హీరోయిన్లంతా జిమ్ కు వెళ్తారు. రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్లు అయితే ఎక్కువ సమయం జిమ్ లో గడపడానికే ఇష్టపడతారు. బాడీ షేప్ మెయింటైన్ చేయడానికి హీరోయిన్లకు ఇది చాలా అవసరం. రాశి ఖన్నా లాంటి బొద్దుగుమ్మలు కూడా జిమ్ చేసి జీరో సైజ్ కు వచ్చారు. అయితే హీరోయిన్ సాయిపల్లవికి మాత్రం జిమ్ అంటే పడదు.
అవును.. ఇప్పటివరకు జిమ్ కు వెళ్లి కసరత్తులు చేయలేదంటోంది ఈ బ్యూటీ. తనకు అలాంటి వ్యాయామాలు అక్కర్లేదని అంటోంది. మరి ఎక్సర్ సైజులు చేయకుండా, సాయిపల్లవి తన ఫిజిక్ ను ఎలా మెయింటైన్ చేస్తోంది. దానికి కారణం డాన్స్.
తనకు డాన్స్ చేయడమే పెద్ద వ్యాయామం అంటోంది సాయిపల్లవి. ప్రతి రోజూ డాన్స్ చేస్తానని, అది తనను ఫిట్ గా ఉంచడంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తుందని చెబుతోంది. చివరికి షూటింగ్ గ్యాప్స్ లో కూడా డాన్స్ చేయడానికి తను ఇష్టపడతానని చెబుతోంది.
నిజానికి రెగ్యులర్ గా చేసే వర్కవుట్స్ కంటే డాన్స్ చాలా మంచిది. 30 నిమిషాలు డాన్స్ చేస్తే 400 కెలొరీల వరకు కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాయిపల్లవి అదే చేస్తుంది. చెమట్లు కక్కేలా డాన్స్ చేస్తుంది.
డాన్స్ తో పాటు మెడిటేషన్ చేయడం, పూర్తిగా శాకాహారం తీసుకోవడం సాయిపల్లవి గ్లామర్ సీక్రెట్స్. శాకాహారంలో కూడా తక్కువగా ఉడికించినవి తినడం చాలా మంచిదని చెబుతోంది ఈ నేచురల్ బ్యూటీ.