తండ్రీకొడుకులిద్దరూ మీడియాకు బానిసలయ్యారు. కాకపోతే తండ్రి మెయిన్‌స్ట్రీమ్ మీడియాకు, కొడుకు మాత్రం సోషల్ మీడియాకు బానిసలయ్యారు.ఆ తండ్రీకొడుకులెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తండ్రి చంద్రబాబు, కొడుకు లోకేశ్. ఐదేళ్లు అధికారంలో రాజభోగాన్ని అనుభవించి….ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుని అధికారానికి దూరమైనప్పటికీ తండ్రి ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాను, కొడుకు ట్విటర్ పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతున్నారు.
ఏ మీడియా అయినా తమకు ఓట్లు రాల్చవనే వాస్తవాన్ని తండ్రీకొడుకులిద్దరూ గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్నే తీసుకొందాం. కనీసం ప్రతిపక్ష అభ్యర్థులతో నామినేషన్లు కూడా వేయించడం లేదని చంద్రబాబు మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నాడు. ఇక లోకేశ్ మాత్రం పొంతన లేని, నాన్ సీరియస్ ట్వీట్స్ చేస్తూ అభాసుపాలు అవుతున్నాడు.
సీఎం జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, సీఎం సొంత జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లా డోన్, గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాల్టీల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అభ్యర్థులు అడ్డుకున్నారని, కావున అక్కడ ఎన్నికలు రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలో ఆ నాలుగు చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్‌కు ఆయన లేఖ రాశాడు. ఇంకా రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై చంద్రబాబు పరిశీలన అభినందనీయం. కొడుకు లోకేశ్ చేయాల్సిన పనిని…70 ఏళ్లు పైబడినా, ఆ బాధ్యతను చంద్రబాబే భుజాన వేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం.
ఇదే సమయంలో చంద్రబాబు కేవలం మీడియాకు మాత్రమే పరిమితం కావడం వల్ల కార్యకర్తలు, నాయకుల్లో నైతిక స్థైర్యాన్ని కలిగించలేకపోతున్నాడు. మీడియాలో హెచ్చరికలు. ఈసీకి ఫిర్యాదులు చేసినంత మాత్రాన క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రాదు. తాను లేదా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తన కుమారుడు లోకేశ్‌ను క్షేత్రస్థాయికి పంపి, స్థానిక నాయకులతో కలిసి బాధిత ప్రజలకు అండగా నిలబడడానికి బదులు…అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నారు.
ఒక వైపు జగన్‌ది రాక్షస పాలన అని బాబు విమర్శిస్తుంటే, మరోవైపు టీడీపీ నుంచి అదే రాక్షసుడి నాయకత్వంలో పనిచేయడానికి పెద్ద ఎత్తున వెళ్లడాన్ని ఎలా చూడాలి? జగన్ సర్కార్ అప్రజాస్వామిక విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే…ఇలాంటి పాలనే కొనసాగాలని బాబు లోలోన కోరుకుంటున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ అలా అనుకున్నా, బాధిత ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షాన్ని మాత్రం ఎందుకు ఆదరిస్తారనే మౌలికమైన అంశం 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలికి తెలియదా?
ఏది ఏమైనా జగన్‌ను విమర్శించడానికి ముందు బాబులో మార్పు రావాలి. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లో కూడా మార్పు రావాలి. తండ్రీకొడుకులిద్దరూ మీడియా బానిసత్వం నుంచి బయటపడాలి. అప్పుడే టీడీపీకి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. అంతే తప్ప మాటలకు ఓట్లు రాలుతాయనుకుంటే మాత్రం అంత కంటే తప్పిదం మరొకటి ఉండదని ఇప్పటికైనా తండ్రీకొడుకులిద్దరూ గ్రహిస్తే మంచిది.