భవిష్యత్ సినిమా

జనాల జీవనంతో పెనవేసుకుపోయిన కళ ఏదైనా వుందీ అంటే అది సినిమానే. వారానికి ఓసారి అయినా కొత్త సినిమా చూడకుంటే మనసు ఆగదు. చొక్కాలు తడిసినా, చిరిగినా, ఓపిగ్గా గంటలు గంటలు లైన్లో వుండాల్సి…

జనాల జీవనంతో పెనవేసుకుపోయిన కళ ఏదైనా వుందీ అంటే అది సినిమానే. వారానికి ఓసారి అయినా కొత్త సినిమా చూడకుంటే మనసు ఆగదు. చొక్కాలు తడిసినా, చిరిగినా, ఓపిగ్గా గంటలు గంటలు లైన్లో వుండాల్సి వచ్చినా, కొత్త సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తే వచ్చే కిక్కే వేరు. ఫస్ట్ వీకెండ్ ఫ్యామిలీతో కొత్త సినిమాకు వెళ్తే వచ్చే ఆనందమే వేరు. 

ఫస్ట్ షో సినిమా చూసి, బయట రెస్టారెంట్ లో ఫుడ్ తీసేసుకుని ఇంటికి వస్తే తప్ప వీకెండ్ పరిపూర్ణంగా ఎంజాయ్ చేసి ఫీలింగ్ రాదు తెలుగువాడికి. ఆ కిక్…ఆ ఆనందం..ఆ సరదా…అన్నీ కలిపే టాలీవుడ్ ను వేల కోట్ల పరిశ్రమగా మార్చేసాయి. దాన్ని నమ్ముకునే దేశీ, విదేశీ కంపెనీలు ఓటిటి ప్లాట్ ఫారమ్ ల మీద వేల కోట్లు కుమ్మరిస్తున్నాయి. 

కానీ ఇప్పుడు అదే కిక్..అదే సరదా..అదే ఆనందం డివైడ్ అయిపోతుందా? థియేటర్ కు వీడ్కోలు చెబుతుందా? వెండితెర కాస్తా టీవీ తెరగా మారిపోతుందా? అన్న గుండె గుబులు అనుమానం సినిమా జనాలను పట్టి పీడిస్తోంది. నిజానికి ఇలాంటి అనుమానం వల్ల నిర్మాతలకు పెద్దగా పోయేది లేదు. అదనపు లాభాలు రాకపోవచ్చు కానీ టేబుల్ ప్రాఫిట్ లు వుంటాయి. 

సమస్య నిర్మాతలకు కాదు టోటల్ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్ధకు. ఎక్కడో హైదరాబాద్ లో తీసే సినిమాకు, మారుమూల పల్లె థియేటర్ కు మధ్య అనుసంధానమైన వ్యవస్థ మాయమైపోతుందా? అన్న అనుమానం. నిజానికి ఈ అనుమానం రెండు మూడేళ్ల కిందటే మొగ్గ తొడిగినా, ఇదంతా మరో పది పదిహేనేళ్ల తరువాత సంగతి అని ధైర్యంగా ముందుకు వెళ్తోంది టాలీవుడ్. కానీ కరోనా పుణ్యమా అని ఆ పది పదిహేనేళ్ల కాలం కాస్తా కుదించుకుపోతోంది. పుణ్యకాలం పూర్తయిపోయి, డిజిటల్ విప్లవం ముంచుకు వస్తున్నట్లు కనిపిస్తోంది.

డిజిటల్ ప్లస్ ఇంటర్నెట్

డిజిటల్ విప్లవం వచ్చి చాలా రంగాలను తుడిచిపెట్టేసింది. ప్రపంచంలోనే కలర్ ఫిల్మ్ తయారు చేసే కొడాక్ సంస్థనే కిందా మీదా అయింది. ఒకటి, రెండు అని కాదు దాదాపు ప్రతి రంగాన్ని తాకి ప్రభావితం చేసింది. చాలా అంటే చాలా వరకు పనులు సులువు చేసేసింది. చాలా రంగాల్లో పనిని సులువు చేసినట్లే సినిమారంగాన్ని సమూలంగా మార్చేసింది. అంతవరకు బాగానే వుంది. కానీ అగ్నికి వాయువు తోడయినట్లు డిజిటల్ రంగానికి ఇంటర్నెట్ విప్లవం తోడయింది. అదిగో అక్కడ వచ్చింది ప్లస్సూ..మైనస్సూ..

