రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా మారింది. ఇప్పుడు రాయలసీమలో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. తక్కువ నీటి వనరుల్లోనే తోటలను సాగు చేసుకోవచ్చనే భావనతో రైతాంగం పూర్తిగా పళ్ల తోటల వైపు మొగ్గుతూ ఉంది. అలాగే నీటి వనరులు మెరుగ్గా ఉన్న రైతులు కూడా అటు వైపే చూస్తున్నారు.
నీటి వనరులు బాగున్న వాళ్లు చీనీ, అరటి, దానిమ్మా, నల్లనేరేడు, ద్రాక్ష వంటి తోటల వైపు మొగ్గుతుండగా, పరిమిత స్థాయిలో నీటి వనరులున్న వారు మామిడి, జామ, సపోటా వంటి వాటి వైపు మొగ్గుతున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఎటు చూసినా ఇలాంటి తోటలే వివిధ దశల్లో కనిపిస్తూ ఉంటాయి. గత దశాబ్దకాలంగా ఈ తీరు బాగా పెరిగింది.
ఈ మార్పుకు బీజం వేసింది ఉపాధి హామీ పథకమే. రాయలసీమ జిల్లాల్లో కొన్ని రకాల పండ్ల తోటలకు అనుకూలం అని ఎప్పుడో రైతులు, ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే తగిన ప్రోత్సాహం లేక సాగు తక్కువగా సాగింది. చాలా యేళ్ల కిందటే రాయలసీమలో విపరీతంగా చీనీ తోటలుండేవి. అలాగే చిత్తూరు జిల్లా మామిడికి ముందు నుంచి కేరాఫ్ గా ఉంది.
అనంతపురం, కడప జిల్లాల్లో చీనీ తోటలు విపరీతంగా ఉండేవి. అయితే నీటి వనరులు తగ్గిపోవడంతో చీనీ చెట్లను రైతులే తొలగించారు. అప్పట్లో నీళ్లను కట్టే పద్దతి ఉండేది. అయితే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చాకా మళ్లీ చీనీ వైపు రైతులు మొగ్గారు. తక్కువ నీటి వనరులతోనే చెట్లను కాపాడుకునే పద్ధతి కావడంతో చీనీ సాగు మళ్లీ ఊపందుకుంది.
ఇక ఇదే సమయంలో ఉపాధి హామీ పథకాన్ని పండ్ల తోట సాగుకు అనుసంధానం చేశారు. చాలా రకాల పండ్ల తోటలకు తొలి రెండు మూడేళ్లు నీటి వనరు చాలా ముఖ్యం. ఆ మూడేళ్లూ సొంత తోటకు నీళ్లను అందించి కాపాడుకున్నా.. ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు డబ్బులిస్తారు. దీంతో మామిడి వంటి పంటల సాగు విపరీతంగా పెరిగింది.
వ్యవసాయానికి అంత యోగ్యం కాని భూముల్లోనూ, నీటి వనరులు అంతగాలేని భూముల్లోనూ రైతులు మామిడి సాగు చేయడం మొదలైంది. 2007-08 నుంచి మామిడి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఇంకా అది పెరుగుతూనే ఉంది!
ఇతర వ్యవసాయ పంటలకు పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, మార్కెట్ రేటు రైతు చేతిలో లేకపోవడం కూడా పండ్ల తోటల వైపు మొగ్గు చూపడటానికి మరో కారణం. పండ్ల తోటలకు పెట్టుబడులు తక్కువ. చిన్నా, సన్నకారు రైతులు పండ్ల తోటలను పెంచితే ఉపాధి హామీ పథకం నుంచి లబ్ధి ఎంతో కొంత ఊతంగా ఉపయోగపడుతుంది. ఇక కొద్ది మేర కురిసిన వర్షాలతో చాలా చోట్ల భూగర్భ జలలా లభ్యత గత రెండేళ్లలో బాగా పెరిగింది. దీంతో పండ్ల తోటలను సాగు చేసుకోవడానికి ఇదే అదునుగా మారింది.
మరోవైపు ఉత్పత్తిలో కూడా అప్పుడే రికార్డులు నమోదవుతున్నాయి. కడప జిల్లా అరటి ఉత్తత్తిలో అదరగొడుతూ ఉంది. నాణ్యమైన, రుచికరమైన అరటి అక్కడ పండుతోంది. కడప జిల్లాలో పండే అరటికి అరబ్ దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎగుమతులే రైతులకు న్యాయం చేయగలవు. ఈ ఏడాది చీనీ రైతులు కొందరు లక్షాధికారులయ్యారు. దిగుబడి తక్కువే అయినా, డిమాండ్- రేటుతో చీనీ రైతులకు చేతి నిండా ఆదాయం లభించింది.
అయితే అధికంగా ఉత్పత్తి అయిన మామిడి మాత్రం ఈ సారి రైతులకు ఆశించిన స్థాయిలో ఊరటను ఇవ్వలేదు. మామిడి విస్తీర్ణం చాలా పెరిగింది. దాని ఫలితం రోడ్ల మీద బండ్లలో కనిపిస్తున్న మామిడి కాయలను చూస్తేనే అర్థం అవుతోంది. గత ఏడాది వర్షాలు కూడా బాగా పడటంతో ఈ సారి మామిడి బ్రహ్మాండమైన దిగుబడి కూడా వచ్చింది. విస్తీర్ణం పెరగడం, దిగుబడి పెరగడంతో మార్కెట్లోకి కాయలు టన్నుల కొద్దీ అదనంగా వచ్చి పడ్డాయి. దీంతో రేటు తగ్గిపోయింది.
ఇదే సమయంలో కరోనా తో లాక్ డౌన్లు, ఎగుమతులు తగ్గిపోవడం కూడా రైతులను దెబ్బతీసింది. ఉన్న రేటుతో మధ్యవర్తులు, దళారులు, బండ్ల మీద అమ్ముకునే వాళ్లు బాగుపడవచ్చేమో కానీ, రైతులకు దక్కేది తక్కువగానే ఉంది.అంతే కాదు.. రానున్న రోజుల్లో మామిడి విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది, ఉత్పత్తి రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదు. ఎగుమతులు మరింత పెరిగితే తప్ప.. మామిడి రైతులకు న్యాయం చేసే అవకాశాలు తక్కువే. ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
రేటు సంగతలా ఉంటే.. హార్టికల్చర్ విస్తృతంగా సాగవుతుండటం వల్ల.. పర్యావరణానికి కూడా మేలు జరిగే అవకాశం ఉంది. పచ్చదనం పెరుగుతుంది. బీడుభూములన్నీ తోటలుగా మారితే అంతకన్నా కావాల్సింది ఏముంది!