అనుమానమే పెనుభూత‌మై…

క‌డ‌ప జిల్లా  ప్రొద్దుటూరులో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి పెద్ద కుమారుడే త‌ల్లితో పాటు చెల్లి, త‌మ్ముడిని కొట్టి చంపాడు. అనంత‌రం ఇంటికి స‌మీపంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. ఈ హృద‌య విదార‌క…

క‌డ‌ప జిల్లా  ప్రొద్దుటూరులో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి పెద్ద కుమారుడే త‌ల్లితో పాటు చెల్లి, త‌మ్ముడిని కొట్టి చంపాడు. అనంత‌రం ఇంటికి స‌మీపంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. ఈ హృద‌య విదార‌క సంఘ‌టన గురించి స్థానికులు, పోలీసుల క‌థ‌నం మేర‌కు వివ‌రాలిలా ఉన్నాయి.

ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలో ఒన్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు స‌మీపంలోని హైద‌ర్‌ఖాన్ వీధిలో క‌రీముల్లా త‌న త‌ల్లి గుల్జార్‌బేగం, తండ్రి, త‌మ్ముడు మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీ, భార్య‌తో క‌లిసి ఉండేవాడు. చెల్లి క‌రీమున్నీసాకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇటీవ‌ల ఆమె గ‌ర్భందాల్చ‌డంతో అమ్మ‌గారింటికి వ‌చ్చింది. భార్య‌పై క‌రీముల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

కొంత కాలంగా క‌రీముల్లా త‌న భార్య‌తో క‌లిసి వేరుగా ఉంటున్నాడు. త‌న‌పై అనుమానం క‌లిగేలా కుటుంబ స‌భ్యులు చేత‌బ‌డి చేశారేమోన‌నే అనుమానాన్ని భ‌ర్త క‌రీముల్లా మ‌న‌సులో భార్య క‌లిగించింది. దీంతో త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌పై క‌రీముల్లా అక్క‌సు పెంచుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ల‌డంతో క‌రీముల్లా త‌ల్లిదండ్రుల ఇంటికి వ‌చ్చి రాత్రి పొద్దు పోయే వ‌ర‌కూ గొడ‌వ ప‌డుతూనే ఉన్నాడు.

అనంత‌రం అదే ఇంట్లోనే ఉన్నాడు. తెల్ల‌వారుజామున క‌రీముల్లా తండ్రి షాపున‌కు వెళ్లాడు. నిద్రిస్తున్న త‌ల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలపై రోకలి బండతో క‌రీముల్లా దాడికి తెగ‌బ‌డ్డాడు. త‌ల్లి, త‌మ్ముడు, గ‌ర్భ‌వ‌తి అయిన చెల్లి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందార‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత , ఇంటికి స‌మీపంలోని వ‌న్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు.

తెల్ల‌వారుజామునే ఇంటి నుంచి తండ్రి వెళ్లిపోవ‌డంతో మృత్యువు నుంచి త‌ప్పించుకున్నాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. అనుమాన‌మే అత‌న్ని సైకోగా త‌యారు చేసిందని స్థానికులు చెబుతున్నారు. త‌ల్లి, త‌మ్ముడు, చెల్లిని చంప‌డానికి మ‌న‌సెలా వ‌చ్చింద‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.