తెలుగు రాజకీయాల్లో మళ్లీ ఆధ్యాత్మిక ప్రభ గట్టిగానే కనిపిస్తోంది. నిజానికి ఉత్తరాదిన స్వాములూ మఠాలకు ఎక్కువగా రాజకీయ అనుబంధం ఉంటూ వచ్చింది. కానీ ఇపుడు అది దక్షిణాదిన కూడా విస్తరిస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఉమ్మడి ఏపీని ఏలిన గత ముఖ్యమంత్రులలో కూడా కొందరికి దైవ భక్తి విశేషంగా ఉండేది. ఎన్టీయార్ తాను స్వయంగా కాషాయ వస్త్రధారిగా నిలిచి ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా కొందరు స్వాముల పట్ల తమ విశ్వాసాలను చాటుకున్నారని గత చరిత్ర చెబుతోంది.
ఇక తెలంగాణాకు కేసీయార్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల హోమం పెద్ద ఎత్తున చేయించారు. దానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా స్వాముల వారు హాజరై నిండు దీవెనలు అందించారు. ఆ తరువాత కేసీయార్ రెండవ మారు సీఎం గా అధికారంలోకి రావడంతో రాజశ్యామల హోమం విశిష్టత తెలిసివచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా విశాఖలోని శారదాపీఠంలో రాజశ్యామలా హోమం అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలి రోజున ముఖ్యమంత్రి జగన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజున రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ హాజరయ్యారు.
రాజశ్యామల అమ్మవారి హోమం విజయవంతంగా పూర్తి అయిందని, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతోనే దీనిని నిర్వహించామని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
తెలుగు రాజకీయాలలో భారీ మార్పులను తీసుకువచ్చిన ఘనత ఈ హోమానికే ఉందని ఆయన చెప్పడం ఈ సందర్భంగా విశేషం. మొత్తం మీద చూసుకుంటే రాజశ్యామల హోమానికి ఇంతటి ప్రాచుర్యం ఇటీవల కాలాలలో లభించడం నిజంగా ఆసక్తికరమైన అంశమే.