అమరావతి కోసం ప్రజలు రోడ్లెక్కండి, పోరాటాలు చేయండి, మీ వెనక మేమున్నాం అంటూ చెబుతున్న చంద్రబాబు కరోనాకి బలికావొద్దు, నాలాగా ఇంటి పట్టున ఉండండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. కరోనా రక్షణ చర్యలు తీసుకోండి, కేసులు పెరిగిపోతున్నాయి, అధికారుల్ని పరుగులు పెట్టించండి, మృతదేహాలను ఎవరూ పట్టించుకోవడంలేదు అని పోరు పెడుతున్న బాబు.. కనీసం ప్రతిపక్ష నేతగా ఉండి ఏం చేస్తున్నట్టు. నిట్టనిలువునా స్వార్థం నింపుకున్నాడు కాబట్టే.. తాను గాజు గదిలో కూర్చున్నారు. అమరావతి కోసం ప్రజలు రోడ్డెక్కాలని, ప్రజలకు కరోనా వస్తే అధికారులు పరిగెత్తాలని సూచిస్తూ కాలం గడుపుతున్నారు.
హైదరాబాద్ లో తన ఇంటికి ఎవర్నీ రానివ్వడంలేదు బాబు. తను కూడా అడుగు బయటపెట్టలేదు. జూమ్ లో మాత్రమే ఆయన బాహ్య ప్రపంచానికి కనపడుతున్నారు. 70ఏళ్ల వయసున్న చంద్రబాబు తన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇంట్లో పనివారందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. సెక్యూరిటీ సహా.. ఇతర సిబ్బంది ఎప్పుడు గ్లౌజులు వేసుకుని ఉండాలి, ముఖానికి మాస్క్ వేసుకోవాల్సిందే. పొరపాటున ఎవరు నియమం తప్పినా చంద్రబాబు ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది.
ఆగస్ట్ 15 జెండా వందనం రోజున కూడా చంద్రబాబు సిబ్బంది చేతులకు, కాళ్లకు కూడా తొడుగులు వేసుకుని కనిపించారు. ఒక విధంగా ఈ ముందు జాగ్రత్తలు మంచివే కానీ.. అదే సమయంలో రాష్ట్రంలో సమస్యలపై ఆయన స్పందించడం పూర్తి హాస్యాస్పదంగా ఉంది.
తన ప్రాణాలను కాపాడుకోడానికి రాష్ట్రం వదిలి పారిపోయిన చంద్రబాబుకి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించే అర్హత ఎక్కడిది? ఒకవేళ స్పందిచాలనుకుంటే.. ప్రజల్ని కూడా తనలా ఇంటిపట్టునే ఉండమని కోరాలి. అంతేతప్ప, అమరావతి కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేయమని పిలుపు ఇవ్వకూడదు. ఇంతకంటే స్వార్థం ఉంటుందా? ఇలాంటి ధోరణి చూసే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా బాబును అసహ్యించుకుంటున్నారు.