దివంగత వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిలకు టీఆర్ఎస్ నేతలు షాక్ ఇచ్చారు. ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి నీలకంఠం సాయిని పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలకు ఇంటికి తాళాలు వేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
నల్గొండ జిల్లాలో బుధవారం షర్మిల పర్యటించారు. మిర్యాలగూడ నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటించారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్నారు. సీనియర్ నేత, తన అనుచరుడు నర్సిరెడ్డి ఇంట్లో ఆమె టిఫిన్ చేశారు.
ఆ తర్వాత కరోనాతో మృతి చెందిన తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సెక్రెటరీ ఎండి సలీం కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆయన భార్య పిల్లలను ఓదార్చారు. కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం కార్యక్రమ షెడ్యూల్‌లో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి వెళ్లాల్సి ఉంది. ఆ గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యా యత్నం చేసిన తెలిసిందే.
అతన్ని పరామర్శించి జీవితంపై భరోసా కల్పించేందుకు ఆ గ్రామానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో షర్మిల ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ నుంచి పరామర్శించడానికి వస్తే ఇంటికి తాళం వేసి కనిపించడంతో ఒకింత షాక్‌కు గురయ్యారు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంపై చుట్టుపక్కల వారిని షర్మిల అనుచరులు ఆరా తీశారు. తండ్రితో కలిసి సాయి కోదాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు. షర్మిల వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, పోలీసులు నిన్న రాత్రి నీలకంఠ సాయి ఇంటికొచ్చి … ఇంట్లో లేకుండా వెళ్లిపోవాలని ఆదేశించినట్టు సమాచారం.
దీంతో అధికార పార్టీ నేతలు, పోలీసుల ఒత్తిడితో సాయి కుటుంబం ఇల్లు వదిలి వెళ్లినట్లు షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు. తమ నాయకురాలు షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు.
తాళం వేసిన నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో షర్మిల కాసేపు మాట్లాడారు. ఈ విషయమై తెలంగాణలో చర్చ జరుగుతోంది.