ఇంటర్నెట్ అనేది వచ్చినా జనాల జీవితాన్ని కొంతమేరకే ప్రభావితం చేసింది. కానీ ఎప్పుడయితే స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ టీవీలు వచ్చాయో, మొత్తం సినేరియా మారిపోయింది. జన జీవితమే మారిపోయింది. స్మార్ట్ పోన్ లు ప్రతి చేతిలో కనిపిస్తున్నాయి. స్మార్ట్ టీవీలు ప్రతి ఇంటిలో దర్శనం ఇస్తున్నాయి. దీంతో కంటెంట్ అనేది విస్తృతంగా అవసరం పడింది. విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగు కంటెంట్ సరిపోక పరాయి భాషల్లోకి వెళ్తున్నారు. 

కంటెంట్ ఏదయినా బహుభాషల్లో అందించడం అన్నది కామన్ అయిపోయింది. ఇవ్వాళ పట్టుమని పన్నెండు వేలు ఖర్చు చేస్తే 32 అంగుళాల స్మార్ట్ టీవీ. ఆరేడు వేలు ఖర్చు చేస్తే స్మార్ట్ ఫోన్. ఇంటర్ నెట్ ను పెద్దగా లెక్క వేయడం లేదు. అది చిల్లర ఖర్చు కింద జమైపోతోంది. దాంతో సినిమా థియేటర్ రైట్స్ తో పాటే డిజిటల్ రైట్స్ అనే కొత్త తరహా ఆదాయం వచ్చి చేరింది.

పిన్ని..నాన్న పెళ్లాం

నాన్నకు రెండో పెళ్లి అవుతోందన్న సంబరమే కానీ సవతి తల్లి వస్తోందన్న ఆలోచన లేదు అన్నది సామెత. ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల వ్యవహారం అలాగే వుంది. థియేటర్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ వచ్చినా పెద్దగా థ్రెట్ కాలేదు. 

ముందు భయపడ్డారు కానీ వ్యవహారం సద్దుకుంది. థియేటర్, శాటిలైట్ హక్కుల అనే జోడు గుర్రాల మీద సినిమా ప్రయాణం సాఫీగా, జోరుగా సాగిపోతోంది. కానీ ఇప్పుడు డిజిటల్ హక్కులు కూడా వచ్చి చేరాయి. టీవీ మాదిరిగానే ఇవి కూడా పక్కన సర్దుకుపోతాయా? లేదా అరేబియా ఒక్కో కాలు పెట్టి ఆఖరికి టెంటు లేపేసినట్లు థియేటర్ హక్కులకు మంగళం పాడించేస్తాయా? అన్నది అనుమానంగా వుంది.

యూట్యూబ్-ఓటిటి

ఇంటర్నెట్ తోడుగా వచ్చిన డిజిటల్ విప్లవం యూ ట్యూబ్ ను టాప్ ప్లేయర్ ను చేసింది. యూ ట్యూబ్ తెలియని జనం ఇవ్వాళ లేరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాను కానీ మరే వినోదాన్ని కానీ జనాలకు చేర్చడంలో యూ ట్యూబ్ కు సాటి లేదు. మరొకటి వస్తుందో రాదో తెలియదు. యూ ట్యూబ్ ఆదాయం అన్నది సినిమాకు పెద్దగా హాని చేయలేదు. ఆనందాన్నే ఇచ్చింది. 

