మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు పులివెందుల్లో వివేకా ఇంటి సమీపంలోని వంకలో గత మూడు రోజులుగా సీబీఐ అధికారులు మారణాయుధాల కోసం గాలిస్తున్న సంగతి తెలిసిందే.
సునీల్‌ను వెంటబెట్టుకుని వెతుకుతున్నప్పటికీ ఎలాంటి ఆయుధాలు చిక్కలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో కీలక అనుమానితులు సునీల్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరి కుటుంబ సభ్యుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో కత్తి, కొడవలి, పలుగు, పార తదితర వ్యవసాయ పనిముట్లను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అలాగే బ్యాంకు అకౌంట్లను కూడా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా సన్నిహితులైన పాలవ్యాపారి ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో జగన్ సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించారు. వివేకా మృతి విషయం తెలియగానే పట్టణంలోనే ఉన్న డాక్టర్ అభిషేక్ రెడ్డి వెళ్లి నాడిని పరీక్షించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్టు ఆయన నిర్ధారించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.
తమ ఇంట్లో సీబీఐ సోదాల అనంతరం సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. తాము చాలా సాధారణ వ్యక్తులమన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేటంత వాళ్లం కాదని మరోసారి స్పష్టం చేశాడు. సోదా పేరుతో ఇళ్లంతా చిందరవందర చేశారన్నాడు.
సునీల్ యాదవ్ బ్యాంకు బుక్కులు, ఓ పాత చొక్క తీసుకెళ్లారని చెప్పుకొచ్చాడు. సీబీఐ వేధింపులు తట్టుకోలేకే రిట్ పిటిషన్ వేశామన్నాడు. రిట్ పిటిషన్ వేసినందుకు వేధిస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశాడు.
తాము గోవాలో ఉంటే ఫోన్ ఐడితో పట్టుకున్న వాళ్లు …రెండేళ్లైనా వివేకా హత్య కేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని అతను కీలక ప్రశ్న వేశాడు. సింహాన్ని సింహమే చంపుతుంది కానీ. చిట్టెలుకలు చంపలేవని సునీల్ యాదవ్ చెప్పడం గమనార్హం.