మధ్యప్రదేశ్ లో జరిగిన తీరునే రాజస్తాన్ లో జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో సింధియా చేసిన పనే రాజస్తాన్ లో సచిన్ పైలట్ చేస్తున్నాడనే టాక్ మొదలైంది. ఇప్పటికే మంత్రాంగం ఢిల్లీకి చేరిందని సమాచారం. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తన ఫిర్యాదులు అన్నీ చేసేయడానికి సచిన్ పైలట్ ఢిల్లీ వెళ్లాడనే ప్రచారం ఒక వైపు సాగుతూ ఉండగా, ఆయన ఇప్పటికే ఫోన్ ఎత్తడం లేదని, బీజేపీతో ఆయన మంతనాలు సాగిస్తున్నందు వల్లనే ప్రస్తుతానికి అటు కాంగ్రెస్ నేతలకు, ఇటు మీడియాకు అందుబాటులో లేకుండా పోయాడనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది.
ఏతావాతా రాజస్తాన్ లో పైలట్ బలం 25 మంది ఎమ్మెల్యేలు అని సమాచారం. వాళ్లంతా కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి, బీజేపీ అండతో ఎమ్మెల్యేలుగా చలామణి అయిపోతే.. గెహ్లట్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నట్టే. అయితే పైలట్ తో సంబంధం లేకున్నా తమకు మినిమం మెజారిటీ ఉందని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారట. పైలట్ తిరుగుబాటు చేసినా తమ పార్టీ ప్రభుత్వానికి ఢోకా లేదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట.
అయితే ఈ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చేసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాజకీయ వ్యూహాలకు బీజేపీ చాలా సానుకూలంగా ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో ఇప్పటికే ఈ తరహా వ్యూహాలను బీజేపీ అమలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఇలాంటి నేపథ్యంలో రాజస్తాన్ లో కూడా అదే పని చేయడానికి కమలం పార్టీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు కూడా చేస్తోందనే టాక్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో పైలట్ కు బంపర్ ఆఫర్ ఏదైనా ఇస్తే అతడు కూడా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడేమో. రాజకీయంగా ఇలాంటి ఎన్నో కుట్రలను కాంగ్రెస్ గతంలో అమలు చేసిందేమో కానీ, ఇప్పుడు బీజేపీ అదే పని చేసినా అది ప్రజల తీర్పును అవమానించడమే అని మాత్రం వేరే చెప్పనక్కర్లేదు.