ఇదే కాషాయదళం ఎక్స్‌ట్రాలు అంటే..!

ఆంధ్రప్రదేశ్ లోని సామాన్య ప్రజలు.. తమను అభినందించడానికి, అభిమానించడానికి ఒక్కటంటే ఒక్క కారణాన్ని కూడా బీజేపీ వారు తయారుచేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీ ప్రజలకు బీజేపీపై రోజురోజుకు మరింత మంటెత్తేలా విశాఖ ఉక్కును ప్రెవేటీకరించే…

ఆంధ్రప్రదేశ్ లోని సామాన్య ప్రజలు.. తమను అభినందించడానికి, అభిమానించడానికి ఒక్కటంటే ఒక్క కారణాన్ని కూడా బీజేపీ వారు తయారుచేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీ ప్రజలకు బీజేపీపై రోజురోజుకు మరింత మంటెత్తేలా విశాఖ ఉక్కును ప్రెవేటీకరించే విషయంలో పునరాలోచన లేదని కేంద్రం తేల్చిచెప్పడం జరిగింది. 

ఈ మంటలకు ఆజ్యం జత చేస్తున్నట్లుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కొత్త కార్యక్రమం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపఠానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని ఇంకా ఏం నాశనం చేయకుండా వదిలారని మోడీకి పాలాభిషేకం చేస్తున్నారంటూ ప్రజలు విస్తుపోతున్నారు. 

ఇంతకూ విషయం ఏంటంటే.. 

కరోనా సమయంలో ఆహార భద్రత కల్పించడం తో పాటు రేషన్ బియ్యం రాయితీ కిలో బియ్యానికి 33రూపాయల రాయితీ ఇస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపఠానికి పలు ప్రాంతాల్లో పాలాభిషేకాలు నిర్వహించాలనేది బిజెపి ఒక కార్యక్రమంగా తలపెట్టింది. 

దేశ ప్రధాని నేరుగా మాకుటుంబాలకు రేషన్ అందిస్తున్న భగవత్ స్వరూపుడుగా పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గండేపల్లి మండలం పి నాయకంపల్లి అనే గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీల కు పాలాభిషేకం చేశారు. ఇలాంటి పనులన్నీ ప్రజలకు మాత్రం ఎగస్ట్రా వేషాలుగా కనిపిస్తున్నాయి. 

ఒకవైపు ప్రజలంతా మోడీని తిట్టుకునే వాతావరణం ఏర్పడి ఉండగా.. ఆయన ఫ్లెక్సిలకు పాలు పోస్తూ.. మభ్య పెట్టాలని చూస్తే మాయలో పడేంత చిల్లరగా కనిపిస్తున్నామా అని కమల నాయకులను నిలదీసేలా ప్రజలు దెప్పిపొడుస్తున్నారు. 

ఒక రకంగా చూడబోతే రాష్ట్ర బిజెపి నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది. ఇక్కడేమో ప్రజల ఎదుటకు వెళితే.. నిందలు తప్ప మరోటి దక్కేలా లేదు. అటు కేంద్రంలోని పార్టీ అధిష్ఠానం నుంచి మోడీని మహానుభావుడిగా ప్రొజెక్టు చేయడానికి ప్రతిచోటా కార్యక్రమాలు నిర్వహించాలనే యాక్షన్ ప్లాన్ వచ్చి నెత్తి మీద పడిపోతుంటుంది. అసలే పార్టీ పట్ల నెగటివ్ ఉన్న రాష్ట్రంలో.. మోడీకి పాలాభిషేకాలు చేసే కార్యక్రమాలు కామెడీ అనిపించుకుంటాయి కదా.. అని వారిలో వారే మధనపడిపోతున్నారు. 

రాష్ట్రానికి ఫలానా మంచి చేయండి.. రాష్ట్రంలో పార్టీకి వైభవ స్థితి తీసుకురాగలం అని అడగగల స్థితిలో ఒక్క నాయకుడు కూడా లేడు. ఒకవేళ వీరు అడిగినా.. వీరి మాటలు పట్టించుకుని.. ఆ ప్రకారం ఏదైనా మేలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదు. అయిన కాడికి ఏపీ అవకాశాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోలేక, మోడీ భజన కార్యక్రమాలు నిర్వహించలేక బిజెపి నేతలు సతమతం అవుతున్నారు.