ్లకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉండేది. అయితే ఇటీవలే వారందరికీ ఆ భద్రతను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎస్పీజీ ప్రొటెక్షన్ కలిగిన ఏకైక వ్యక్తి నరేంద్రమోడీ. అయితే ఈ సారి ఎస్పీజీకి ఆర్థిక కేటాయింపులు భారీగా పెంచారు. క్రితం ఏడాది 540 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించగా, ఇప్పుడు ఆరువందల కోట్ల రూపాయలకు పెంచారు.
ఇలా మోడీకి మాత్రమే భద్రత కల్పించే ఎస్పీజీకి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా అయ్యింది. దీంతో మోడీ భద్రత ఖర్చు 600 కోట్ల రూపాయలు అవుతోంది. సగటును రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేవలం మోడీ భద్రత కోసం బడ్జెట్ కేటాయింపులు ఉండటం సంచలన స్థాయిలో ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.