ముఖ్యంగా  హిందీ డబ్బింగ్ అనే గట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చింది, ఇవ్వాళ పెద్ద హీరోల సినిమాలకు 15 నుంచి 20 కోట్లు హిందీ డబ్బింగ్ ఆదాయం వస్తోంది అంటే కేవలం యూ ట్యూబ్ నే సగం కారణం. సిడిలు మాయం అయిపోయినా, పెద్ద సినిమాలకు రెండు నుంచి నాలుగు కోట్లు అడియో ఆదాయం వస్తోంది అంటే యూ ట్యూబ్ నే కారణం. 

అంతే కాదు మీడియాలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చిన ఛానెళ్లు కూడా ఇవ్వాళ వ్యూవర్ షిప్ కోసం యూ ట్యూబ్ మీదే ఆధారపడుతున్నాయి. టీవీ కోసం కంటెంట్ తయారు చేయడం, ఆదాయం కోసం యూ ట్యూబ్ లో వదలడం. లేదూ అంటే ఆదాయం అంతంత మాత్రం అయిపోతుంది. 

చానెళ్ల మనగడకు కీలకమైన ప్రకటనల ఆదాయం అంతంత మాత్రం అయింది. టీఆర్పీ రేటింగ్ లు అరకొరగా మారాయి. ముఖ్యంగా న్యూస్ చానెళ్లు చూసేవాళ్ల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఏదైనా కీలకమైన సంఘటన వుంటే తప్ప న్యూస్ చానెల్ కు రావడం లేదు. దాంతో ఆ కంటెంట్ అంతా తెచ్చి యూ ట్యూబ్ లో డంప్ చేసి ఆదాయం తెచ్చుకోవాల్సి వస్తోంది.

ఓటిటి వచ్చేసింది

ఇప్పుడు ఇదే భయం సినిమాకు కూడా వుంది. యూ ట్యూబ్ తరువాత వచ్చిన ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లు అయిన ఓటిటి సంస్థలు మాత్రం థియేటర్ ను వుంచుతాయా? మింగేస్తాయా? అన్న అనుమానం మాత్రం గట్టిగా పట్టి పీడిస్తోంది. 

ఆన్ డిమాండ్ సినిమా చూపించడం అనే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఏడాదికి ఓసారి ఎంత కొంత చూపించి, అపరిమితంగా సినిమాలు చూపించే ఓటిటి అనే కాన్సెప్ట్ మాత్రం చాలా విజయవంతం అయింది. అది ఒక ఆల్టర్ నేటివ్ ప్లాట్ ఫారమ్ గా మారిపోతోంది. 

టీవీ వచ్చినపుడు థియేటర్ కు ఆల్టర్ నేటివ్ అవుతుందేమో అని భయపడ్డారు కానీ అలా జరగలేదు. ఎందుకంటే థియేటర్ ఇచ్చిన తరువాత టీవీ కి అనే కాన్సెప్ట్ ను ఫాలో అయ్యారు. కానీ ఓటిటి అలా కాదు. విడుదలైన ఎన్నాళ్ల తరువాత ఓటిటిలో వచ్చేస్తుందన్న క్లారిటీ ఇప్పుడు కామన్ మాన్ కూడా వచ్చేసింది. నాలుగువారాలు ఓపిక పడితే ఇంట్లో చూసేసుకోవచ్చు అన్నది అర్థం అయపోయింది.

నేరుగా విడుదల

ఓటిటి అక్కడితో ఆగలేదు. సినిమాలు నేరుగా కొనడం ప్రారంభించింది. అమెజాన్ ప్రయిమ్ విడియోకి ఇండియాలో ఇవ్వాళ 200 మిలియన్ల సబ్ స్క్రయిబర్లు వున్నారు. దాన్ని వెయ్యితో హెచ్చవేస్తే ఏడాదికి అమెజాన్ ప్రయిమ్ ఆదాయం తెలుస్తోంది. చిల్లర శివాలక్ష్మి అన్నట్లు ఇలా వెయ్యి..వెయ్యి వంతున వచ్చే వేల కోట్లతో సినిమా రంగాన్ని అమెజాన్ శాసించబోతోంది. 

