సంచయిత నియామకంలో తప్పేమిటి?

స్త్రీ పురుషులకు సమాన హక్కులు వుండాలి అంటూ ఆస్తి హక్కులో సమాన వాటా ఇచ్చిన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు. ఆయన పార్టీ తెలుగుదేశం మాత్రం, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ కు…

స్త్రీ పురుషులకు సమాన హక్కులు వుండాలి అంటూ ఆస్తి హక్కులో సమాన వాటా ఇచ్చిన రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు. ఆయన పార్టీ తెలుగుదేశం మాత్రం, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ కు ఓ మహిళను అధినేతను చేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి భూముల ఆక్రమణ రంగు పులమాలని ప్రయత్నం చేస్తోంది. 

మాన్సాస్ నిబంధనల్లో మహిళకు అధికారం లేదంటోంది. కానీ అదే అశోక్ తన రాజకీయ వారసత్వం తన కూతురుకు ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నారు. చిత్రమేమిటంటే, అశోక్ భార్య కూడా విజయనగరం మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేసారు. అంటే ఆయన భార్య అధికారం చేపట్టవచ్చు, కూతురు అధికారం కోసం ప్రయత్నించవచ్చు. కానీ అన్న కూతురు మాత్రం అధికారానికి పనికిరాదు.

మరి వాస్తవానికి అశోక్, ఆనంద్ లకు కొడుకులు లేరు. మరి వారి తరువాత మాన్సాస్ కు ఎవరు చైర్మన్? అప్పుడేం చేస్తారు. అశోక్, ఆనంద్ ల సవతి సోదరులను లేదా వారిపిల్లలకు మాన్సాస్ పగ్గాలు అప్పగిస్తారా? జగన్ ప్రభుత్వం అలా అప్పగిస్తే ఒప్పుకుంటారా?

మాన్సాస్ ట్రస్ట్ కు అసలు ఎవరు వారసులు?

మాన్సాస్ సంస్థను 1958లో స్థాపించిన దగ్గర నుంచి 1995 వరకు పివిజి రాజు చైర్మన్ గా వుంటూ వచ్చారు. ఆయన అనంతరం పెద్ద కొడుకుగా ఆనంద్ గజపతి రాజు ఆ పదవి స్వీకరించారు. ఆయన అనంతరం సోదరుడిగా అశోక్ కు ఆ పదవి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అశోక్ ను వంశపారంపర్య ధర్మకర్తగా జీవో ఇచ్చి, ఆయన హుటాహుటిన సింహాచలం వచ్చి ప్రమాణ స్వీకారంచేసేసారు. ఇది చాలా ప్లాన్డ్ గా, సైలంట్ గా జరిగిపోయింది ఆ రోజుల్లో. 

అప్పుడు ఎవరికీ ఏ అభ్యంతరం లేకపోయింది. ఎవరూ అభ్యంతరం పెట్టలేదు కూడా. నిజానికి చాలా మందికి తెలియని సంగతి, ఏమిటంటే, పివిజి రాజు కు కేవలం అశోక్, ఆనంద్ మాత్రమే కాదు పిల్లలు. మరో ఇద్దరు మగపిల్లలు కూడా వున్నారు. వారు రెండో భార్య పిల్లలు. వారిలో ఒకరు వారణాసిలో, ఒకరు విజయనగరంలో వుంటున్నారని వినడమే కానీ, మామూలు జనాలకు అంతగా తెలియదు వారి గురించి. ఒక విధంగా చెప్పాలంటే వారు కూడా మాన్సాస్ కు కావచ్చు, వంశపారంపర్య ధర్మకర్త పదవికి కావచ్చు వారుసులు, అర్హులే. అయితే పోలిటికల్ గా అశోక్, ఆనంద్ యాక్టివ్ గా వుండడంతోనూ, సవతి సోదరులకు అంత ఆసక్తి లేని కారణం కావచ్చు, సమస్య ఏర్పడలేదు.

