ఈ విషయంలో జగన్ సర్కార్ ధోరణి వైసీపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులకు కూడా నచ్చడం లేదు. జగన్ సర్కార్ విపరీత ధోరణికి నిదర్శనంగా చెప్పుకునే ఘటన ఇది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నిధుల విడుదల విషయమై గత కొంత కాలంగా జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది.
చివరికి వ్యవహారం కోర్టు వరకు వెళితే తప్ప …జగన్ సర్కార్ దిగిరాక తప్పని పరిస్థితి. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది చెప్పిన సమాధానం జగన్ సర్కార్‌కు అవమానమనే చెప్పాలి. ఇదంతా జగన్ సర్కార్ స్వయంకృతాపరాధం అని చెప్పక తప్పదు.
ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షల నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆర్థికశాఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ గత ఏడాది డిసెంబర్‌లో లేఖ రాశారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో మధ్యలోనే ఆగిపోయింది. తమను మాట మాత్రం కూడా సంప్రదించకుండా ఎన్నికలను నిలిపివేశారనే ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వంలో చూశాం.
ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారినట్టు ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు, ఆ తర్వాత న్యాయస్థాన ఆదేశాలతో నిమ్మగడ్డను ప్రభుత్వం తిరిగి నియమించాల్సి వచ్చింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆగస్టులో మళ్లీ నిధుల విషయాన్ని గుర్తు చేస్తూ , స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కోసం రూ.40 లక్షలను ప్రత్యేక గ్రాంట్‌గా ఇవ్వాలని ఆర్థికశాఖకు నిమ్మగడ్డ లేఖ రాశారు.
అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదని ఇటీవల హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వ న్యాయవాది సమాధానం చెప్పగా, ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని హైకోర్టు బదులిచ్చింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. తాము ఎప్పుడు నిధులు ఎప్పుడు కోరితే అప్పుడు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో ఆయన కోరారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ చేపట్టారు. నిమ్మగడ్డ పిటిషన్‌పై ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదన వినిపిస్తూ రెండు గంటల్లో ఎన్నికల కమిషన్ ఖాతాలో జమ అవుతాయని కోర్టుకు విన్నవించారు. కావున విచారణ ముగిం చాలని ఆయన కోరారు.
అయితే నిధులు తమ ఖాతాలో జమ అయ్యాయ్యో లేదో ఎన్నికల కమిషన్ ద్వారా తెలుసుకున్న తర్వాత విచారణ ముగిస్తా మని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం జగన్ ప్రభుత్వం తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకునేలా ప్రవర్తిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడంలో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందనేం దుకు ఇదే నిలువెత్తు నిదర్శనం.
దాదాపు ఏడాదిగా నిధుల కోసం ఎస్ఈసీ ఆర్థికశాఖకు మొరపెట్టుకుంటున్నా స్పందించని ప్రభుత్వం …ఆ విషయమై న్యాయ స్థానాన్ని ఆశ్రయించే వరకు తెచ్చుకోవడం మొదటి తప్పు. తీరా న్యాయస్థానంలో మరో రెండు గంటల్లో నిధులు జమ అవుతాయని, కావున విచారణ ముగించాలని వేడుకోవడం ద్వారా జనంలోకి నెగెటివ్ సంకేతాలు పంపినట్టు కాదా? ఇది ఒక రకంగా అఖండ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలను కోర్టు బోనులో తలవంచుకునేలా చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం తన పని తాను చేసి ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవసరం, అలాగే పరిపాలనలో కోర్టు జోక్యం చేసుకునే అవసరం కలిగేవి కాదు కదా! ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందనే విమర్శలకు బలం చేకూర్చేలా ఎస్ఈసీకి నిధుల మంజూరులో జగన్ సర్కార్ వైఖరి ఉందని చెప్పక తప్పదు. ఒక ప్రజాప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి రావడం … జగన్ సర్కార్‌కు షేమ్ షేమ్ అని చెప్పక తప్పదు.