అమెజాన్ మాత్రమే కాదు. సుమారు వందకోట్లకు పైగా చందాదారులతో హాట్ స్టార్ ఆ పక్కనే వుంది. ఇక నెట్ ఫ్లిక్స్ సంగతి సరేసరి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటే, ఇంకా చందాదారులను పెంచుకోవాలని, వచ్చినవారిని నిలబెట్టుకోవాలని కంటెంట్ కోసం తహతహలాడుతున్నాయి ఓటిటి ప్లాట్ ఫారమ్ లు.

చిన్న సినిమాకు నో

రంగంలోకి దిగిన కొత్తలో చకచకా ఏ సినిమాలు పడితే ఆ సినిమాలను కొనేసినా, రాను రాను ప్రేక్షకుల అభిరుచి, ఇతరత్రా వ్యవహారాలను ఈ ఓటిటి ప్లాట్ ఫారమ్ లు కూడా ఔపాసన పట్టేసాయి. ఫ్లాపయినా, హిట్ అయినా, రేటింగ్ లు వచ్చినా రాకున్నా జనాలకు భారీ సినిమాలే కావాలి. పెద్ద సినిమాలే కావాలి. టాప్ హీరోలే కావాలి అన్న సూత్రం వాటికీ తెలిసిపోయింది. 

మెలమెల్లగా చిన్న సినిమాలను గీసి గీసి బేరాలాడుతున్నాయి. ఎక్కడో ఒకటి రెండు సినిమాలు మొహమాటాలు, సర్కిళ్లు వాడి గట్టెక్కుతున్నాయి తప్ప, చిన్న సినిమాలకు ఓటిటిలు రేట్లు కట్టడంలో గీసి గీసి బేరాలు ఆడుతున్నాయి. 

శాటిలైట్, డిజిటల్ కు కలిపి ఎంత వస్తుందో దాని మీద మహా అయితే ఓ కోటి రూపాయలు ఇస్తాం అంటున్నాయి నేరుగా ఇచ్చేస్తే. అంటే థియేటర్ హక్కులను కోటి రూపాయల కింద కడుతున్నాయన్నమాట. అవే ఓటిటి ప్లాట్ ఫారమ్ లు పెద్ద సినిమాల దగ్గరకు వస్తే ఎంత బడ్జెట్ అయింది తెలుసుకుని, ఇరవై శాతం యాడ్ చేసి రేటు కడుతున్నాయి.

టెన్షన్ ఫ్రీ

ఓటిటి కి విక్రయిస్తే చాలా విషయాల్లో టెన్షన్ ఫ్రీగా వుంటుంది. జనాలు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మార్నింగ్ షో ముగిసే వరకు వుంటుంది. సినిమా ప్రచారానికి దాని లెవెల్ ను బట్టి కోటి నుంచి అయిదారు కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వుంటుంది. సినిమా విడుదలయిన తరువాత కూడా ప్రచార భారాన్ని మోయాల్సి వుంటుంది. 

అన్నింటికి మించి డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు పూర్తిగా కట్టే వరకు టెన్షన్. చివరి నిమషంలో తగ్గించి కట్టడం అన్నది చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు అలవాటైన వ్యవహారం. నిర్మాత లాస్ట్ మినిట్ లో ఎక్కడికి వెళ్తాడనే ధీమా. ఎగ్జిబిటర్ల డబ్బులు డిస్ట్రిబ్యూటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ డబ్బు నిర్మాత దగ్గర చిక్కుకోవడం లేదా రివర్స్ లో కూడా చిక్కుకుపోవడం అన్నది మరో టెన్షన్.

సినిమా హిట్ అయితే ఓవర్ ఫ్లోస్ వస్తాయి అన్నది పాజిటివ్ పాయింట్. కానీ చాలా మంది నిర్మాతలకు ఓవర్ ఫ్లోస్ చేరవు. పెద్ద నిర్మాతలకు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు బుద్దిగా ఓవర్ ఫ్లోస్ కడతారు. ఎందుకంటే మళ్లీ మళ్లీ సినిమాల ఇవ్వాలి కాబట్టి. 

