జ‌గ‌న్ నివాసానికి నిర‌స‌న సెగ

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నివాసానికి నిరుద్యోగుల నిర‌స‌న సెగ త‌గిలింది. 10 వేల ఉద్యోగాల‌తో విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌పై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 2 లక్ష‌ల‌కు పైగా ఉద్యోగ ఖాళీలుండ‌గా, కంటితుడుపు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నివాసానికి నిరుద్యోగుల నిర‌స‌న సెగ త‌గిలింది. 10 వేల ఉద్యోగాల‌తో విడుద‌ల చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌పై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 2 లక్ష‌ల‌కు పైగా ఉద్యోగ ఖాళీలుండ‌గా, కంటితుడుపు చ‌ర్య‌గా 10 వేల ఉద్యోగాల‌కే నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం ఏంటంటూ నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వివిధ విద్యార్థి సంఘాలు సోమ‌వారం 'చలో తాడేపల్లి' సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. 

విద్యార్థి సంఘాల నాయ‌కుల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ అరెస్ట్ చేశారు. కొన్ని సంఘాల నాయకులు త‌ప్పించుకుని తాడేప‌ల్లి ప్ర‌ధాన ర‌హ‌దారి వ‌ద్ద‌కు చేరుకున్నారు. అనంత‌రం సీఎం ఇంటి ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు.

సీఎం జ‌గ‌న్ డౌన్‌.. డౌన్‌.. అంటూ నినాదించారు. తాడేపల్లి పాత టోల్‌గేట్‌ కూడలి వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేత‌లు, పోలీసుల మ‌ధ్య తీవ్ర తోపులాట జ‌రిగింది. 

సీఎం ఇంటిని ముట్ట‌డించ‌కుండా విద్యార్థులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అనంత‌రం విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులను మోహరించ‌డం గ‌మ‌నార్హం.