ఆంధ్రాకే మా ఓటు…?

దేశానికి సరిహద్దు సమస్యలు ఉన్నట్లే రాష్ట్రాలకు ఉంటాయి. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఒడిషా రాష్ట్ర సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇందులో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం చివరిలో వచ్చే కొన్ని గ్రామాల విషయంలో అతి…

దేశానికి సరిహద్దు సమస్యలు ఉన్నట్లే రాష్ట్రాలకు ఉంటాయి. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఒడిషా రాష్ట్ర సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇందులో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం చివరిలో వచ్చే కొన్ని గ్రామాల విషయంలో అతి పెద్ద వివాదం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.

ఇలా కొటియా గ్రామాలుగా ఉన్నవి అన్నీ కూడా  మావే అని ఒడిషా సర్కార్ అంటోంది. మరోవైపు చూస్తే అక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం మీరు మా వైపే ఉండాలంటూ కొటియా గ్రామ ప్రజలను ప్రతీ రోజూ వేధిస్తున్నారు, సాధిస్తున్నారు. 

ఆంధ్రాకు చెందిన అధికారులను రానివ్వరు, ప్రజా ప్రతినిధులను సైతం అడ్డుకుంటారు, ఇదంతా ఒడిషా అధికారుల దౌర్జన్యంగా కూడా విమర్శలు ఉన్నాయి. అయితే తాము అన్ని విధాలుగా ఆంధ్రాలో అంతర్భాగమని కొటియా గ్రామ ప్రజలే వివరిస్తున్నారు.

మేము ఏపీ ప్రభుత్వ పధకాలను పూర్తిగా అందుకుంటున్నాం, ప్రభుత్వం మా సంక్షేమం చూస్తోంది. మేము ఇక్కడ ఉంటేనే సుఖపడతామని తాజాగా వారు కుండబద్ధలు కొట్టేశారు. అంతే కాదు, ఆ గ్రామాలకు చెందిన పెద్దలు కొందరు తాజాగా విజయనగరం జిల్లా కలెక్టర్ ని కలసి తమను ఆంధ్రాలోనే కొనసాగేలా చూడాలని కోరుకున్నారు. ఇలా స్వచ్చందంగా వచ్చిన వారిని ఆదరించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఏపీ సర్కార్ తో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా కొటియా గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమకు ఆంధ్రాతో కలసి ఉండడమే ఇష్టమని, ఒడిషాలో అసలు కలపవద్దు అంటూ చెప్పడం విశేషం. దాదాపుగా 21 గ్రామాలు, వేలాది మంది ప్రజలు కలిగిన వీరంతా ఆంధ్రా పౌరులుగానే ఉంటామని అంటున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలని, ఒడిషా సర్కార్ తో మాట్లాడి వివాదాలకు తెర దించాలని అంతా కోరుతున్నారు. ఒక్క సెంట్ జాగా కూడా వదులుకోవడానికి ఇష్టపడని పాలకులు ఉన్న ఈ రోజుల్లో ఒడిషాను ఏపీ సర్కార్ ఎలా ఒప్పిస్తుందో చూడాలి మరి.