కొత్త, చిన్న నిర్మాతలకు ఓవర్ ఫ్లోస్ విషయంలో ఎగనామం పెట్టేవారే ఎక్కువ. ఈ సమస్యలు అన్నీ ఓటిటి లో కనిపించవు. నిర్మాతలకు ఓటిటి ఆదాయం అన్నది అదనపు ఆదాయంగా మారింది. అక్కడ సమస్యేమీ రాలేదు. కానీ నేరుగా ఓటిటికి ఇవ్వడం దగ్గరే సమస్య వచ్చింది.

థియేటర్ భవిష్యత్

లాక్ డౌన్ అనే కొత్త పదం జనాలకు పరిచయం అయ్యే వరకు థియేటర్ భవిష్యత్ ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించలేదు. ఓటిటిని అదనపు ఆదాయంగానే చూసారు. ధియేటర్ ఆదాయానికి కొంచెం గండి కొడుతోంది అనిపించింది తప్ప థియేటర్ కు ఆల్టర్ నేటివ్ అవుతుంది అని అనుకోలేదు. కానీ లాక్ డౌన్ లో సినిమాలను నేరుగా ఓటిటికి ఇవ్వడం అనేది ప్రారంభం అయినపుడు భయం స్టార్ట్ అయింది. కరోనా రెండో దశ వచ్చాక ఈ భయం మరింత పెరగడం మొదలయింది.

ఇదే సమయంలో ఆంధ్రలో థియేటర్ల టికెట్ ల సమస్య వచ్చింది. అటు మల్ట్ ఫ్లెక్స్ ల అట్రాక్షన్ పెరగడం అదే టైమ్ లో టికెట్ రేట్లు తగ్గిపోవడంతో థియేటర్ యజమానులు ఆలోచనలో పడుతున్నారు. లీజు మొత్తాలు సవరించాల్సిన పరిస్థితి వుంటుంది. అలా సవరిస్తే థియేటర్ల నిర్వహణ కష్టం అవుతుంది. దాదాపు యాభై శాతం థియేటర్లు ఏ ఊరు అయినా మాంచి కమర్షియల్ వాల్యూ వున్నవే. కమర్షియల్ కాంప్లెక్స్ లు గా మారడానికి క్వాలిఫై అయ్యేవే. అదే సమయంలో టికెట్ రేట్లు పెంచకపోతే థియేటర్ విడుదల అన్నది ప్రశ్నార్ధకం అవుతుంది.

ఆల్టర్ నేటివ్

ఇలాంటి సమయంలో భారీ, పెద్ద సినిమాలకు ఓటిటి ఆఫర్లు ఆల్టర్ నేటివ్ గా కనిపిస్తున్నాయి. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలు ఓటిటికి వెళ్లిపోయి సేఫ్ అయ్యాయి. నారప్ప, దశ్యం2 సినిమాలు ఓటిటికి వెళ్లాయి అంటే ఆలోచించాల్సిందే. సబ్ స్క్రిప్షన్లు పెరగడాలంటే ఒరిజినల్ కంటెంట్ కోసం ఓటిటి ఫ్లాట్ ఫారమ్ లు చూస్తున్నాయి. 

అందుకోసం పెద్ద మొత్తాలు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. దీనివల్ల జరుగుతున్న పరిణామం ఏమిటంటే జనాలు థియేటర్ ను కొంచెం కొంచెంగా మరచిపోవడం అన్నది. ఇప్పటికే నెల రోజుల తరువాత వచ్చే చిన్న, మీడియం సినిమాలను ఓటిటి ల్లో చూడడం అన్నది మెలమెల్లగా జనాలకు అలవాటు అవుతోంది. ఫ్యామిలీలు కొంచెం కొంచెంగా థియేటర్లకు దూరం కావడం అన్నది కొద్దికొద్దిగా ప్రారంభం అవుతోంది. మొలక స్టేజ్ లో వున్నది ఇది మహా వృక్షంగా మారడానికి ఇంక ఎంత కాలం పడుతుందన్నది చూడాలి.

