వైసీపీ-బీజేపీ అక్రమ సంబంధం.. టీడీపీ ఆక్రోషం

స్కూళ్లు తెరిచారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ చెత్త లాజిక్ లతో వైసీపీపై విరుచుకుపడుతోంది టీడీపీ. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకి ఒరిగేదేమీ లేదని తెలిసినా కూడా.. నిమ్మగడ్డ ఉన్నప్పుడే ఆ…

స్కూళ్లు తెరిచారు కానీ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారంటూ చెత్త లాజిక్ లతో వైసీపీపై విరుచుకుపడుతోంది టీడీపీ. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకి ఒరిగేదేమీ లేదని తెలిసినా కూడా.. నిమ్మగడ్డ ఉన్నప్పుడే ఆ లాంఛనం పూర్తి చేసి హడావిడి చేయాలనేది పచ్చ పార్టీ ప్రణాళిక.

అయితే ఇటీవల ఎస్ఈసీ హోదాలో రమేష్ కుమార్ సేకరించిన అభిప్రాయ సేకరణలో కూడా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడే లేదని మెజార్టీ పార్టీల అభిప్రాయంగా తేలింది. దీంతో టీడీపీ శిబిరంలో మథనం మొదలైంది. 

పుండుమీద కారంలా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిమ్మగడ్డకు లేఖ రాయడంతో మరింత కలకలం రేగింది.

రాష్ట్రంలో చాలామంది కొత్తగా ఓట్లు నమోదు చేసుకోడానికి ఉత్సాహం చూపుతున్నారని, వారికి మరో అవకాశం కల్పించాలని, ఓటరు లిస్ట్ లో పేరు నమోదుకు కనీసం రెండు నెలలు గడువు ఇవ్వాలని కోరుకూ ఎస్ఈసీకి సోము వీర్రాజు తాజాగా ఓ లేఖ రాశారు. 

కొత్త ఓట్ల నమోదు కోసం 2 నెలలు గడువు కోరారంటే.. ఎన్నికలను మరింత కాలం వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే వీర్రాజు ఆ లేఖ రాశారని రాద్ధాంతం చేస్తోంది టీడీపీ. వైసీపీకి అనుకూలంగా వీర్రాజు మసలుకుంటున్నారని నిందలు వేస్తోంది.

అయితే ఇదే వీర్రాజు ఆదేశాలతో బీజేపీ నేతలు ఎస్ఈసీ మీటింగ్ లో ఏం చెప్పారో టీడీపీ నాయకులు మరచిపోయినట్టున్నారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని చెబుతూ.. ఏకగ్రీవాలని రద్దు చేయాలని బీజేపీ కోరింది. 

ఏకగ్రీవాలు వద్దు అన్నారంటే.. పరోక్షంగా వైసీపీ విజయాలను రద్దు చేయాలని ప్రయత్నించినట్టే కదా. అంటే అప్పుడు బీజేపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించింది అనుకోవాలా?

మొత్తమ్మీద వీర్రాజు లేఖ మాత్రం టీడీపీలో కలవరం పుట్టించింది. ఎన్నికలు వాయిదా వేయాలని నేరుగా అడగకుండా.. ఓటర్ల నమోదు అంటూ కొత్త మెలిక పెట్టడం పచ్చపార్టీ ఊహించని పరిణామం. అందుకే బీజేపీ, వైసీపీపై కలసి నిందలు వేస్తోంది టీడీపీ అనుకూల మీడియా.

దోచుకున్నోడికి దోచుకున్నంత