ఇక పివిజికి ఇద్దరు ఆడపిల్లలు వున్నారు ఇద్దరు భార్యలకీ. వారు పెళ్లిళ్లు అయి వేరుగా వున్నారు కాబట్టి సమస్య లేదు. ఇక ఆనంద్ విషయానికి వస్తే, ఆయన అప్పట్లో కేరళకు చెందిన ఉమ గజపతి రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఆమె కాంగ్రెస్ లో చురుగ్గా వుండేవారు. రాజీవ్ కోటరీలో ఆమె ఒకరుగా పేరుపొందారు. ఆమెకు ఆనంద్ కు ఇద్దరు ఆడపిల్లలు. ఆ తరువాత ఆనంద్ తో ఉమ వేరు పడ్డారు. వేరు పడ్డాక కూడా ఉమ గజపతి అంటే ఆనంద్ చాలా ప్రేమించేవారు.

ఈ విషయంలో ఓ ఉదాహరణ చెప్పాలి. ఆనంద్-ఉమ వేరు పడిన తరువాత ఎన్నికల్లో భీమిలి నుంచి ఉమ, బొబ్బిలి నుంచి ఆనంద్ పోటీ చేస్తున్న సమయం అది. ఆనంద్ తన ప్రచారాన్ని చురుగ్గా నిర్వహించేవారు కాదు, పైగా ఆయన ప్రసంగాలు అంతర్జాతీయ అంశాల చుట్టూ తిరిగేవి. అందుకని పార్టీ జనాలు ఆయనను ఇంట్లో వుంచి వారే ప్రచారం నిర్వహించేవారు. ఇలాంటి టైమ్ లో ఉమ గజపతి భీమిలి నియోజకవర్గంలో కాస్త టఫ్ ఫైట్ తో వున్నారు. ఆ టైమ్ లో ఆనంద్  'నేను భీమిలి వెళ్లి ఉమ తరపున ప్రచారం చేస్తే ఎలా వుంటుంది' అని పార్టీ జనాలను అడగడం విశేషం. 

సాధారణంగా విడిపోయిన తరువాత కోపాలు తాపాలు వుంటాయి. కానీ ఆనంద్ ఎప్పుడూ అలా లేరు. పైగా సన్నిహితులతో కూర్చున్నపుడు ఉమ గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ వుండేవారు. అలాంటి ఆనంద్, అంతగా ప్రేమించిన ఉమగజపతి కూతురు సంచయిత. ఇప్పుడు ఆమెకు చైర్ పర్సన్ పదవి ఇఛ్చారు. అది సమస్య అయింది. ఇక్కడ ఒక వేళ ఆమెకు కాకుండా, ఆనంద్ రెండో భార్య కో? లేదా రెండో భార్య ద్వారా కలిగిన కుమార్తేకో ఇచ్చి వుంటే ఏమని వుండేవారు. 

లేదూ, పివిజి రెండో భార్య పిల్లలు ఇద్దరు వున్నారు కదా? వారికి ఇచ్చి వుంటే ఏమనేవారు? వారి కూడా కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని వుంటుంది కదా? పైగా వారిది సంచయితలా మూడో తరం కాదు, రెండో తరం. వారు ఆసక్తిగా లేరు కాబట్టి సరిపోయింది అనుకోవాలేమో? లేదూ అంటే ఈ రగడ ఇప్పటికే ఎప్పుడో రేగి వుండేది.

ఇక మాన్సాస్ లో సంగతులు. మాన్సాస్ లో అవకతకలు భారీగా లేకపోవచ్చు కానీ, గతంలో అనేకసార్లు మాన్సాస్ లో కీలక బాధ్యులను అటు ఇటు మార్చడం, మళ్లీ తెచ్చి కూర్చోపెట్టడం లాంటివి జరిగాయని వార్తలు అయితే వున్నాయి. ఇప్పుడు కూడా దశాబ్దాలుగా మాన్సాస్ ను నిర్వహిస్తున్నవారే సీట్లలో వున్నారు. సంచయిత వచ్చినంత మాత్రాన వాళ్లు మాయం అవుతారని అనుకోవడానికి లేదు. 

