ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు.
అప్పటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుంది కేసీఆరే అని ఆరోపించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్ళినప్పుడు… రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
2015లో జూన్ 18, 19 తేదీల్లో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీశ్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబులు మాట్లాడుకున్నారన్నారు.
తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీళ్లు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను నిలదీశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారన్నారు. హుజురాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుందని బండి సంజయ్ ఆరోపించడం గమనార్హం.