సీమలో తమ్ముళ్ల ఇసుక దోపిడీ.. మామూలుగా కాదు!

పచ్చని పల్లెల్లో ఇసుక కొరత అనేమాట వినిపిస్తుందని బహుశా పదేళ్ల కిందట కూడా ఎవ్వరూ ఊహించలేదు. అప్పటివరకూ లెక్క వేయలేనంత స్థాయిలో ఇసుక అందుబాటులో ఉండేది. రాయలసీమలో ప్రతి పల్లె సమీపంలోనూ ఏదో ఒక…

పచ్చని పల్లెల్లో ఇసుక కొరత అనేమాట వినిపిస్తుందని బహుశా పదేళ్ల కిందట కూడా ఎవ్వరూ ఊహించలేదు. అప్పటివరకూ లెక్క వేయలేనంత స్థాయిలో ఇసుక అందుబాటులో ఉండేది. రాయలసీమలో ప్రతి పల్లె సమీపంలోనూ ఏదో ఒక వంకో, వాగో ఉంటుంది. వర్షాకాలంలో కొన్నిరోజులు అయినా వాటి వెంట నీళ్లు పారడం.. ఆ సమయంలో పారే నీళ్లు భారీఎత్తున ఇసుకను తెచ్చి పెట్టడం జరిగేది. ఆ ఇసుకను పల్లె జనాలు ఏ ఇల్లు కట్టేటప్పుడో, లేక పశువుల పాకల్లో కింద వేయడానికో, చేనుకు వేయడానికో తోలుకునే వాళ్లు. ఎద్దులూ-బండి అందుబాటులో ఉంటే.. ఖాళీ సమయాల్లో వంకకు వెళ్లి ఇసుక తోడుకురావడం జరిగేది. అలా రైతులు ఎంత ఇసుకను బళ్లలో తోలినా.. వంకల్లో ఇసుక తరిగేది కాదు!

ఒక యేడాదిలో తరిగే ఇసుక అంతా ఒక్కసారి వంక పారిందంటే భర్తీ అయ్యేది. ఇదంతా ఎప్పటి కథో కాదు. కేవలం పదేళ్ల కిందటి కథ. రెండువేల పది పన్నెండు వరకూ రాయలసీమలోని చాలా వాగులూ, వంకలు అలా ఇసుకతో కళకళలాడేవి. వాగుల గట్ల మీద పెరిగే చెట్లతో పచ్చదనం ఆవరించి ఉండేది. అయితే గత ఏడెనిమిదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకా ఇసుకను ఒక వ్యాపార వస్తువుగా మార్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుకను ట్రాక్టర్లకు ఎక్కించారు. అమ్మడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి కథ పూర్తిగా మారిపోయింది.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇసుక గురించి గాంధీ మహాత్ముల్లా మాట్లాడుతూ ఉన్న తీరును గమనించి ప్రజలు నవ్వుకుంటున్నారు. స్థానికంగా ప్రజలకు అన్ని విషయాల మీదా స్పష్టమైన అవగాహనే ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు సామాన్య ప్రజలు. గత ఐదేళ్లలో పలుసార్లు కొంతమంది కాంగ్రెస్‌ నేతలు బాహాటంగా కొన్ని ప్రకటనలు చేశారు. 'మా హయాంలో అవినీతి జరిగి ఉండొచ్చు. అయితే ఇసుక నుంచి కూడా సంపాదించుకోవచ్చని మాకు తెలీదు.

ఇసుకను దోపిడీ చేసి, కోట్ల రూపాయలు చేసుకోవచ్చని నిరూపించిన ఘనత తెలుగుదేశం పార్టీ నేతలదే..' అంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాయలసీమ ప్రాంతంలోని బడా రాజకీయ నేతలంతా ఇసుక వ్యాపారం చేశారు. తెలుగుదేశం చోటామోటా కార్యకర్తలు ట్రాక్టర్లతో ఇసుకను తరలించి స్థానికంగా అమ్ముకున్నారు. బయటివాళ్లు ఎవరైనా అలాంటి వ్యాపారం చేస్తే వారిని పోలీసులు అడ్డుకుంటారు. ఇసుకను తోలే ట్రాక్టర్లను సీజ్‌ చేస్తారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రం పోలీసుల నుంచి లైసెన్స్‌ ఉండేది.

ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల దందా మరింత ప్రత్యేకం. అనంతపురం వంటి జిల్లా నుంచి భారీఎత్తున బెంగళూరుకు ఇసుకను తరలించే ప్రక్రియ ఒకటి రెండు మూడేళ్లపాటు నిరంతరాయం సాగింది. ఒక్కో లారీ ఇసుక వెల అప్పట్లో యాభై వేల రూపాయల నుంచి అవసరాన్ని బట్టి లక్ష కూడా పలికింది! ఇలా రోజుకు పదుల సంఖ్యలో లారీలను పెట్టి ఇసుకను బెంగళూరుకు తోలిన తెలుగుదేశం నేతలున్నాయి. అలా రోజుకు కొన్ని లక్షల రూపాయలను సంపాదించారు.

రైతులు ఎద్దుల బళ్లలో ఇసుకను తోలుకుంటున్నప్పుడు ఎంతకూ ఇసుక తరిగేదికాదు. ఎప్పుడైతే లారీలు, ట్రక్కులు ఇసుక కోసం వంకల్లోకి దిగాయో.. అప్పటి నుంచినే వాగులకు అసలు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే వంకలు ఖాళీ అయ్యాయి. పదుల కిలోమీటర్ల పరిధిలో వంకలను ఖాళీ చేస్తూ వచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో జరిగిన వ్యవహారం అది. అడిగేనాథుడు లేడు. వాగుళ్లో గుండ్లు తేలాయి. ఇసుక మాయం అయ్యింది. భారీ వర్షాలు రాలేదు. ప్రవాహంలో ఇసుక రాలేదు. దీంతో వాగులు పూర్తిగా కళను కోల్పోయాయి.

తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాదికి ముందే.. చాలావరకూ వంకలు ఖాళీ అయ్యాయి. అలా ప్రకృతిని అత్యంత దారుణంగా దెబ్బతీసిన పాలన సాగింది. ఇదంతా ప్రజల సాక్షిగా జరిగిన దారుణం. కావాలంటే అనంతపురం జిల్లాల్లోని వంకలనూ వాగులనూ వెళ్లి చేస్తూ, అక్కడ జరిగిన విచ్చిన్నం గురించి సామాన్యులను అడిగితే వాళ్లే చెబుతారు.

ఇదంత దమనకాండను సాగించిన వాళ్లు ఇప్పుడు రామప్పంతుల్లలా ఇసుక విషయంలో ఆందోళనలు చేస్తూ ఉండటం, అపారమైన సానుభూతులను వ్యక్తంచేస్తూ ఉండటాన్ని చూసి జనాలు కూడా  తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. దోపిడీ చేసినంత కాలం వీళ్లు ప్రకృతి అందించిన సంపదను దోచుకుని.. ఇప్పుడు నీతులు వల్లెవేస్తున్న వైనంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్