మాన్సాస్ పగ్గాలు చేతుల్లోంచి జారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అశోక్ గజపతి వర్గం, రెండు రకాల ప్రచారానికి దిగింది. ఒకటి పివిజి చేసిన పనులు అన్నీ అశోక్ కు ఆపాదించి, అలాంటి అశోక్ కు అన్యాయం జరిగిపోయిందన్న ప్రచారం ఒక వైపు. సంచయితకు పగ్గాలు ఇవ్వడం మాన్సాస్ భూములు అన్యాక్రాంతం చేసేయడానికే అనే ప్రచారం మరో వైపు.

నిజానికి రెండూ వాస్తవం కాదు. ఎందుకంటే సంచయిత మాన్సాస్ పగ్గాలు చేపట్టిన తరువాత అందరి కళ్లూ అంటే వుంటాయి. ఈ కళ్లు కప్పి, ఇష్టం వచ్చేనట్లుచేసే అవకాశం వుండదు. 

రెండవది, పివిజి తరువాత ఆ వంశంలో ప్రజల కోసం అద్భుతమైన త్యాగాలు ఎవరూ చేసింది అంతగా లేదనే చెప్పాలి. అలా చేసి వుంటే విజయనగరం రాజావారుగా అశోక్ రెండు సార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చేది. కాదు. నిజానికి మాన్సాస్ ఎంత మంచి సంస్థ, విద్యాసంస్థ అయినా, దాని స్థాపన నేపథ్యం వేరే అని పూర్వీకులు చెబుతుంటారు.

కేంద్రంలో అప్పట్లో పివిజి కీలకంగా వుండేవారు. ఉత్తరాది క్షత్రియులతో మంచి సంబంధాలు వుండేవి. అప్పట్లో ఫ్రభుత్వం ద్వారా తమ ఆస్తులపై వేటు పడకుండా కుటుంబ ట్రస్ట్ లు పెట్టి, ఆస్తులను అటు మళ్లించారు. ఇది గమనించి, పివిజి కూడా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి ఆస్తులను అటు మళ్లించారు. పివిజికి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. అశోక్, ఆనంద్ లు ఇద్దరినీ అందుకే బాగా చదివించారు. కోరుకొండ సైనిక్ స్కూలు కోసం తన భాగారుల నుంచి వందల ఎకరాలు కొని మరీ ఇచ్చారు. అందువల్ల ఆయన ఆస్తులను కాఫాడుకుని, ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడాన్ని తప్పుపట్డడానికి లేదు. అలా అని ఈ ట్రస్ట్ పూర్తిగా ఎక్కడా ఓ రూపాయి కూడా దారి మళ్లకుండా పని చేస్తూందా అన్నది అనుమానం. ఇప్పటి వరకు లెక్కలు అన్నీ ప్రభుత్వం కూలంకషంగా ఆడిట్ చేస్తే, అప్పుడు సర్టిఫికెట్ ఇవ్వొచ్చు.

ఇలాంటి నేపథ్యంలో భూముల ఆక్రమణకు అంటూ అడ్డగోలు వాదన తెరపైకి తెచ్చి, పోయిన తమ అధికారాన్ని తిరిగి తీసకోవాలని ప్రయత్నిస్తోంది అశోక్ వర్గం. కానీ కోర్టులో ఈవాదన నిలవదు. మాన్సాస్ ట్రస్ట్ నిబంధనలు, సంచయిత గజపతి వారసత్వం ఇవన్నీ కోర్టు ముందుకు రావాల్సిందే. ఈలోగా ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం తప్ప, ఇదంతా మరోటి కాదు. 

ఆర్వీ