కరోనా లాంటి లాక్ డౌన్ సమస్యలు కనుక విరివిగా వస్తుంటే ఇంక థియేటర్ ను మరచిపోవడం అన్నది ఎక్కువ అవుతుంది. థియేటర్ లోనే చూడాలి. థియేటర్ లో చూసే సినిమాలు. థియేటర్ అంటే ఇష్టపడే జనాలు. ఇలాంటి పర్సంటేజ్ థియేటర్ల నిర్వహణకు సరిపోదు. 150 సినిమాలూ థియేటర్ లోకే రావాలి. ఏడాదికి డజను సూపర్ హిట్ లు పడాలి. అప్పుడే థియేటర్ కళకళ లాడుతుంది. కానీ ఓటిటి ప్లాట్ ఫారమ్ ల జోరు చూస్తుంటే క్రీమీ లేయర్ ను లాగేసి, పిప్పిని థియేటర్లకు మిగిల్చేలా వుంది వ్యవహారం.

థియేటర్ల ఆశ

అసలు థియేటర్లను ఈ పరిస్థితి తీసుకవచ్చింది కూడా థియేటర్ల ఆశనే. భారీ క్యాంటీన్ రేట్లు, మంచి నీళ్లు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి, తొలివారంలో విచ్చలవిడిగా రేట్లు, ఇవన్నీ కలిసి థియేటర్ అంటే చాలా మందికి భయం వేసేలా చేసేసాయి. మహిళలు టీవీలో వస్తుందిలే, ఓటిటిలో వస్తుందిలే అని వెనక్కు లాగేలా, వెనక్కు తగ్గేలా చేసాయి థియేటర్లే. 

కేవలం వందలకు వందల రేట్లు తెచ్చి, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కలిసి హీరోల జేబులు నింపడం ప్రారంభించారు. అది కాస్త ప్రేక్షకుల జేబులు ఖాళీ చేస్తోంది. ఇలాంటి వ్యవహారం చూసి ఏకంగా మొదటికే మోసం వచ్చేటట్లు ఆంధ్ర ప్రభుత్వం కొత్త రేట్లు డిసైడ్ చేసింది. అది చూసి ఇండస్ట్రీ ఇప్పుడు బావురు మంటోంది.

జగన్ ప్రభుత్వం మరోరెండున్నరేళ్లు అధికారంలో వుంటుంది. ఆ తరువాత మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ లోగా రేట్లు పెంచకూడదని జగన్ కనుక గట్టిగా డిసైడ్ అయితే థియేటర్ భవిష్యత్ అగమ్య గోచరం అవుతుంది. దాంతో సినిమా భవిష్యత్ కొత్త పుంతలు తొక్కుతుంది. కచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఓటిటి ప్లాట్ ఫారమ్ లు వదులుకోవు. అందుకోసం అవి చేసే ప్రయత్నం థియేటర్లను మరింత వెనక్కు నెట్టే ప్రమాదం వుంది.

ప్రస్తుతానికి అయితే ఓటిటి ని అదనపు ఆదాయంగా చూడడానికే నిర్మాతలు ఇష్టపడుతున్నారు. థియేటర్ నుంచి వచ్చే ఆదాయం వారిని ఇంకా ఊరిస్తూనే వుంది. కానీ గత్యంతరం లేకపోతే ఆల్టర్ నేటివ్ సోర్స్ గా ఒటిటి ఓ భరోసాగా కనిపిస్తోంది. ఆ భరోసా అలా పక్కన వున్నంత కాలం థియేటర్లు భయం భయంగా బతకాల్సిందే. జాగ్రత్త పడాల్సిందే. లేదూ అంటే పదేళ్ల తరువాతయినా ఇంట్లోకి పూర్తిగా వచ్చేసే సినిమా, ఇప్పుడే వచ్చేసే అవకాశం వుంది.

విఎస్ఎన్ మూర్తి