సిగ్గుచేటు: ఫిరాయించింది.. సీమను ఉద్ధరించడానికేనట!

'రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసమే పార్టీ మారాను..' ఇదీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పలికినమాట. చెప్పుకోవడానికి సిగ్గుచేటు, ఫిరాయింపుకు రాయలసీమను కూడా ముడిపెట్టడం, ఇలాంటివారు నేతలుగా చలామణి అవుతుండటం రాయలసీమ ప్రాంత దౌర్భాగ్యం…

'రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసమే పార్టీ మారాను..' ఇదీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పలికినమాట. చెప్పుకోవడానికి సిగ్గుచేటు, ఫిరాయింపుకు రాయలసీమను కూడా ముడిపెట్టడం, ఇలాంటివారు నేతలుగా చలామణి అవుతుండటం రాయలసీమ ప్రాంత దౌర్భాగ్యం అనిచెప్పాలి. ఫిరాయిస్తే ఫిరాయించారు, దానికి మళ్లీ రాయలసీమ పేరును వాడుకోవడం ఏమిటి? చెప్పుకోవడానికి కొంచెమైన మొహమాటం లేకుండా, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం జరిగిన ఫిరాయింపుకు రాయలసీమ సెంటిమెంట్ను అద్దడం ఈయన దివాళాకోరు తనాన్ని చాటుతోందని పరిశీలకులు అంటున్నారు.

తనకు భారతీయ జనతా పార్టీతో బోలెడంత అనుబంధం ఉందని టీజీ వెంకటేష్‌ చెప్పుకున్నారు. అయినా ఈయనకు అనుబంధం లేనిది ఏపార్టీతో? అన్నిపార్టీలూ చుట్టేశారు కదా! తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టారు, కాంగ్రెస్‌లో చేరారు, మళ్లీ తెలుగుదేశంలోకి వెళ్లారు, ఇప్పుడు బీజేపీ! ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్‌ అయిపోవడం టీజీ వెంకటేష్‌కు అలవాటుగా మారింది.

ఇలాంటి వారిని ప్రజలు కూడా నమ్మడం మానేశారు. అందుకే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీజీ వెంకటేష్‌ తనయుడిని కర్నూలు ప్రజలు ఓడించారు. పూటకో పార్టీ మారి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండేవారి పట్ల తమ వైఖరి ఏమిటో ప్రజలు తెలియజేశారు. అయినా టీజీ తీరులో మాత్రం మార్పు వచ్చినట్టుగా లేదని పరిశీలకులు అంటున్నారు.

అయినా చంద్రబాబుకు కూడా ఇలాంటివారు తగినశాస్తి చేస్తున్నారనే మాట కూడా సీమలో వినిపిస్తూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనుక్కొన్నారు, ఇప్పుడు టీడీపీ ఎంపీలు అధికారానికి అమ్ముడుపోతూ ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడుకు మాత్రం తగినశాస్తి జరిగిందని జనాలు అనుకుంటున్నారు.

ఎటొచ్చీ తను ఫిరాయించింది రాయలసీమ ప్రాంత అభివృద్ధికే అని టీజీ చెప్పుకోవడం మాత్రం కంపరంగా ఉందని జనాలు అంటున్నారు. ఆయన ఇన్నాళ్లూ ఏం ఉద్ధరించారో చెప్పాలని, కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా, తెలుగుదేశం హయాంలో రాజ్యసభ సభ్యుడిగా ఈయన కర్నూలు ప్రాంతాన్ని ఉద్ధరించింది ఏమిటో చెప్పి, తర్వాత వేరే కథల గురించి చెప్పాలని టీజీ వెంకటేష్‌ను ఉద్దేశించి జనాలు వ్యాఖ్యానిస్తున్నారు.

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే