ఏకాంత వాసం శిక్ష కాదు…ర‌క్ష‌!

“ఏకాంత వాసం శిక్ష కాదు…ర‌క్ష‌. అన్నిటికంటే విలువైన‌ది ప్రాణం. దాన్ని కాపాడుకుందాం” అంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి భావోద్వేగ సందేశాన్ని తిరుప‌తి ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి రంకెలేస్తూ దూసుకొస్తున్న ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిల్లో…

“ఏకాంత వాసం శిక్ష కాదు…ర‌క్ష‌. అన్నిటికంటే విలువైన‌ది ప్రాణం. దాన్ని కాపాడుకుందాం” అంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి భావోద్వేగ సందేశాన్ని తిరుప‌తి ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి రంకెలేస్తూ దూసుకొస్తున్న ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిల్లో ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తం కావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆడియోను ఆయ‌న విడుద‌ల చేశారు.

ప‌లు సోష‌ల్ మీడియా గ్రూపుల్లో వైర‌ల్ అవుతున్న ఆ ఆడియో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. తిరుప‌తి ఎమ్మెల్యే భావోద్వేగ అప్పీల్ ఆలోచింప‌జేసేలా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పిన మంచి మాట‌లు అంద‌రికీ ప్ర‌యోజ‌కారిగా ఉన్నాయి. ఆ ఆడియోలో ఏమున్న‌దంటే…

“ఈ ఆధ్యాత్మిక న‌గ‌రంలోని అంద‌రి క్షేమం కోసం విన్న‌వించుకుంటున్నా. వెళ్లి పోయింద‌ని అనుకున్న క‌రోనా కాల‌నాగులా మ‌ళ్లీ ప‌డ‌గ విప్పింది. అంద‌ర్నీ కాటేయాల‌ని బుస‌లు కొడుతోంది. క‌రోనా నుండి కాపాడుకోవాల్సింది ఎవ‌రో కాదు. మ‌న‌కు మ‌న‌మే. ప్ర‌భుత్వం ఎంత చేసినా ప్ర‌జ‌ల స‌హ‌కారం లేనిదే ఏదీ సాధ్యం కాదు. అందుకే ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. మాస్క్ త‌ప్ప‌నిసరిగా ధ‌రించండి. శానిటైజ‌ర్ వాడండి. అత్య‌వ‌స‌ర‌మైన ప‌ని ఉంటే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాకండి.

భౌతికదూరం పాటించండి. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే మ‌న ప‌ట్ట‌ణంలో దుకాణాల‌ను తెర‌చి ఉంచుదాం. అత్యంత విలువైన‌ది ప్రాణం. దానిని కాపాడుకోవ‌డం అన్నింటికంటే ముఖ్యం. నిబంధ‌న‌ల‌ను పాటిద్దాం. మ‌న‌కు మ‌న‌మే లాక్‌డౌన్ విధించుకుందాం. పిచ్చాపాటి మాట్లాడుతూ బ‌య‌ట తిరిగే స‌మ‌యం కాదిది. ఏకాంత వాసం ఏమాత్రం శిక్ష కాదు. మ‌నంద‌రికి ర‌క్ష అని చాటి చెబుదాం. వైర‌స్‌కు ఎదురు నిలుద్దాం. క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డ‌దాం. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకుందాం”

ఇటీవ‌ల తిరుప‌తి కౌన్సిల్ స‌మావేశంలో న‌గ‌రంలో ఉద‌యం ఏడు గంట‌ల నుంచి సాయంత్రం ఏడు గంట‌ల వ‌ర‌కు దుకాణాలు తెర‌వాల‌ని తీర్మానించారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఉద‌యం ఏడు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే తెరిచి ఉంచుదామ‌ని భూమ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

అలాగే క‌రోనాను కాల‌నాగుతో పోల్చారు. కాల‌నాగు మ‌ళ్లీ ప‌డ‌గ విప్పి అంద‌ర్నీ కాటేయాల‌ని బుస‌లు కొడుతోంద‌నే ఆవేద‌న చూడొచ్చు. మ‌న‌కు మ‌న‌మే లాక్‌డౌన్ విధించుకుందామ‌ని పిలుపు ఇవ్వ‌డం ద్వారా క‌రోనా క‌ట్ట‌డిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.